డిప్రెషన్‌తో బాధపడుతున్న విద్యార్థి కాల్చివేత


Thu,September 21, 2017 12:15 AM

-అమెరికా పోలీసుల దుశ్చర్య.. విద్యార్థుల ఆగ్రహం
వాషింగ్టన్, సెప్టెంబర్ 20: డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ విద్యార్థిని పోలీసులు కాల్చిచంపడం అమెరికాలో కలకలం రేపింది. ప్రమాదం ఏమీ లేకపోయినా విద్యార్థిని అనవసరంగా పోలీసులు పొట్టనబెట్టుకున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జార్జియా టెక్ క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ నాల్గో సంవత్సరం చదువుతున్న స్కౌట్ స్కల్జ్ (21) స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తగా పనిచేస్తున్నారు. స్కల్జ్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. శనివారం మూడుసార్లు సూసైడ్ నోట్ రాసిన స్కల్జ్ తర్వాత పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేశాడు. క్యాంపస్‌లో ఒక వ్యక్తి కత్తితో తిరుగుతున్నాడని, ఆయన వద్ద తుపాకీ కూడా ఉండవచ్చంటూ తన ఆనవాళ్లనే వారికి వివరించి చెప్పాడు. దీంతో రంగంలోకి దిగిన జార్జియా నేరపరిశోధక విభాగానికి క్యాంపస్‌లో స్కౌట్ స్కల్జ్ ఎదురయ్యాడు.

ఫోన్లో చెప్పిన వివరాలు సరిపోతుండడంతో ఆయనను లొంగిపోవాలని వారు కోరారు. తనను కాల్చాలంటూ స్కల్జ్ ముందుకు రాగా పోలీసులు కాల్చివేశారు. విద్యార్థి వద్ద తుపాకీ ఉందని, దాన్ని పారవేసేందుకు ఆయన నిరాకరించినందునే పోలీసులు కాల్పులు జరిపారని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే విద్యార్థులు ఈ వాదనను ఖండించారు. స్కౌట్ వద్ద ఓ మల్టీపర్పస్ ఎలక్ట్రికల్ పనిముట్టు మాత్రమే ఉందని, అది తుపాకీ కాదని తెలిపారు. స్కౌట్ నుంచి ప్రమాదమేమీ లేకపోయినా, పోలీసులు ఎలా కాల్చిచంపుతారని అటార్నీ క్రిస్ స్టెవార్ట్ ప్రశ్నించారు. స్కౌట్ కాల్చివేతను నిరసిస్తూ క్యాంపస్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఓ పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆందోళనకారుల దాడిలో ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయని పోలీసువిభాగం తెలిపింది.

185

More News

VIRAL NEWS