మోదీ పాలనలో అసహనం

Sat,January 12, 2019 02:20 AM

Rahul Gandhi reaches out to expats in Dubai assures them all help

- నోట్ల రద్దు, జీఎస్టీలతో తీవ్రంగా దెబ్బతిన్న భారత్
- దేశం ముందు నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు ప్రధాన సమస్యలు
- దుబాయ్‌లో ప్రవాస భారతీయులతో రాహుల్‌గాంధీ వెల్లడి

దుబాయ్, జనవరి 11: ప్రధాని మోదీ నాలుగున్నరేండ్ల పాలనలో అసహనం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు 2019 సంవత్సరం సహన పూరిత సంవత్సరం కాగా.. భారతలో నాలుగున్నరేండ్ల నుంచి అసహనం రాజ్యమేలుతున్నది అని తెలిపారు. రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకే ఆలోచన, ఒకే సిద్ధాంతం సరైనది అనే భావన తప్పు. మేము అధికారంలోకి వస్తే అందరి ఆలోచనలకు పెద్ద పీట వేస్తాం అని రాహుల్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రభుత్వ తప్పుడు ఆలోచనల భారత్ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. ఇండియా ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయని అందులో ఒకటి నిరుద్యోగాన్ని రూపుమాపడం, రెండోది రైతులను ఆదుకోవడం అని చెప్పారు. నిరుద్యోగాన్ని ఎదుర్కోవాలంటే భారీగా ఉద్యోగాలను సృష్టించాలని, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడానికి రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

భారత్ ఆశయాలను హృదయాల్లో దాచుకొని మీరు (ప్రవాస భారతీయులు) ఇక్కడికి వచ్చారు. నేను మరణించే వరకు నా చెవులు, గుండె, నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి అని రాహుల్ చెప్పారు. ఈ రోజు భారత్ కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయిందని, దీనికి ప్రధాన కారణం రాజకీయ కుట్రేనని తెలిపారు. వర్గాల వారీగా విడిపోయిన క్రికెట్ టీం మ్యాచ్‌ను గెలుస్తుందా? అలాగే మతాలు, కులాల వారీగా విడిపోయిన దేశం విజయం సాధిస్తుందా? అందుకే మళ్లీ భారత్‌ను ఏకం చేయడానికి అందరం కలిసి ముందుకుసాగుదాం అని రాహుల్ చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నదని.. కానీ తాము బీజేపీ ముక్త్ భారత్ అనటం లేదని రాహుల్ పేర్కొన్నారు. దుబాయ్ నిర్మాణంలో భారతీయ కార్మికుల కృషి మరువలేనిదని చెప్పారు. దుబాయ్‌లో పెద్దపెద్ద భవనాలు, విమానాశ్రయాలు, మెట్రోలు నిర్మించారంటే అందులో మీ కృషి ఎంతో ఉంది. మీరు లేకుంటే ఇవి నిర్మాణం జరిగేవి కావు. దుబాయ్ నిర్మాణంలో మీ రక్తం, చెమట దాగి ఉన్నది. మిమ్మల్ని చూస్తే భారత్ గర్వపడుతున్నది అని కార్మికులను ప్రశంసించారు. నేను ఇక్కడికి వచ్చింది మన మన్‌కీ బాత్(ప్రధాని మోదీ కార్యక్రమం) గురించి చెప్పడానికి కాదు. మీ(కార్మికుల) మన్‌కీ బాత్ వినడానికి అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న తమ హామీని రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు.

832
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles