నిద్రలోనే గుహను దాటారు!

Thu,July 12, 2018 06:59 AM

Thai cave rescue Video shows Wild Boars players chatting making victory signs

-స్వల్పంగా మత్తుమందు ఇచ్చి స్ట్రెచర్లలో కట్టి బాలల తరలింపు
-తొలుత స్విమ్మింగ్‌పూల్‌లో ఆ వయసు పిల్లలతో ట్రయల్స్
-థాయ్ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించి వెల్లడవుతున్న వాస్తవాలు

చియాంగ్ రాయ్, జూలై 11: థాయ్‌లాండ్‌లోని తామ్ లుయాంగ్ గుహ నుంచి 12 మంది బాలలు, వారి ఫుట్‌బాల్ కోచ్ సురక్షితంగా బయటపడటంతో ఆ దేశ ప్రజలు సంతోషంతో సంబురాలు జరుపుకొంటున్నారు. ఇక ఆ చిన్నారుల తల్లిదండ్రుల ఆనందానికైతే అవధులే లేవు. అయితే ఆ పిల్లలను గుహ నుంచి బయటకు తీసుకొచ్చిన విధానంపై ఒక్కొక్క విషయం బయటపడుతున్నది. ఎంతో ప్రమాదకరమైన మార్గం నుంచి ఆ బాలలకు స్వల్పంగా మత్తుమందు ఇచ్చి, వారు నిద్రిస్తుండగా స్ట్రెచర్లపై గుహ నుంచి వెలుపలికి తీసుకొచ్చామని ఒక డైవర్ బుధవారం పేర్కొన్నారు. బాలలను రక్షించిన బృందంలో ఒక సభ్యుడిగా ఉన్న థాయ్‌లాండ్ నౌకా దళం మాజీ కమాండర్ చైయానంత పీర్ణారాంగ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. కొందరు బాలలు పూర్తిగా నిద్రపోగా, మరికొందరు చేతి వేళ్లను పైకి, కిందికి ఆడించేవారు. అయితే వారు ఊపిరి తీసుకుంటూ ఉండేవారు అని చెప్పారు. బాలలందరినీ రక్షించిన అనంతరం అందరికన్నా చివరిగా పీర్ణారాంగ్ గుహనుంచి బయటకు వచ్చారు. దారి పొడుగునా ఉన్న డాక్టర్లు ఎప్పటికప్పుడు బాలల నాడిని పరీక్షించే వారని చెప్పారు. బాలలను బయటకు తరలించడానికి ముందుగానే వారిని స్ట్రెచర్లలో చుట్టేశామని తెలిపారు. బయటకు తరలించే సమయంలో బాలలు భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు వారికి మానసిక ప్రశాంతతనిచ్చే మత్తుమందును స్వల్ప మొత్తంలో ఇచ్చారని థాయ్ జుంటా చీఫ్ మంగళవారం వెల్లడించారు. ఆస్ట్రేలియా డాక్టర్ రిచర్డ్ హారిస్ లేకపోతే బాలలను రక్షించే ప్రక్రియ విజయవంతం అయ్యేది కాదని ఈ ఆపరేషన్ అంతటికీ నేతృత్వం వహించిన నరోంగ్‌సక్ అన్నారు.

అత్యంత సాహసోపేతం ఈ మిషన్

గుహలోపల చిమ్మచీకటి ఉండేదని, అరగంట వరకూ ఏమీ కనిపించేది కాదని రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అమెరికా వైమానిక దళం సభ్యుడు డెరెక్ ఆండర్సన్ చెప్పారు. జూన్ 28న తాము గుహ వద్దకు వచ్చినప్పుడు గుహ వద్ద నేల పొడిగా ఉందని, కానీ అరగంటలోనే మూడు అడుగుల వరకూ నీరు వచ్చి చేరిందని అన్నారు. గుహ లోపలి నుంచి భారీ స్థాయిలో నీటిని తోడేయడం వల్ల గాలి ప్రవేశించే అవకాశం ఏర్పడిందని, అది తమ రెస్క్యూ ఆపరేషన్‌ను సులభతరం చేసిందని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌కు ముందుగా, గుహలో చిక్కుకున్న బాలల వయస్సున్న వారితో ఒక స్విమ్మింగ్‌పూల్‌లో ప్రయోగాలు చేశామని చెప్పారు. ఒక్కొక్క బాలుడిని స్ట్రెచర్‌కు గట్టిగా బిగించి కట్టాము. తద్వారా డైవర్లకు వారిపై పూర్తిగా నియంత్రణ లభించింది అని అన్నారు. ఎక్కడైనా ఇరుకు ప్రదేశంలో మాస్క్ చిరిగి పోయినా ప్రెషర్ వల్ల నీరు లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు చిన్నారుల ముఖానికి ప్రెషర్ మాస్క్‌లు అమర్చాం అని చెప్పారు. మొదట బాలలను కనుగొనేందుకు జరిగిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చిన్న చిన్న సందుల్లోకి చల్లటి వరదనీరు వచ్చి చేరడంతో వాటి నుంచి అవతలికి పోవడం సాధ్యం కాలేదు. వాతావరణం మెరుగుపడిన తరువాత డైవర్లు గుహలోపలికి తాళ్లు వేసుకుంటూ వెళ్లినప్పుడు కూడా పరిస్థితి ఎంతో ప్రమాదకరంగా ఉన్నది. నాలుగైదు గంటలు కష్టపడినా 40 లేదా 50 మీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లే వారము కాదు. గుహలోని మొత్తం తొమ్మిది చాంబర్ల నుంచి ఒక్కో బాలుడిని బయటకు తీసుకురావడానికి డజన్ల మంది సాయపడ్డారు. ఏది ఏమైనా జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించేదానిని మేం సాధించాం అని ఆండర్సన్ పేర్కొన్నారు.

డాక్టర్‌కు పితృ వియోగం

అంతా అసాధ్యమనుకున్న ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను సుసాధ్యం చేసి ప్రపంచవ్యాప్తంగా పొగడ్తలందుకుంటున్న ఆస్ట్రేలియన్ డాక్టర్ రిచర్డ్ హారిస్‌కు గుహ వెలుపలికి రాగానే విషాద వార్త ఎదురైంది. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన కొద్ది సేపటికే హారిస్ తండ్రి మరణించినట్టు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రకటించారు.

త్వరలో హాలీవుడ్ సినిమా!

బాలలు, వారి కోచ్ గుహలోకి ఎలా వెళ్లారు.. భారీ వర్షాలు కురవడంతో వరద పెరిగి గుహ నీళ్లతో ఎలా నిండిపోయింది. తర్వాత బాలలు చీకటిలో ఎలా గడిపారు. వారిని రెస్క్యూ సిబ్బంది ఎలా సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు తదితర అంశాలన్నింటినీ క్రోఢీకరిస్తూ త్వరలో సినిమా తీయడానికి హాలీవుడ్‌కు చెందిన ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ప్రయత్నిస్తున్నది.
Ekkapol

పౌరసత్వం లేదు .. కానీ ప్రపంచ నీరాజనం

ఎక్‌కాపోల్ చాంత్వాంగ్.. అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 12 మంది బాలుర ఫుట్‌బాల్ కోచ్ అంటే కోట్లాది మందికి వెంటనే ఆయన గుర్తుకువస్తారు. అందరూ ముద్దుగా కోచ్ ఏక్ అని పిలుస్తారు. నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం, గుండెనిబ్బరం, పట్టుదలకు మారుపేరు ఈ 25 ఏండ్ల కోచ్ చాంత్వాంగ్. 10 ఏండ్ల వయస్సులోనే ఇతడు బౌద్ధ సన్యాసిగా మారాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు వృద్ధురాలైన తన అమ్మమ్మ బాగోగుల్ని చూసుకునేందుకు తిరిగివచ్చి సాధారణ జీవితాన్ని ఆరంభించాడు. అనంతరం వైల్డ్ బోర్స్ ఫుట్‌బాల్ టీమ్‌కు కోచ్‌గా మారాడు. 12 మంది బాలలను గుహలోకి తీసుకెళ్లడంపై తొలుత కోచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కానీ, గుహలోని పరిస్థితులు అవగతమయ్యాక, బాలల్లో ధైర్యాన్ని నూరిపోస్తూ కోచ్ వారికి కొండంత అండగా ఉండడాన్ని గమనించి దేశవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తింది. నన్ను క్షమించండి.. అంటూ గుహలోంచి బాలల తల్లిదండ్రులకు కోచ్ చాంత్వాంగ్ రాసిన ఉత్తరం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది హృదయాలను తాకింది. దాంతో ఆయన ఒక్కసారి హీరోగా మారిపోయారు. ఇదంతా నాణేనికి ఒక వైపు.. వాస్తవాల్లోకి వెళితే కోచ్ పరిస్థితి అత్యంత దయనీయం. ఆయన్ను థాయ్‌లాండ్ ప్రభుత్వం అసలు ఒక పౌరుడిగానే భావించడం లేదు. ఎందుకంటే బర్మా, లావోస్ తదితర ప్రాంతాల నుంచి వలసవచ్చిన ప్రజలు ఇక్కడి మెశాయ్ ప్రాంతంలో శతాబ్దాలుగా నివసిస్తున్నారు. వీరికి పౌరసత్వం, పాస్‌పోర్టు, హక్కులు, గుర్తింపుకార్డులు అంటూ ఏవీ ఉండవు. మాంచెస్టర్ క్లబ్ నుంచి కోచ్‌కు ఆహ్వానం అందింది కానీ, పాస్‌పోర్టు లేకపోవడంతో అక్కడికి వెళ్లలేకపోయాడు. ఎన్నో అవకాశాల్ని ఇలా అతడు కోల్పోయాడు. గుహలోని 12 మంది బాలల్లో ముగ్గురు వలసదారులే. ప్రస్తుతం కోచ్‌కు, బాలలకు తప్పకుండా ప్రభుత్వం పౌరసత్వం కల్పిస్తుందని భావిస్తున్నా. ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో వీళ్లు నైపుణ్యమైన ఆటగాళ్లుగా ఎదగలేకపోయారు. ఆంక్షలు ఉండడంతో వీరి ప్రతిభ కేవలం ఇక్కడికే పరిమితమైంది అని వైల్డ్ బోర్స్ ఫుట్‌బాల్ క్లబ్ వ్యవస్థాపకుడు నొప్పారత్ కంతవోంగ్ పేర్కొన్నారు.
Indians

రెస్క్యూ ఆపరేషన్‌లో భారతీయులు

చిన్నారులను రక్షించేందుకు ఎన్నో కఠిన పరిస్థితుల మధ్య చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌లో ఇద్దరు భారతీయ ఇంజినీర్లు కూడా పాల్గొన్నారు. వారే మహారాష్ట్రకు చెందిన ప్రసాద్ కులకర్ణి, శ్యామ్ శుక్లా. గుహలోపలి నుంచి నీరు తోడిపోయడానికి భారత్‌కు చెందిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సాయాన్ని అందించింది. ఈ సంస్థలో ప్రసాద్, శ్యామ్ ఉద్యోగులుగా ఉన్నారు. మా పని గుహ నుంచి నీటిని బయటకు పంపించడం. మధ్య మధ్యలో వర్షాలురావడంతో గుహలోపల నీటి స్థాయి పెరిగిపోయేది. దీంతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ సరఫరా కూడా సరిగ్గా లేకపోవడంతో చిన్న చిన్న పంపుల సాయంతో నీటిని తోడాము. డైవర్లు ఎంతో క్లిష్ట పరిస్థితులను అధిగమించి బాలలను బయటకు తీసుకొచ్చారు అని ప్రసాద్, శ్యామ్ చెప్పారు.

4105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles