ఫుట్‌బాల్ స్టేడియంలో కూలిన గోడ


Mon,July 17, 2017 12:01 AM

-8 మంది మృతి.. 60 మందికి గాయాలు

డాకర్, జూలై 16: సెనెగల్ రాజధాని డాకర్‌లో శనివారం జరిగిన ఫుట్‌బాల్ లీగ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అపశృతి చోటుచేసుకున్నది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగా మరోవైపు యూఎస్ ఒకామ్, స్టేడ్ డి ఎంబోర్ అభిమానుల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో స్టేడియంలో ఉన్న వారు పరుగెత్తగా గోడ కూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది చనిపోయారు. అందులో ఒక బాలిక కూడా ఉన్నారు. 60 మంది అభిమానులు గాయపడ్డారు. వీరికి డాకర్‌లోని దవాఖానలో చికిత్స అందిస్తున్నామని ఏఎఫ్‌పీ వార్తాసంస్థకు సెనెగల్ క్రీడలశాఖ మంత్రి మాతర్ బా తెలిపారు. శనివారం అర్ధరాత్రి మ్యాచ్ స్కోర్ 2-1 వద్ద ఉండగా స్థానిక యూఎస్ మద్దతుదారులు స్టేడ్ డి ఎంబోర్ అభిమానులపై రాళ్లతో దాడిచేశారు. దీంతో వారు తమ సీట్ల నుంచి వెళ్లిపోయే క్రమంలో తొక్కిసలాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించడంతో స్టేడియంలో భయానక వాతావరణం నెలకొన్నది. అందరూ ఒకేసారి వెళ్లడంతో గోడకూలిపోయింది. కొందరిపై సిమెంట్ దిబ్బలు పడిపోవడంతో చనిపోయారని ప్రత్యక్షసాక్షి చెఖ్‌మబా డియోప్ తెలిపారు.

437

More News

VIRAL NEWS