పెండ్లి మండపంపై బాంబుల వర్షం!

Tue,April 24, 2018 05:45 AM

Saudi airstrike kills at least 88 at Yemen wedding

-88 మంది మృతి
-మృతుల్లో వధువు.. వరుడికి గాయాలు
-ఛిద్రమైన మృతుల శరీరభాగాలు
-సంకీర్ణ దళాల వైమానిక దాడులతో యెమెన్‌లో దారుణం
-సౌదీ నాయకత్వంలో మారణహోమం
yemen-bomb-blast
యెమెన్, ఏప్రిల్ 23: సౌదీ అరేబియా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు చేసిన వైమానిక దాడుల్లో యెమెన్‌లోని ఒక పెండ్లి మండపంలో ఉన్న 88 మంది మరణించారు. ఉత్తర యెమెన్‌లోని హజ్జా ప్రావిన్స్‌లో బని ఖయిస్ జిల్లాకు చెందిన అల్ఖ్రాలో ఆదివారం ఈ దారుణం జరిగినట్లు యెమెన్ ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. మృతు ల్లో మహిళలు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారని, పెండ్లి కూతురు కూడా మరణించిందని ఆయన చెప్పా రు. గాయపడిన పెండ్లి కుమారుడితో సహా బాధితులను స్థానిక దవాఖానకు తరలించామన్నారు. ఈ ఘటనలో మొదట మృతులు 20 మంది, గాయపడినవారు 45 మంది అని వార్తలు వచ్చా యి. అయితే పెండ్లి మండపం శిథిలాల కింద చిక్కుకుని చాలా మంది చనిపోయారని, ఆదివారం రాత్రికే మృతుల సంఖ్య 33 దాటిందని, సోమవారానికి ఆ సంఖ్య 88కి చేరిందని యెమెన్‌లోని సబా వార్తా సంస్థ సోమవారం వివరించింది. మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగడంతో వారికి చికిత్స అందిస్తున్న రిపబ్లికన్ హాస్పిటల్‌లో ఎమెర్జెన్సీ విధించినట్లు పేర్కొంది.

సంకీర్ణ దళాల యుద్ధ విమానాలు కురిపించిన బాంబులు చాలామంది హాజరైన పెండ్లి వేదిక వద్ద పడడంతో మరణాలు ఎక్కువగా సంభవించాయి. బాంబుల దాడి కారణంగా ఆ ప్రాంతమంతా రక్తపు మడుగుగా మారింది. ఛిద్రమైన మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆకుపచ్చ షర్టు వేసుకున్న ఒక యువకుడు దాడిలో మరణించిన తన కుటుంబీకుని గుండెకు హత్తుకుని రోదిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియో ఒకటి బయటపడింది. ఆ ప్రాంతంపై యుద్ధవిమానాలు ఇంకా తిరుగుతున్నాయని, మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న భయంతో బాధితుల సహాయార్థం అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి వెంటనే చేరుకోలేకపోయాయని యెమెన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ అధికారప్రతినిధి అబ్దుల్ హకీమ్ అల్ కలాన్ వివరించారు. ఉత్తర యెమెన్‌లోని చాలాభాగంతోపాటు రాజధాని సనాను హౌతీ ఉగ్రవాదులు ఆక్రమించుకున్నారు.

yemen-bomb-blast2
వారిని అక్కడి నుంచి తరిమికొట్టి రాజధానిని తిరిగి స్వాధీనం చేసుకుని అంతర్జాతీయ సమాజం గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీఅరేబియా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు ఈ దాడులు జరుపుతున్నాయి. దాదాపు మూడేండ్లుగా జరుగుతున్న ఈ పోరాటంలో పదివేలమందికిపైగా ప్రాణాలు కోల్పోగా అంతకు ఎన్నో రెట్ల మంది గాయపడ్డారు. 30 లక్షల మందికిపైగా నిర్వాసితులయ్యారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే ప్రాంతాలు, మార్కెట్లు, వివాహస్థలాలు, దవాఖానలు, విద్యాసంస్థలపై కూడా సంకీర్ణ దళాలు వైమానిక దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నాయని, ఇది యుద్ధ నేరాలకు పాల్పడడమేనని ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

1589
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles