మూడో కన్ను తెరుస్తా


Sun,August 13, 2017 06:18 AM

- అణ్వాయుధాలు గురిపెట్టి సిద్ధంగా ఉంచాం
- కనుసైగ చేస్తే సైనిక చర్య ప్రారంభమవుతుంది
- ఉత్తరకొరియా అధ్యక్షుడిని హెచ్చరించిన ట్రంప్

Trumpవాషింగ్టన్, ఆగస్టు 12: అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై నిప్పులు చెరిగారు. కిమ్ వల్ల అమెరికాతోపాటు తమ మిత్రదేశాలకు ఎలాంటి హాని జరిగినా సైనిక చర్య తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఉత్తరకొరియావైపు అణ్వాయుధాలు గురిపెట్టి ఉన్నాయని, కనుసైగ చేస్తే చాలు దాడి చేసేందుకు తమ బలగాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. గ్వామ్‌పై దాడికి దిగినా.. అమెరికాతోపాటు, మా మిత్రదేశాలకు ఉత్తరకొరియా వల్ల ఏ రూపంలోనైనా, ఎలాంటి హాని జరిగినా కిమ్ తీవ్రంగా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది అని శనివారం ట్వీట్ చేశారు. కిమ్, అతడి కుటుంబం దశాబ్దాలుగా అరాచకపాలన సాగిస్తున్నదని విమర్శించారు. అమెరికా సైనిక వ్యూహాల్లో కీలక స్థావరమైన గ్వామ్ ద్వీపంపై క్షిపణి దాడి చేస్తామని కిమ్ ప్రకటించిన నేపథ్యంలో జాతీయ భద్రతా అధికారులతో ట్రంప్ మరోమారు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆకాంక్షించారు. ఉత్తరకొరియాతో తెరవెనుక చర్చల ప్రసక్తే లేదన్నారు. మానవత్వాన్ని మంటగలుపుతూ దశాబ్దాలుగా అరాచకపాలన సాగిస్తున్నవారితో చీకటి ఒప్పందాలు ఉండబోవని తేల్చి చెప్పారు. కిమ్ వెనుకడుగు వేసేవరకు తాను ముందుకే వెళ్తానని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా బలగాలు రాత్రికి రాత్రే ఉత్తరకొరియాపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పెంటగాన్ వర్గాలు తెలిపినట్టు ఫాక్స్ న్యూస్ పేర్కొన్నది.

ట్రంప్‌తో మాట్లాడిన జిన్‌పింగ్


ఉత్తరకొరియా, అమెరికా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు శాంతియుత పరిష్కారం ఒక్కటే మార్గమని చెప్పారు. అవసరమైతే ఈ విషయంలో తాము సహకరిస్తామన్నారు. ఈ విషయంలో ముందుగా ఉత్తరకొరియా అధ్యక్షుడితో మాట్లాడాలని ట్రంప్ చైనా అధ్యక్షుడికి సూచించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తీరుపై ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకున్నారు. కిమ్ దూకుడు తగ్గించుకోవాలని, అనవసరమైన రెచ్చగొట్టే ప్రకటనలు మానుకుంటేనే శాంతియుత పరిష్కారం సాధ్యమవుతుందని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. చైనా మొదటి నుంచీ ఉత్తరకొరియాను వెనుకేసుకొస్తున్న సంగతి తెలిసిందే.

జపాన్


అమెరికాలోని గ్వామ్ ద్వీపంపై దాడి చేస్తామని కిమ్ హెచ్చరించడంతో జపాన్ అప్రమత్తమైంది. క్షిపణి ప్రయాణించే మార్గంలో తమ దేశం ఉన్నందున రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేస్తున్నది. పశ్చిమ జపాన్, హిరోషిమా, కొచి, షిమ్నే తదితర ప్రాంతాల్లో పీఏసీ-3 రక్షణ వ్యవస్థను మోహరించింది. ఉత్తరకొరియాకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో క్షిపణి విధ్వంసక వ్యవస్థను సిద్ధం చేసింది.

భారత్ సహాయం చేస్తుంది


అమెరికా-ఉత్తర కొరియా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించాలని అమెరికా సైనిక ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. భారత్ స్వరం పెద్దది. అందరినీ తనవైపు తిప్పుకోగలదు. కాబట్టి అణ్వాయుధాల తయారీతో కలుగుతున్న నష్టాలను ఉత్తరకొరియా ప్రభుత్వానికి అర్థమయ్యేలా వివరించగలుతుంది అని పసిఫిక్ కమాండ్‌కు చెందిన అడ్మిరల్ హ్యారీ హ్యారిస్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత్ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

వెనెజులాపై సైనిక చర్యకు దిగుతాం: ట్రంప్


వెనెజులాపై సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వెనెజులా చట్టసభలో ప్రతిపక్షాన్ని తొలిగించేందుకు జూలై 30న ఎన్నిక జరుపడంపై ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. రెండు వారాలుగా రాజధానితోపాటు, పలు పట్టణాల్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పై విధంగా స్పందించారు.

2339

More News

VIRAL NEWS