భారత్‌ చేతికి రాఫెల్‌

Thu,October 10, 2019 03:28 AM

- ఫ్రాన్స్‌ నుంచి అధికారికంగా తొలి విమానాన్ని స్వీకరించిన రాజ్‌నాథ్‌
- ఆయుధపూజ అనంతరం రాఫెల్‌లో విహరించిన రక్షణమంత్రి
- అత్యాధునిక ఆయుధాలతో ఏ దేశాన్ని భయపెట్టే ఉద్దేశం లేదని వెల్లడి
- రక్షణ సామర్థ్యం బలోపేతం కోసమే సమకూర్చుకుంటున్నామని స్పష్టీకరణ

మెరిగ్నాక్‌ (ఫ్రాన్స్‌), అక్టోబర్‌ 9: భారత వాయుసేన అమ్ములపొదిలోకి అధునాతన అస్త్రం చేరింది. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రాఫెల్‌ యుద్ధ విమానం భారత్‌ చేతికందింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మంగళవారం ఫ్రాన్స్‌ నుంచి అధికారికంగా తొలి రాఫెల్‌ యుద్ధ విమానాన్ని స్వీకరించారు. నైరుతి ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌లో ఉన్న దసాల్ట్‌ ఏవియేషన్‌ కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లొరెన్స్‌ పార్లె కూడా పాల్గొన్నారు. రూ.59,000 కోట్లతో మొత్తం 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్‌ ఏవియేషన్‌ సంస్థతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అందులో తొలి విమానం తాజాగా భారత్‌ చేతికందింది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్‌నాథ్‌ మంగళవారం ఫ్రాన్స్‌లో ఆ విమానానికి ఆయుధ పూజ నిర్వహించారు. అనంతరం అందులో దాదాపు 25 నిమిషాలపాటు విహరించారు. రాఫెల్‌ రాకతో భారత వైమానిక సామర్థ్యం బలోపేతమైందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుని ఏ దేశాన్నీ భయపెట్టే ఉద్దేశం భారత్‌కు లేదని, కేవలం తమ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడమే లక్ష్యమని స్పష్టంచేశారు. ‘సూపర్‌సోనిక్‌ (ధ్వనివేగాన్ని మించిన) వేగంతో ప్రయాణిస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. రాఫెల్‌లో ప్రయాణించడం సౌకర్యంగా ఉంది. ఈ అనుభూతి మరిచిపోలేనిది. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 19న ఆయన బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తేజస్‌ విమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే. తద్వారా ఆ విమానంలో ప్రయాణించిన తొలి రక్షణ మంత్రిగా ఆయన ఘనత సాధించారు.
Rafael-fighter-jet1

భారత్‌-ఫ్రాన్స్‌ సంబంధాల్లో సరికొత్త మైలురాయి

‘మన వాయుసేన ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది. రాఫెల్‌ రాకతో మరింత బలం చేకూరుతుంది. ఈ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఇది తోడ్పడుతుంది. రాఫెల్‌ అన్న ఫ్రెంచ్‌ పదానికి అర్థం తుఫాన్‌ అని నేను విన్నా. ఆ పేరుకు తగినట్లుగా రాఫెల్‌ పనిచేస్తుందని నాకు విశ్వాసం ఉంది. భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక సంబంధాల్లో ఈ రోజు ఒక మైలురాయి. రక్షణ సంబంధాల్లో సరికొత్త శిఖరానికి చేరుకున్నాం. ఈ రోజు (మంగళవారం) విజయదశమి. అలాగే 87వ వాయుసేన దినోత్సవం కూడా. ఇలా ఈరోజుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి’ అని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఫ్రాన్స్‌ రక్షణమంత్రి పార్లే మాట్లాడుతూ.. దసరా, భారత వాయుసేన దినోత్సవం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం యాధృచ్చికం కాదని, భారత్‌తో సంబంధాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనం అని చెప్పారు. ‘భారత్‌లో తయారీ’కి (మేకిన్‌ ఇండియా) తాము కట్టుబడి ఉన్నామన్నారు. కాగా, తొలి విడుతలో నాలుగు రాఫెల్‌ విమానాలు 2020 మే నాటికి భారత్‌కు చేరనున్నాయి. 2022 సెప్టెంబర్‌ నాటికి 36 విమానాలూ అందుతాయి.
Rafael-fighter-jet2

పన్నులతో మమ్మల్ని భయపెట్టకండి

భారత్‌ తమకు వాణిజ్య అనుకూల వాతావరణం కల్పించాలని, పన్నులతో భయపెట్టకూడదని రాఫెల్‌ యుద్ధ విమాన ఇంజిన్‌ తయారీ కంపెనీ సఫ్రాన్‌ సీఈవో ఓలీవియర్‌ ఆండ్రీస్‌.. రాజ్‌నాథ్‌ను కోరారు. భారత్‌లో తమ కంపెనీ 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పారిస్‌లోని ఆ కంపెనీ కర్మాగారాన్ని రాజ్‌నాథ్‌ బుధవారం సందర్శించారు.
Rafael-fighter-jet3

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బుధవారం ఫ్రాన్స్‌ రక్షణమంత్రి పార్లేతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి విస్తృత చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు రెండు దేశాలు మరింత సహకారం అందించుకోవాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలను (శక్తి, వరుణ, గరుడ విన్యాసాలు) విస్తృత పరచాలని నేతలు నిర్ణయించారు. మరోవైపు, ఫ్రెంచ్‌ వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలతో రాజ్‌నాథ్‌ సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5-8 మధ్య లక్నోలో నిర్వహించబోయే డిఫెన్స్‌ ఎక్సోకు వారిని ఆహ్వానించనున్నారు.

988
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles