పాక్‌లో చర్చిపై ఐఎస్ దాడి


Mon,December 18, 2017 02:28 AM

-తొమ్మిది మంది దుర్మరణం.. 44 మందికి గాయాలు
-విచక్షణారహితంగా కాల్పులు.. అనంతరం ఆత్మహుతి దాడి

కరాచీ/ ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలో ఓ చర్చిపై ఆదివారం ఐఎస్ ఉగ్రవాదులు పంజా విసిరారు. భారీగా ఆయుధాలు ధరించిన ముష్కరులు తొలుత కాల్పులకు తెగబడ్డారు. అనంతరం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా.. చిన్నారులు, మహిళలు సహా 44 మంది గాయపడ్డారు. దీంతో చర్చి రక్తసిక్తంగా మారింది. తక్షణమే స్పందించిన భద్రతా సిబ్బంది ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరో ఇద్దరు పారిపోయినట్టు తెలుస్తున్నది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. క్వెట్టాలోని జార్‌ఘూన్ రోడ్డులో ఉన్న బేతెల్ మెమోరియల్ చర్చిపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారని బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ సర్ఫరాజ్ భుక్తి తెలిపారు. దాడి సమయంలో చర్చిలో సుమారు 400 మంది భక్తులు ఉన్నారని పేర్కొన్నారు. కాగా చర్చిపై దాడిచేసిన ఉగ్రవాదుల సంఖ్యపై విరుద్ధ ప్రకటనలు వచ్చాయి. దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు పాల్గొన్నారని బలుచిస్తాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ మౌజం అన్సారీ తెలుపగా.. నలుగురు పాల్గొన్నారని డీఐజీ అబ్దుల్ రజాక్ పేర్కొన్నారు. అంతకుముందే సజ్జన్ గ్రూప్‌నకు చెందిన తెహ్రీక్ ఏ తాలిబన్ నుంచి మెథడిస్ట్ స్కూళ్లు, చర్చిలకు ఇటీవల బెదిరింపు లేఖలు అందినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. చర్చిపై ఉగ్రదాడిని పాకిస్థాన్ అంతర్గతశాఖ మంత్రి అషన్ ఇక్బాల్, ఆర్మీ చీఫ్ జనరల్ కమార్ జావేద్ బజ్వా ఖండించారు.
Pak-Church

258

More News

VIRAL NEWS