రష్యాలో కూలిన విమానం 71 మంది మృతి

Mon,February 12, 2018 03:18 AM

Russian plane crash outside Moscow leaves 71 dead

టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలిన ఏఎన్-148
విమానంలో 65 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ..
భారీగా మంచు కురుస్తుండటంతో కనిపించని దారి

Airplane
మాస్కో, ఫిబ్రవరి 11: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే విమానం కుప్పకూలింది. ఏం జరిగిందో తెలియదు కానీ, గాల్లోనే మంటలు అంటుకుని కుప్పకూలిపోయింది. సెకన్ల వ్యవధిలో విమానం పూర్తిగా కాలిపోవడంతో దానిలో ఉన్న 71మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఇంతటి విషాద ఘటనకు మాస్కో డుమోడెడ్వో విమానాశ్రయం సాక్షీభూతంగా నిలిచింది. విమానాయశ్రం నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే విమానం జాడ రాడార్ నుంచి అదృశ్యమైంది. సరటోవ్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న ఏఎన్-148 రకం విమానం మాస్కో సమీపంలోని అర్గునోవ్ గ్రామం సమీపంలో కూలిపోయింది.

మృతిచెందిన వారిలో 65మంది ప్రయాణికులు కాగా మిగతావారు విమాన సిబ్బంది. మాస్కో నుంచి ఈ విమానం ఓరస్క్ వెళ్లాల్సిఉంది. ప్రమాదం జరిగిన విషయాన్ని రష్యా అధికారులు ధ్రువీకరించారు. కొంతకాలంగా రష్యాలో భారీగా మంచు కురుస్తుండటంతో దారి సరిగా చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆకాశం నుంచి విమానం కూలిపోయి మంటల్లో దగ్ధమైన దృశ్యాన్ని చూసి భయకంపితులమయ్యామని అర్గునోవ్ గ్రామస్థులు చెప్పారు. కుప్పకూలిన విమాన శకలాలు చాలా దూరం వరకు విసిరివేయబడ్డాయని స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. కూలిపోయిన విమానం కొత్తదే, సర్వీసులోకి తీసుకుని ఎనిమిదేండ్లే అవుతున్నది అని సరటోవ్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ విమానాన్ని అంతర్జాతీయ సర్వీసులకు కూడా వినియోగించారు. రష్యాలో రెండో అతిపెద్ద విమానాశ్రయంగా డుమోడెడ్వో విమానాశ్రయానికి పేరుంది.
Airplane1

మంచు కారణంగా సహాయకచర్యల్లో ఆలస్యం

రష్యాలో విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా విమానం కూలిన ప్రదేశానికి సహాయక సిబ్బంది త్వరగా చేరుకోలేకపోయారు. కొంతదూరం నుంచి కాలినడకన ఘటనాస్థలికి వెళ్లాల్సివచ్చింది. విమానం కూలిన ప్రదేశంలో సుమారు 150మంది సహాయక సిబ్బంది సేవలందిస్తున్నారు. రష్యా ట్రాన్స్‌పోర్ట్ మంత్రి మాక్సిమ్ సాకలోవ్ ఘటనా స్థలికి బయల్దేరి వెళ్లారు. విమానం కూలిపోవడానికి వాతావారణ పరిస్థితులతోపాటు మానవతప్పిదాలు కూడా కారణభూతాలేనని రష్యా ట్రాన్స్‌పోర్ట్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. విమానం కుప్పకూలిన ఘటన పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారం వ్యక్తం చేశారు. గత నవంబర్ నెలలో ఓ విమానం కూలిన ఘటనలో ఆరుగురు మృతిచెందారు. డిసెంబర్ నెలలోనూ నల్ల సముద్రంలో మిలిటరీ విమానం కూలి రెడ్ ఆర్మీకి చెందిన 92మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు.
Russian-plane

924

More News

VIRAL NEWS