ఈస్టర్ వేళ శ్రీలంకలో ఉగ్రవిలయం

Mon,April 22, 2019 11:07 AM

-కొలంబో సహా మూడు నగరాల్లో ఎనిమిది బాంబుపేలుళ్లు
-క్రైస్తవులు, టూరిస్టులు లక్ష్యంగా చర్చిలు, ఫైవ్‌స్టార్ హోటళ్లపై దాడి
-వరుస పేలుళ్లతో చిగురుటాకులా వణికిన లంక
-దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, సోషల్‌మీడియాపై తాత్కాలిక నిషేధం
-ఇస్లామిక్ రాడికల్స్ గ్రూప్ ఎన్టీజేపై అనుమానాలు
-ఎనిమిది మంది అనుమానితుల అరెస్టు
-215 మంది మృతి 500 మందికి పైగా గాయాలు
-ఈస్టర్ పండుగ వేళ శ్రీలంకలో ఉగ్రవాదుల మారణహోమం
-ఎనిమిది ప్రాంతాల్లో బాంబుపేలుళ్లు
-ఉదయం ఆరు.. మధ్యాహ్నం రెండు పేలుళ్లు
-మృతుల్లో 35 మంది వరకు విదేశీయులు.. వారిలో ముగ్గురు భారతీయులు
-ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచదేశాలు
-చర్చిలు, హోటళ్లలో రక్తపుటేరులు

కొలంబో, ఏప్రిల్ 21: ప్రపంచానికి శాంతి సందేశం అందించిన ఏసుక్రీస్తు పునరుత్థానం చెందినరోజు.. క్రైస్తవులంతా ఆదివారం ఆనందంగా ఈస్టర్ పండుగ జరుపుకొంటున్న వేళ.. శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ప్రకృతి అందాలతో అలరారే ఈ ద్వీపదేశం ఉగ్రదాడులతో చిగురుటాకులా వణికింది. క్రైస్తవులు, పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో వరుస బాంబుపేలుళ్లకు పాల్పడ్డారు. క్షణాల వ్యవధిలో చర్చిలు, స్టార్ హోటళ్లలో బాంబులు పేల్చి రక్తపుటేరులు పారించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగాంబో, బట్టికలోవా నగరాల్లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఇందులో మూడు ప్రముఖ చర్చిలు, మూడు ఫైవ్‌స్టార్ హోటళ్లు ఉన్నాయి. నెగాంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో అత్యధిక ప్రాణనష్టం జరిగింది. ఇక్కడ దాదాపు 90 మంది మృతిచెందారు. ఉదయం 8:45 గంటలకు మొదలైన నరమేధం.. దాదాపు ఆరుగంటలపాటు సాగింది. ఈ మారణహోమంలో 215 మంది మృతిచెందగా, 500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. మృతుల్లో ముగ్గురు భారతీయులు సహా 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ అతివాద సంస్థ నేషనల్ తౌహీత్ జమాత్ (ఎన్టీజే).. భారత హైకమిషన్ కార్యాలయం, ప్రముఖ చర్చిలపై దాడిచేసే అవకాశం ఉందని పది రోజుల ముందే నిఘావర్గాలు హెచ్చరించినా తగిన రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ, సోషల్‌మీడియాపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా పేలుళ్లకు బాధ్యత వహించలేదు. అయితే ఇది ఎన్టీజే పనే అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఉగ్రదాడిని ప్రపంచదేశాలు ముక్త కంఠంతో ఖండించాయి.

ఈస్టర్ పండుగనాడే శ్రీలంకలో రక్తపుటేరులు పారాయి. క్రైస్తవులు, పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగాంబో, బట్టికలోవా నగరాల్లోని ఎనిమిదిప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో మూడు ప్రముఖ చర్చిలు, మూడు ఫైవ్‌స్టార్ హోటళ్లు ఉన్నాయి. ఉదయం 8:45 గంటలకు మొదలైన నరమేధం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఈ మారణహోమంలో ఇప్పటివరకు 215 మంది మృతిచెందగా, 500 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నట్టు తెలుస్తున్నది.

క్షణాల వ్యవధిలో ఆరుచోట్ల..

శ్రీలంక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8:45 గంటలకు నరమేధం మొదలైంది. మొదట ఆరుచోట్ల బాంబు పేలుళ్లు జరుగగా.. మధ్యాహ్నం మరో రెండు పేలుళ్లు జరిగాయి. ఇందులో మూడు పేలుళ్లను ఆత్మాహుతి దాడులుగా భావిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత నెగాంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జోయిన్ చర్చిలో పేలు ళ్లు జరిగాయి. తర్వాత కొలంబోలోని శాంగ్రి లా, సిన్నామాన్ గ్రాండ్, కింగ్స్‌బరీ హోటళ్లలో వరుస పేలుళ్లు సంభవించాయి. కొలంబోలో జరిగిన ఆరు పేలుళ్లలో 50 మంది, నెగాంబో పేలుడులో 90 మంది, బట్టికలోవాలో 27 మంది అక్కడికక్కడే మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. మిగతావారు దవాఖానల్లో చికిత్స పొందుతూ మరణించారని చెప్పారు.

సెయింట్ ఆంథోనితో నరమేధం మొదలు..

కొలంబోలోని సెంయింట్ ఆంథోని చర్చిలో మొదటి పేలుడు సంభవించింది. ఈస్టర్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు వందల మంది ఆరాధకులు ఉదయమే చర్చికి తరలివచ్చారు. దాదాపు 8:45 గంటలకు పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు చర్చిలోని పైకప్పు కూలిపోయింది. తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి.

చిన్నారులే అధికం

తూర్పుతీర ప్రాంతంలోని బట్టికలోవా చర్చిలో మూడో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి దాదాపు 27 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులే అధికంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
blost

జూలో ఏడో పేలుడు

గందరగోళం కొనసాగుతుండగానే.. మధ్యా హ్నం సమయంలో కొలంబో దక్షిణప్రాంతంలోని దెహీవాలా జువలాజికల్ గార్డెన్ సమీపంలోని రిసెప్షన్ హాల్‌లో ఏడో పేలుడు జరిగింది. బహిరంగ ప్రాంతంలో పేలుడు జరుగడంతో ఇద్దరు మాత్రమే మృతిచెందారు. ఈ పేలుడు జరిగిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్త కర్ఫ్యూ విధించింది.

అమరులైన ముగ్గురు పోలీసులు

ఎనిమిదో పేలుడు ఒరుగోడవట్ట ప్రాంతంలోని ఓ ఇంటిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఓ రెండంతస్థుల ఇంటిని తనిఖీ చేస్తుండగా ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఇంటి పైకప్పు కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు అక్కడికక్కడే మృతిచెందారు.

దేశ్యవ్యాప్తంగా కర్ఫ్యూ

జూ సమీపంలో ఏడో పేలుడు జరుగగానే శ్రీలంక ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. తరుపరి ఆదేశాలు వచ్చే వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్ధనే ప్రకటించారు. సోషల్‌మీడియాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడి కార్యదర్శి ఉదయ ఆర్ సెనెవిరత్నే తెలిపారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.

విమానాశ్రయాల్లో హై అలర్ట్

బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశంలోని అన్ని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు తీవ్ర ముప్పు హెచ్చరికలను జారీ చేసినట్టు ఆ దేశ విమానయానశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అదనపు భద్రతా చర్యలను చేపట్టినట్టు.. సాధారణ సమయానికంటే నాలుగు గంటలు ముందుగానే ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. బండారనాయకే ఎయిర్ పోర్ట్‌కు పటిష్ఠ భద్రత కల్పించారు.

ప్రజలు సంయమనం పాటించాలి

వరుస పేలుళ్లు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని కోరారు. శ్రీలంక ప్రజలపై జరిగిన ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ దేశ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ట్వీట్ చేశారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, ప్రజలు ఐక్యతగా, ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
Lanka1

మృతుల్లో ముగ్గురు భారతీయులు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడి

న్యూఢిల్లీ: శ్రీలంక వరుస బాంబు పేలుళ్లలో ముగ్గురు భారతీయులు మృతిచెందారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. ముగ్గురు భారతీయులు మృతిచెందారని నేషనల్ హాస్పిటల్ కొలంబోలోని భారత హై కమిషన్‌కు తెలిపింది. వారి పేర్లు లోకాన్షిని, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ అని ఆమె ట్వీట్‌చేశారు. శ్రీలంకకు అన్ని రకాలుగా మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది అని ఆమె మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. కేరళకు చెందిన రజీనా, అబ్దుల్ ఖాదర్ కుక్కడీ దంపతులు ఇటీవల శ్రీలంకకు వెళ్లారు. ఖాదర్ దుబాయ్‌లోని ఓ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. ఆయన దుబాయ్ వెళ్లేందుకు ఆదివారం ఉదయం ఎయిర్‌పోర్టుకు వెళ్లగా.. రజీనా మాత్రం హోటల్‌లోనే ఉండిపోయారు. ఉగ్రవాదుల దుశ్చర్య కు బలయ్యారు.

తావీద్‌జమాత్ పనేనా?..

బాంబుపేలుళ్ల వెనుక తావీద్ జమాత్ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ముందుగా ఎన్టీజే రాడికల్స్ గ్రూప్ ఈ దాడులకు పాల్పడ్డట్టు భావించినా.. వారి పరిధి చాలా పరిమితమని, ఆత్మాహుతి బాంబుదాడులు చేసేంత శక్తి లేదని నిపుణులు తేల్చారు. దీంతో మరింత లోతుగా జరిపి ఈ దాడులు 2016లో బంగ్లాదేశ్ ఢాకాలోని హోలీ ఆర్టిసన్ బేకరీలో జరిగిన పేలుడు మాదిరిగా ఉన్నట్టు నిర్ధారించారు. దీంతో కొలంబో దాడుల వెనుక తావీద్ జమాత్ సంస్థ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ సంస్థ కార్యకలాపాపాలు మాల్దీవుల నుంచి బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉన్నట్టు చెప్తున్నారు. మన దేశంలోని తమిళనాడులోనూ ఈ సంస్థ సానుభూతి పరులు ఉన్నారు. శ్రీలంకలో శ్రీలంక తావీద్ జమాత్(ఎస్‌ఎల్‌టీజే) పేరుతో తూర్పు ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరు అక్కడి ముస్లింలపై షిరియా చట్టాలు అమలు చేస్తున్నారు. మహిళలంతా బురఖాలు వేసుకోవాలని ఆదేశిస్తుంటారు. మసీదులు నిర్మించి తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తుంటారు. స్థానిక బాలురను ఎంపిక చేసుకొని వారికి ఐసిస్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆల్‌ఖైదా నుంచి ఐసిస్ వరకు పలు ఉగ్రవాద సంస్థలతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో బౌద్ధులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇది ముస్లింలు, బౌద్ధుల మధ్య గొడవలకు దారితీస్తున్నది. ఇది కూడా తావీద్ జమాత్ పనేనని అనుమానిస్తున్నారు.
Shangri-la-hotel

ఎటు చూసినా ఆర్తనాదాలు.. రోదనలే

వరుస పేలుళ్లతో రాజధాని కొలంబో సహా మూడు నగరాల్లో బీతావహ వాతావరణం నెలకొన్నది. క్షతగాత్రులు, బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఘటనా స్థలాల్లో ఎటు చూసినా మృతదేహాలు, రక్తపు మడుగులు, మాంసపు ముద్దలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన దవాఖానల్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వందల మంది క్షతగాత్రులకు ఒకేసారి వైద్యం చేయాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రక్తం కొరత తీవ్రంగా వేధిస్తున్నదని అధికారులు తెలిపారు. నేషనల్ హాస్పిటల్‌లో 66 మృతదేహాలను భద్రపరిచామని, దాదాపు 200 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నామని, నెగాంబో హాస్పిటల్‌లో 104 మృతదేహాలు ఉన్నాయని, మరో 100 మందికి చికిత్స అందుతున్నదని చెప్పారు. బట్టికలోవా దవాఖానలో దాదాపు 200 మంది క్షతగాత్రులను చేర్చినట్టు ఓ అధికారి తెలిపారు.

మృతుల్లో 35 మంది విదేశీయులు

వరుస పేలుళ్లలో ముగ్గురు భారతీయులు సహా 35 మంది విదేశీయులు మృతిచెందారని అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 13 మందిని గుర్తించామని నేషనల్ హెల్త్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ జైసింఘే తెలిపారు. ఇందులో ముగ్గురు భారతీయులు, ఇద్దరు చైనీయులు, పొలాండ్, డెన్మార్క్, జపాన్, పాకిస్థాన్, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్ నుంచి ఒక్కరు చొప్పున మృతిచెందినట్టు చెప్పారు. శ్రీలంకలో బ్రిటన్ హైకమిషనర్ జేమ్స్ డౌరిస్ మాట్లాడుతూ పేలుళ్లలో పలువురు బ్రిటన్‌వాసులు మరణించినట్టు తెలుస్తున్నదన్నారు. అయితే ఎంతమంది ఉన్నారో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు. శ్రీలంకలో గత 30 ఏండ్లలో ఏనాడూ విదేశీయులపై దాడులు జరుగలేదని, మొదటిసారి పర్యాటకులు, విదేశీయులే లక్ష్యంగా దాడి జరిగిందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

సురక్షితంగా బయటపడ్డ జగిత్యాల వాసులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ/మెట్‌పల్లి: కొలంబో బాంబు పేలుళ్ల నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన ఆరు కుటుంబాలు సురక్షితంగా బయటపడ్డాయి. వీరిలో ఒకరైన మెట్‌పల్లికి చెందిన న్యాయవాది ఏలేటి నరేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణతో మాట్లాడారు. నరేందర్‌రెడ్డి-వందనతో సహా ఆరు కుటుంబాలసభ్యులు వారం కింద శ్రీలంకకు విహారయాత్రకు వెళ్లారు. మూడు రోజుల కిందట కొలంబోలోని నెరేల్ల మారియస్ హోటల్‌లో దిగి.. ఆదివారం ఉదయం 7 గంటలకు భారత్‌కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగగానే హోటల్‌లో పేలుళ్ల సమాచారం విని దిగ్భ్రాంతికి గురయ్యారు.

తప్పించుకున్న అనంతవాసులు

కొలంబోలోని శాంగ్రిలా హోటల్‌లో జరిగిన పేలుడు నుంచి ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఎస్‌ఆర్ కన్‌స్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబు, భక్తబాల, మహి, రాజ్‌గోపాల్ తృటిలో తప్పించుకున్నారు. వారు టిఫిన్ చేస్తుండగా సమీపంలోనే పేలుళ్లు జరిగాయి. దీంతో బయటికి పరుగులు తీస్తుండగా సురేంద్రబాబు ముక్కుకు స్వల్పగాయమైంది.
Bomb-Blost

పదమూడు మంది అరెస్టు

పేలుళ్లకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న పదమూడు మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్ధనే తెలిపారు. ఈ పేలుళ్ల వెనుక కచ్చితంగా ఒక బృందం ఉన్నదని, వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మొత్తం ఎనిమిది పేలుళ్లలో మూడు ఆత్మాహుతి దాడులు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. నెగాంబోలోని సెబాస్టియన్ చర్చి లో, కొలంబోలోని సిన్నమాన్ గ్రాండ్ హోటల్, ఒరుగోడవట్టలోని ఇంటిలో జరిగిన పేలుళ్లను ఆత్మాహుతి దాడులుగా నిర్ధరించారు. మిగతా ఘటనలపై విచారణ జరుగుతున్నది.

తృటిలో తప్పించుకున్నా..

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటన నుంచి సీనియర్ సినీనటి రాధికాశరత్‌కుమార్ తృటిలో తప్పించుకున్నా రు. పనిపై శ్రీలంక వెళ్లిన రాధిక ఆదివా రం ఉదయం సిన్నామస్ గ్రాండ్ హోటల్‌లో బసచేశారు. ఆమె పని ముగించుకొని హోటల్ నుంచి బయటికొచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. దీనిపై రాధిక ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తంచేశారు. ఓ మై గాడ్. సిన్నామస్ హోటల్ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. ఈ ఘటన షాకింగ్‌గా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను అని రాధిక తెలిపారు.

క్యూ లైన్‌లో నిలబడి పేల్చేసుకున్న ఉగ్రవాది

చర్చిల్లో పేలుళ్ల అనంతరం పర్యాటకులు, సంపన్న వర్గాల ప్రజలే లక్ష్యంగా ప్రముఖ హోటళ్లలో పేలుళ్లకు పాల్పడ్డారు. కొలంబోలోని శాంగ్రిలా, సిన్నామాన్ గ్రాండ్, కింగ్స్‌బరీ హోటళ్లలో ఏకకాలంలో బాంబులు పేలాయి. సిన్నమాన్ గ్రాండ్ హోటల్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ సూసైడ్ బాంబర్ నకిలీ వివరాలతో హోటల్‌లో దిగాడు. బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు వరుసలో నిలబడిన సమయంలో తననుతాను పేల్చేసుకున్నాడు. సిన్నామన్ గ్రాండ్ హోటల్ ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో ఉండటం గమనార్హం.

పది రోజుల ముందే హెచ్చరించినా..

శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, భారత హై కమిషన్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని పదిరోజుల కిందటే హెచ్చరించినా తగిన చర్యలు తీసుకోలేదని తేలింది. శ్రీలంక పోలీస్ విభాగం అధిపతి పుజుత్ జయసుందర ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా ఉన్నతాధికారులకు దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేశారు. కొలంబోలోని ప్రముఖ చర్చిలతోపాటు భారత హైకమిషన్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడులు చేసేందుకు ఎన్టీజే కుట్ర పన్నుతున్నదని విదేశీ నిఘా సంస్థ హెచ్చరించింది అని పేర్కొన్నారు.
curfew-in-Colombo

భారత్ అండగా నిలుస్తుంది

శ్రీలంకలో మారణకాండను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ఆటవిక, అనాగరిక చర్యలకు మన ప్రాంతంలో చోటు లేదని స్పష్టంచేశారు. శ్రీలంక ప్రజలకు భారతదేశం పూర్తిగా సంఘీభావంతో నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బంధుమిత్రులను కోల్పోయినవారికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

శ్రీలంక ప్రజలకు అమెరికా ప్రజల తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సాయానికి మేం సిద్ధంగా ఉన్నాం.
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
Kingsbury-Hotel
శ్రీలంకలో హింసాత్మక చర్యలు నిజంగా భయానకం. బాధితులందరికీ నా ప్రగాఢ సంతాపం. థెరెసా మే, బ్రిటన్ ప్రధాని అందమైన శ్రీలంక ప్రజలకు ఆస్ట్రేలియా తన ప్రగాఢ సానుభూతిని, మద్దతును తెలియజేస్తున్నది. సాయానికి మేం సిద్ధం.
- స్కాట్ మారిసన్, ఆస్ట్రేలియా ప్రధాని

ఉగ్రచర్యలను న్యూజిలాండ్ ఖండిస్తున్నది. ప్రజలు చర్చ్‌లు, హోటళ్లలో ఉండగా, జరిగిన దాడి విధ్వంసకరంగా ఉన్నది.
-జసిండా ఆర్డెర్న్, న్యూజిలాండ్ ప్రధాని

ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో చోటుచేసుకున్న భయానక ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. శ్రీలంక సోదరులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.
ఇమ్రాన్‌ఖాన్, పాకిస్థాన్ ప్రధానిమృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.

షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని

ఇది క్రూరమైన హింస. ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని పేలుళ్లకు పాల్పడటం దారుణం. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
-పోప్ ఫ్రానిస్స్

శ్రీలంక మృతులు 13.8 కోట్ల మంది!

శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనను ఖండించే సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. బాంబు పేలుళ్లలో 138 మిలియన్ల (13.8 కోట్లు) మంది మరణించారని పొరపాటున పోస్ట్ చేశారు. వాస్తవానికి శ్రీలంక మొత్తం జనాభా 2.1 కోట్లు మాత్రమే. మృతుల సంఖ్యపై తన పొరపాటును గ్రహించి ట్వీటును డిలీట్ చేశారు. కొద్దిసేపటి తరువాత మృతుల సంఖ్యలో మిలియన్ పదాన్ని తొలిగించి మళ్లీ ట్వీట్ చేశారు.

పరిస్థితిని సమీక్ష చేస్తున్నాం..

పేలుళ్ల అనంతరం పరిస్థితిని అనుక్షణం సమీక్షిస్తున్నామని శ్రీలంకలో భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. భారతీయుల సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. +94777903082, +94112422788, +94112422789, +94777902082, +94772234176 నంబర్లకు ఫోన్‌చేసి వివరాలు పొందవచ్చని ట్వీట్ చేసింది.

2289
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles