ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెం

Thu,December 7, 2017 10:42 AM

Read the full text of Trumps speech recognizing Jerusalem as Israel capital

-గుర్తించిన అమెరికా ప్రభుత్వం
-టెల్‌అవీవ్ నుంచి ఎంబసీ తరలింపు
-ఈ మేరకు ట్రంప్ ప్రకటన
-పాలస్తీనా, ముస్లిం దేశాల తీవ్ర వ్యతిరేకత
-మధ్యప్రాచ్యంలో మంటలే: రష్యా, ఈయూ

trump
వాషింగ్టన్, డిసెంబర్ 6: అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా పేరొందిన డొనాల్డ్‌ట్రంప్ మరో అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న చిచ్చును మరింత రెచ్చగొట్టేలా.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ బుధవారం ప్రకటన వెలువరించారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడమనేది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమని ట్రంప్ వ్యాఖ్యానించారు. జెరూసలెంను పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ఇజ్రాయెల్‌లోని యూదులు, వివిధ దేశాల్లోని క్రైస్తవులు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తుంటారు. ఈ విధంగా మూడు మతస్థులకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఏకపక్షంగా ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటం అంటే.. మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదుపటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటమేగాక, ఇప్పటికే ఆ దేశ రాజధానిగా ఉన్న టెల్‌అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించటానికి కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారని వైట్‌హౌస్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించినట్లుగా వార్తలు వెలువడ్డాయి.

శాంతి ప్రక్రియకు తెర దించడమే: పాలస్తీనా

ట్రంప్ నిర్ణయంతో మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రక్రియకు తెరరదించినట్లవుతుందని పాలస్తీనా స్పష్టం చేసింది. పాలస్తీనా సంస్థలు మూడు రోజుల నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ట్రంప్ ఆలోచన ప్రమాదకరమని, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టినట్లవుతుందని సౌదీ రాజు సల్మాన్ హెచ్చరించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ సిసీ స్పందిస్తూ సమస్య మరింత సంక్లిష్టమవుతుందన్నారు. ట్రంప్ ప్రణాళిక చాలా ప్రమాదకరమని, పూర్తిగా రెచ్చగొట్టే పొరపాటు నిర్ణయమని ఇరాన్ అధ్యక్షుడు రౌసానీ అన్నారు. దీనిపై ఈ నెల 13న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ ప్రత్యేక సదస్సు నిర్వహించాలని ఇరాన్, టర్కీ నిర్ణయించాయి. పోప్ ఫ్రాన్సిస్ స్పంది స్తూ ఐరాస తీర్మానాలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

మధ్యప్రాచ్యంలో ఇక మంటలే

రష్యా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. ఇటువంటి చర్యలు తీసుకోవద్దని ట్రంప్‌నకు ఈయూ విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి ఫెడెరికా మోగేరిని సూచించారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయం ఆందోళనకరమన్నారు.

1220
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS