అమెరికాలో దారుణం

Mon,June 17, 2019 01:54 AM

Telugu Family Murdered Suspiciously In America

-తెలుగు కుటుంబం అనుమానాస్పద మృతి
-అనుమానాస్పద స్థితిలో ఏపీ కుటుంబం మృతి
-భార్య, ఇద్దరు కుమారులను కాల్చిచంపి భర్త ఆత్మహత్య?
-మానసిక ఒత్తిడే కారణమని అనుమానం
-హత్య కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్న పోలీసులు

ఐవోవా: అమెరికాలోని అయోవా రాష్ట్రంలో ఘోరం జరిగింది. వెస్ట్ డెస్ మొయినిస్ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ తెలుగు కుటుంబం శనివారం అనుమానాస్పదంగా మృతిచెందింది. భార్య, భర్త, 15 ఏండ్లలోపు ఇద్దరు పిల్లలు తుపాకీ కాల్పుల గాయాలతో ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారు. ఏపీకి చెందిన సుంకర చంద్రశేఖర్(44), సుంకర లావణ్య(41) దంపతులు తమ 10, 15 ఏండ్లవయసు ఉన్న ఇద్దరు కొడుకులతో కలిసి వెస్ట్‌డెస్ మొయినిస్‌లో సొంత ఇంట్లో నివసిస్తున్నారు. కొంతకాలంగా చంద్రశేఖర్ మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. తుపాకీ గాయాలతోనే నలుగురు చనిపోయారని పోలీసులు నిర్ధారించారు. కుటుంబసభ్యుల్లో ఒకరు తమను కాపాడాలంటూ ఇంటి ఆవరణలో అరుస్తూ కనిపించారని స్థానికులు తెలిపినట్టు పోలీసులు చెప్పారు. భార్యతోపాటు ఇద్దరు పిల్లలను చంద్రశేఖరే తుపాకీతో కాల్చి చంపి.. ఆపై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని భావిస్తున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా? లేదా మరేదైనా కారణమా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న చంద్రశేఖర్ బంధువులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకొని.. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక దవాఖానకు తరలించారు. చంద్రశేఖర్ ఈ ఏడాది మార్చిలోనే ఇంటిని కొనుగోలు చేశారు.

560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles