థాయ్ యువరాణికి చుక్కెదురు

Tue,February 12, 2019 02:23 AM

- ప్రధాని పదవికి పోటీపడకుండా ఉబోల్త్రనపై అనర్హత వేటు
బ్యాంకాక్, ఫిబ్రవరి 11: థాయిలాండ్ ప్రధాన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న యువరాణి ఉబోల్త్రనకు చుక్కెదురైంది. ఆ పదవికి పోటీపడేందుకు వీల్లేకుండా ఆమెపై సోమవారం అనర్హత వేటు వేశారు. దీంతో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్ర కుటుంబానికి చెందిన థాయ్ రక్షా చార్త్ పార్టీతో ఆమెకు గల స్వల్పకాలిక రాజకీయ అనుబంధానికి తెరపడింది. ప్రధాని పదవికి ఉబోల్త్రన అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చుతూ థాయిలాండ్ రాజు (ఉబోల్త్రన సోదరుడు) మహా వజ్రాలంగ్‌కోర్న్ కొద్ది రోజుల క్రితం జారీచేసిన రాజాజ్ఞ మేరకు ఆమెను అనర్హురాలిగా ప్రకటించినట్టు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. వచ్చే నెల 24న జరిగే ఎన్నికల తర్వాత తమ ప్రధాని అభ్యర్థిగా యువరాణి ఉబోల్త్రన బరిలోకి దిగుతారని థాయ్ రక్షా చార్త్ పార్టీ సంచలన ప్రకటన చేయడంతో థాయిలాండ్‌లో శుక్రవారం నుంచి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్వీయ ప్రవాస జీవితాన్ని గడుపుతున్న తక్సిన్ షినవత్ర ఎన్నికలకు కేవలం కొద్ది వారాల ముందు నడిపిన రహస్యమంత్రాంగం ఫలితంగానే ప్రధాని పదవికి పోటీపడేందుకు ఉబోల్త్రన మొగ్గు చూపినట్టు తెలుస్తున్నది. అయితే ఆమె ఆశలు ఎంతోసేపు నిలువలేదు.

2076
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles