మరో సాగరమథనం

Sun,September 9, 2018 02:33 AM

Ocean Cleanup steams out to sea in plastic pollution quest

-సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించేందుకు భారీ మిషన్ ప్రారంభం
-16 లక్షల చ.కి.మీ.ల విస్తీర్ణాన్ని వడబోయనున్న నెదర్లాండ్స్ బృందం
-ఐదేండ్లలో 40 వేల టన్నుల వ్యర్థాల సేకరణ లక్ష్యం

ప్లాస్టిక్ వ్యర్థాలు.. మానవుడి ప్రకృతి విధ్వంసపు చర్యల్లో ప్రధానమైనది. భూమిపై మానవుడు కాలుపెట్టిన ప్రతిచోట దొరికే ఆనవాళ్లు ఇవి. విచ్చలవిడి వాడకం.. వ్యర్థాలను ఇష్టారీతిన పారబోయడంతో ఇప్పటికే నేల పూర్తిగా కలుషితం కాగా.. నీటి వనరులు కాలుష్యం బారిన పడుతున్నాయి. ముఖ్యంగా సముద్రాలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. జలచరాల ఉసురు తీస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి(ఐరాస) అంచనా ప్రకారం సముద్రాల్లోకి చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఎన్నో తెలుసా... ఏకంగా ఐదు లక్షల కోట్లు. ఇవన్నీ సముద్రంలో కదులుతూ జలచరాలకు ముప్పుగా మారుతున్నాయి. వీటి వల్ల ప్రపంచ దేశాలకు ఆర్థికంగా ఏటా దాదాపు రూ.లక్ష కోట్లు నష్టం వస్తుందని ఐరాస అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సముద్రంలో నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేసే భారీ ప్రయత్నం ఒకటి నెదర్లాండ్స్‌లో శనివారం ప్రారంభమైంది. ఓ రకంగా చెప్పాలంటే.. సాగర మథనం మొదలైంది.

ఈ ప్రాంతమే ఎందుకు?

పసిఫిక్ సముద్రంలో హవాయి నుంచి కాలిఫోర్నియా వరకు విస్తరించి ఉన్న సముద్ర భాగాన్ని జీపీజీపీగా పిలుస్తుంటారు. ఇక్కడ అలలు సుడులు తిరుగుతూ ఉంటాయి. దీంతో సముద్ర అంతర్భాగంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ ఎక్కువగా పోగవుతూ ఉంటాయి. ఇలాంటి ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఐదు ఉన్నట్టు స్లాట్ బృందం చెప్తున్నది. జీపీజీపీ విస్తీర్ణం దాదాపు 16 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భారతదేశ విస్తీర్ణంలో దాదాపు సగం. మన రాష్ట్ర విస్తీర్ణం కన్నా 15 రెట్లు ఎక్కువ. జీపీజీపీలో 1.80 లక్షల కోట్ల ప్లాస్టిక్ ముక్కలు పోగయినట్టు అంచనా. వీటి పరిమాణం దాదాపు 80 వేల టన్నులు. వీటన్నింటినీ వెలికితీస్తే భూమి మీదున్న ప్రతి మనిషికి 250 ప్లాస్టిక్ ముక్కల చొప్పున పంచవచ్చు.

ఎలా వెలికి తీస్తారంటే..

వ్యర్థాలను వెలికితీసేందుకు స్లాట్ బృందం పాసివ్ డ్రిఫ్టింగ్ సిస్టమ్‌ను రూపొందించింది. ఇందులో 600 మీటర్ల పొడవైన ట్యూబ్ యూ ఆకారంలో ఉంటుంది. ఇది ఉపరితలంపై తేలుతూ ఉంటుంది. దీని కింద మూడు మీటర్ల లోతు వరకు ఒక వల వంటి నిర్మాణం ఉంటుంది. ఈ మొత్తం నిర్మాణాన్ని ఓ బోటు సాయంతో సముద్రంలో తిప్పుతారు. ఈ వడబోతలో సాగరగర్భంలో ఉన్న ప్లాస్టిక్ ముక్కలు వలలో చిక్కుతాయి. ఉపరితలంపై తేలే వ్యర్థాలను పైన ఉండే ట్యూబ్ కిందికి నెడుతుంది. బోటు ఒకసారి సముద్రంలో తిరిగి వచ్చిన తర్వాత వలలో చిక్కిన ప్లాస్టిక్ వ్యర్థాలను తీరానికి చేర్చి రీసైక్లింగ్‌కు పంపిస్తారు. ఐందేండ్లపాటు కొనసాగనున్న ఈ ప్రాజెక్టు ద్వారా జీపీజీపీలో పేరుకుపోయిన వ్యర్థాల్లో 50 శాతం సేకరిస్తామని స్లాట్ బృందం చెప్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును చేపడితే 2040 వరకు సముద్రంలో నుంచి 90 శాతం వ్యర్థాలను వెలికితీయవచ్చునని పేర్కొన్నది.

ఐరాస అంచనాల ప్రకారం

- సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలు: 5 లక్షల కోట్లు
- ప్రపంచ దేశాలకు ఏటా నష్టం: రూ.లక్ష కోట్లు

Ocean-cleaning

చిన్న నాటి కల

24 ఏండ్ల బొయన్ స్లాట్ నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ నగరంలో నివసిస్తున్నాడు. 16 ఏండ్ల వయసులో గ్రీస్ తీరప్రాంతంలోని సముద్రం లో ఈతకెళ్లినప్పుడు చేపల కన్నా ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా కనిపించడంతో కలత చెందాడు. ఎలాగైనా సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించాలని నిర్ణయించుకున్నాడు. స్లాట్ 2013లో ద ఓషన్ క్లీనప్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. నాటి నుంచి కొందరు స్నేహితులతో కలిసి సముద్ర వ్యర్థాలను వెలికితీసే టెక్నాలజీ అభివృద్ధిపై పరిశోధనలు జరిపాడు. ఎనిమిదేండ్ల తన తపనకు శనివారం కార్యరూపం ఇచ్చాడు. పసిఫిక్ సముద్రంలోని ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్(జీపీజీపీ)గా పిలిచే ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత ప్రారంభించాడు.

2008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles