గగనతలంలో తప్పిన ఘోర ప్రమాదం

Fri,October 12, 2018 01:37 AM

Russian Rocket Fails, and 2 Astronauts Make Safe Emergency Return

-ప్రయోగించిన కొద్దిసేపట్లోనే రష్యా రాకెట్ ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు
- మధ్యలోనే వెనుదిరిగి.. అత్యవసరంగా ల్యాండింగ్
- ఇద్దరు వ్యోమగాములు సురక్షితం

మాస్కో: అంతరిక్ష ప్రయోగాల్లో వరుస వైఫల్యాలతో అపఖ్యాతి పాలవుతున్న రష్యాకు మరో ఊహించని షాక్ తగిలింది. కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి గురువారం ప్రయోగించిన కొద్దిసేపట్లోనే సోయజ్ రాకెట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు బయలుదేరాల్సిన రాకెట్‌ను అర్ధాంతరంగా దారి మళ్లించి తిరిగి భూమిపై అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ పెనుప్రమాదం నుంచి రాకెట్‌లోని అమెరికా, రష్యాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్, అలెక్సీ ఒవిచినిన్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు రష్యా అంతరిక్ష ఏజెన్సీ రాస్కోస్‌మాస్ ప్రకటించింది. రాకెట్‌లోని అత్యవసర రక్షణ వ్యవస్థ పనిచేసింది. వ్యోమగాములు పయనిస్తున్న రాకెట్ సురక్షితంగా కజకిస్థాన్‌లో ల్యాండ్ అయింది. దేవుడి దయ వల్ల వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు అని ట్వీట్ చేసింది.మరోవైపు సాంకేతిక కారణాలతో సోయజ్ రాకెట్ బూస్టర్‌లో సమస్యలు వచ్చాయని నాసా తెలిపింది.
Nick-Hague
ల్యాంచ్‌పాడ్ నుంచి బయలుదేరిన అనంతరం తొలి దశ పూర్తి అయిన కొద్దిక్షణాల్లోనే బూస్టర్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరు వ్యోమగాములు బాలిస్టిక్ డీసెంట్ మోడ్‌లో తిరిగి భూమిపైకి చేరుకున్నారు. సాధారణ ల్యాండింగ్ కంటే ఇది కాస్త వేగంగా జరిగే ప్రక్రియ. కజకిస్థాన్‌లోని తూర్పు భాగంలో ఉన్న హెజ్‌కగన్ పట్టణం సమీపంలో సురక్షితంగా దిగింది అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వ్యోమగాములిద్దరూ సురక్షితంగా చేరుకున్న ఫొటోలను రష్యా విడుదల చేసింది. అమెరికాకు చెందిన వ్యోమగామి నిక్ హేగ్ అంతరిక్షంలోకి తొలిసారి వెళుతుండగా, అలెక్సీ రెండోసారి పయనమయ్యారు. సోయజ్ రాకెట్‌లో ఆరు గంటలపాటు ప్రయాణించి వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌కు చేరుకోవాల్సి ఉంది. ఇంజిన్‌లో సమస్యలు ఎదురైన క్లిష్ట తరుణంలోనూ రష్యా వ్యోమగామి అలెక్సీ ఒవిచినిన్ ఆందోళనకు గురికాకుండా కూల్‌గా స్పందించిన వాయిస్ రికార్డ్ వైరల్‌గా మారింది.

1316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles