-ఐసీజే ఆదేశాల మేరకు పాక్ కసరత్తు ప్రారంభించినట్లు వార్తలు.. తోసిపుచ్చిన ఆ దేశ సైన్యం
-సవరిస్తే ఉరిశిక్షను సివిల్ కోర్టులో సవాల్ చేసుకోవడానికి జాదవ్‌కు అవకాశం
ఇస్లామాబాద్: తనకు సైనిక కోర్టు విధించిన మరణశిక్షను భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (49) సివిల్ కోర్టులో సవాల్ చేసేందుకు వీలుగా పాకిస్థాన్ తన సైనిక చట్టానికి సవరణలు చేయనున్నది. ఈ వివరాల్ని ఆ దేశ రక్షణశాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) ఆదేశాల మేరకు పాక్ ఈ నిర్ణయం తీసుకున్నది. అయితే సైనిక చట్టాన్ని పాక్ సవరించనున్నదని వార్తలొచ్చిన కొన్ని గంటల్లోనే పాక్ సైన్యం స్పందించింది. ఈ వార్తలు నిజం కాదని సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు. కాగా, ఉగ్రవాదం, గూఢచర్యం చర్యలకు పాల్పడేందుకు తమ భూభాగంలో అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ కుల్‌భూషణ్ జాదవ్‌ను 2016 మార్చి మూడో తేదీన పాక్ అరెస్ట్ చేసింది. అతడిపై రహస్యంగా సైనిక కోర్టులో విచారణ జరిపించింది. జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు 2017 ఏప్రిల్‌లో ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.