పాక్ సైన్యానికి ఆంక్షలు!

Thu,February 7, 2019 03:16 AM

-రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఇకపై వీల్లేదు
-ఐఎస్‌ఐ కూడా చట్టానికి లోబడి పనిచేయాల్సిందే
-ఫత్వాలు చట్టవిరుద్ధం.. పాకిస్థాన్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 6: పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం బుధవారం చారిత్రక తీర్పును వెలువరించింది. దేశంలో ప్రభుత్వాన్ని కూడా తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోగల శక్తిమంతమైన ఆర్మీకి తాజాగా రెక్కలు కత్తిరించింది. సైన్యం ఇకపై ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ సహా ఇతర సంస్థలు కూడా చట్టానికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2017లో తెహ్రీక్-ఏ-లబ్బాయిక్ పాకిస్థాన్(టీఎల్‌పీ), ఇతర సంస్థలు ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని దిగ్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం ఈ తీర్పు వెలువరించింది. ద్వేషం, తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, సైన్యం ఆధీనంలో పనిచేసే ఐఎస్‌ఐ వంటి సంస్థలు కూడా చట్ట నిబంధనల మేరకు పనిచేయాలని ఆదేశాలు జారీచేసింది.

దీన్ని ఉల్లంఘించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతులను, రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు సైన్యం మద్దతు ఇచ్చినట్లు పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. 1947లో పాకిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు సగం కాలం పాటు ఆ దేశంలో సైనిక పాలనే సాగింది. ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా సైన్యానిదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో సైన్యాన్ని కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఇతరులకు హాని కలిగించే మతపరమైన ఆదేశాలు (ఫత్వాలు) కూడా చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది.

ఇలాంటి ఫత్వాలు జారీ చేసేవారి మీద పాకిస్థాన్ శిక్షా స్మృతి, ఉగ్రవాద నిరోధక చట్టం-1997 కింద విచారణ చేపట్టాలని ఆదేశించింది. చట్ట పరిమితులకు లోబడి పౌరులు, రాజకీయ పార్టీలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపింది. అయితే ఇది ఇతరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేదిగా ఉండకూడదని స్పష్టం చేసింది. రోడ్లను ఆక్రమించుకుని, ఆస్తులను ధ్వంసం చేసే నిరసనకారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొం ది. 2017 నవంబర్ 21న టీఎల్‌పీ, ఇతర సంస్థలకు చెందిన నిరసనకారులు సుమారు 20 రోజుల పాటు ఇస్లామాబాద్‌కు వెళ్లే ప్రధాన రహదారిని దిగ్బంధించారు.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles