ఆనందమయ దేశం నార్వే

Tue,March 21, 2017 02:49 AM

ప్రపంచంలో అత్యంత ఆనందమయ దేశంగా నార్వే నిలిచింది. ఐక్యరాజ్య
సమితి నిర్వహించిన సంతోషకర దేశాల సర్వే జాబితాలో నార్వే అగ్రదేశంగా చోటు
సంపాదించింది. అగ్రరాజ్యం అమెరికా 13 నుంచి 14వ స్థానానికి పడిపోయింది. 155 దేశాల్లో జరిపిన సర్వేలో
గత ఏడాది 118వ స్థానంలో ఉన్న భారత్ 122వ స్థానానికి పడిపోయింది.

ఐక్యరాజ్య సమితి, మార్చి 20: ఈ లోకంలో ఆనందమయ దేశం ఏది? ఏ దేశ ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారు? ఎవరు విచారంలో ఉన్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అత్యంత ఆనందమయ దేశంగా నార్వే ఖ్యాతి గడించింది.
norway-people
కన్నుకుట్టే జన్యు సంపద, రాజకీయ సుస్థిరత, అత్యుత్తమ పౌర సేవలున్న నార్వే.. ఈ జగత్తులో అత్యంత ఆనంద దేశంగా ఈ ఏడాదికి పేరుగాంచింది. పొరుగుదేశం డెన్మార్క్‌ను దాటేసి నార్వే హ్యాపీనెస్ (ఆనందం)లో అగ్రస్థానంలో నిలిచింది. ఆదాయం, ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎందుకు వాళ్లంత సుఖంగా ఉన్నారన్న కోణంలో 1555 దేశాల్లో 3000 మంది చొప్పున నిర్వహించిన సర్వే ఆధారంగా నార్వే ప్రజలు అత్యంత ఆనంతభరితులని తేలింది. సామాజిక పునాదులు బలంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారనడానికి ఈ సర్వే ఆధారం. సామాజిక విశ్వాసం, ఆరోగ్యకర జీవన విధానాలు ముఖ్యం. గోడలు, తుపాకులతో ఇది సాధ్యం కాదు. ఈ నిజాన్ని మనం గుర్తించాల్సి ఉంది అని సుస్థిరాభివృద్ధి మార్గాల నెట్‌వర్క్ డైరెక్టర్ జెఫ్రీ శాచ్స్ అన్నారు. ఐక్యరాజ్య సమితితో కలిసి సర్వేలో ఈ సంస్థ పాలుపంచుకున్నది. గత ఏడాది ర్యాంకింగ్‌లో నార్వే నాలుగో స్థానంలో నిలువగా ఇప్పుడు మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి ఐదుదేశాల్లో నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ దేశాలు నిలిచాయి. ఆనందంలో ఇవి పదింట 7.5 పాయింట్ల స్థాయిలో ఉన్నాయి. నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్లు టాప్‌టెన్‌లో స్థానం సంపాదించాయి. గత ఏడాదితో పోల్చితే అమెరికా సంతోషం దేశం నుంచి దిగజారింది. అమెరికాలో సంతోషకర సందర్భాలు తగ్గిపోతున్నాయని, ఆర్థికంగా బలపడుతున్నా, ప్రజల్లో మాత్రం ఆనందం కరువవుతున్నదని నివేదిక పేర్కొంది. సామాజిక రుగ్మతలు రూపుమాపితేనే అమెరికా మళ్లీ సంతోష దేశాల జాబితాలో ర్యాంకును మెరుగుపర్చుకుంటుందని వెల్లడించింది. అసమానతలు, అవినీతి వల్లే అక్కడ సంతోషం కరువైందని తెలుస్తున్నది. హ్యాపినెస్ దేశాల జాబితాలో ఇజ్రాయెల్ 11వ, కొస్టారికా 12వ, ఆస్ట్రియా 13వ, అమెరికా 14వ, ఐర్లాండ్ 15వ, జర్మనీ 16వ, బెల్జియం 17వ, లగ్జంబర్గ్ 18వ, బ్రిటన్ 19వ, చిలీ 20వ స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచంలో పేద దేశాలు సంతోషదేశాల జాబితాలో చివరిస్థానంలో నిలిచాయి. ఆనందంలో వీటికి పదింట మూడు పాయింట్లు మాత్రమే వీటికి వచ్చాయి. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియా 152వ స్థానంలో నిలిచింది.

ఐక్యరాజ్య సమితి సంతోష దేశాల సర్వే జాబితాలో అమెరికాకు 14వ స్థానం, భారత్‌కు 122వ స్థానం

భారత్‌కు 122వ స్థానం


ఐక్యరాజ్య సమితి మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవం నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా సోమవారం ప్రపంచ హ్యాపీనెస్ నివేదిక 2017ను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 122వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 188 స్థానంలో ఉండగా ఈ ఏడాది నాలుగు స్థానాలకు పడిపోయింది. ఉగ్రవాద దేశం పాకిస్థాన్, పేద దేశం నేపాల్ మనకంటే సంతోషంలో ముందు వరుసలో ఉన్నాయి. పాకిస్థాన్ 80వ, నేపాల్ 99వ, భూటాన్ 97వ, బంగ్లాదేశ్ 110వ, శ్రీలంక 12వ స్థానాల్లో నిలిచాయి. అంతర్యుద్ధంతో అల్లాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ 141వ స్థానం దక్కించుకున్నది.

టాప్ టెన్ దేశాలు


నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్

సంతోషంగా లేని దేశాలు


సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, బురుండి, టాంజానియా, సిరియా, రువాండ, టోగో, గినియా, లిబియా, దక్షిణ సుడాన్, యెమెన్

1350

More News

మరిన్ని వార్తలు...