ఎస్‌సీవో ప్రగతికి దౌత్యప్రాధాన్యం

Tue,April 24, 2018 04:08 AM

Sushma Swaraj Meets Chinese Vice President Wang Qishan

Sushma-Swaraj
సుష్మాస్వరాజ్‌తో భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడి
బీజింగ్, ఏప్రిల్ 23: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) ప్రగతిని దౌత్య ప్రాధాన్యాలలో ఒకటిగా తమ దేశం భావిస్తున్నదని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సోమవారం ఎస్‌సీవోలో భాగప్వాములుగా ఉన్న మిగతా ఏడు దేశాల విదేశాంగ మంత్రులతో కలిసి జిన్‌పింగ్‌ను కలుసుకున్నారు. ఎస్‌సీవో ప్రధాన కార్యదర్శి, ఎస్‌సీవో ప్రాంతీయ ఉగ్రవాద వ్యతిరేక కమిటీ డైరెక్టర్ కూడా వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వారితో మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ అభివృద్ధిని మరింత పెంచడానికి తాము ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. కింగ్‌డావోలో జూన్‌లో జరుగనున్న ఎస్‌సీవో సదస్సు విజయవంతంగా అవుతుందని విశ్వస్తున్నామని జిన్‌పింగ్ అన్నట్లు చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించింది. చైనాలోని వూహాన్ సిటీలో ఈనెల 27.28 తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీ కానున్నారు. తరువాత కింగ్ డావో జరిగే సదస్సుకు కూడా మోదీ హాజరవుతారని భావిస్తున్నారు. ఎస్‌సీవోలో చర్చించాల్సిన రాజకీయ, ఆర్థిక, భద్రత తదితర అంశాల ఎజెండాను ఖరారు చేసేందుకు 8 మంది ఎస్‌సీవో దేశాల విదేశాంగమంత్రులు మంగళవారం బీజింగ్‌లో సమావేశం కానున్నారు. భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇందులో పాల్గొననున్నారు. చైనా, భారత్, రష్యా, పాకిస్థాన్ , తజికిస్థాన్, కిర్గిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ ఎస్‌సీవోలో సభ్యదేశాలుగా ఉన్నాయి.

ఒకరి భాష ఒకరు నేర్చుకోవాలి: సుష్మా

భారతీయులు, చైనీయులు తమ మధ్య ఉన్న భావ వ్యక్తీకరణలో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ఒకరి దేశ భాషలను మరొకరు నేర్చుకోవాలని విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. అలా చేయడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్ఠమవుతాయని పేర్కొన్నారు. భారత-చైనాల మైత్రి పెంపులో హిందీ భాష అనే అంశంపై బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. భిన్న భాషల వారు మాట్లాడుకునేప్పుడు మధ్యన దుబాసీ ఉన్నా అతను భాషను మాత్రమే అనువదించి చెప్పగలడు తప్ప భావాన్ని సరిగా వివరించలేడని, కాబట్టి పరస్పర భాషలు నేర్చుకుంటే ఒకరి నొకరు సరిగా అర్థం చేసుకోవచ్చునని ఆమె అన్నారు.

వాణిజ్య రక్షణ వాదం ముప్పుపై మోదీ, జిన్‌పింగ్ చర్చ

వూహాన్ సిటీలో ఈనెల 27, 28 తేదీల్లో జరుగనున్న భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ గత వందేండ్లలో ప్రపంచంలో వచ్చిన మార్పులు, వాణిజ్య రక్షణవాదం ముప్పు తదితర అంశాలపై చర్చిస్తారని, వారి సమావేశం ద్వారా ప్రపంచం సానుకూల స్వరాలను వింటుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూకాంగ్ సోమవారం తెలిపారు. మోదీ, జిన్‌పింగ్ భేటీలో ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు విషయాలు చర్చిస్తారని, ఇద్దరు అగ్రనేతల భేటీ రెండు దేశాల ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చడంతోపాటు ప్రపంచశాంతి, సుస్థిరత, అభివృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS