అణ్వస్త్రరహిత కొరియా

Wed,June 13, 2018 03:48 AM

North Korea Kim Jong un and Donald Trump sign denuclearisation agreement in Singapore

-అమెరికా, ఉత్తర కొరియా అపూర్వ కరచాలనం
-ఉభయ దేశాల చరిత్రలో తొలిసారి కలిసిన నేతలు
-ఊహించిన దానికన్నా అద్భుతంగా భేటీ: ట్రంప్
-ఎన్నో అడ్డంకులు అధిగమించాకే చర్చలు జరిగాయి: కిమ్
-సానుకూల ఫలితాలనిచ్చిన శిఖరాగ్ర చర్చలు
-కీలక ఒప్పందాలపై ఇద్దరు దేశాధినేతల సంతకాలు
-సంపూర్ణ అణునిరాయుధీకరణకు కిమ్ అంగీకారం
-భద్రత, ఇతర ప్రయోజనాలకు హామీ ఇచ్చిన అమెరికా
-దక్షిణ కొరియా నుంచి సైనిక బలగాల ఉపసంహరణ
-సంయుక్త విన్యాసాల నిలుపుదలకు ట్రంప్ హామీ

Trumpkim
సింగపూర్, జూన్ 12:సింగపూర్ వేదికగా చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రపంచానికి ఉపశమనాన్నిస్తూ అమెరికా, ఉత్తరకొరియా మధ్య మంగళవారం జరిగిన శిఖరాగ్ర చర్చలు ఫలప్రదమయ్యాయి. కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణునిరాయుధీకరణకు అంగీకరించిన ఉత్తర కొరి యా అధినేత కిమ్ జోంగ్ ఉన్.. బదులుగా అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ నుంచి భద్రతతోపాటు పలు ప్రయోజనాలపై హామీలను పొందగలిగారు. అనేక మలుపులు, ఆసక్తికర పరిణామాల తర్వాత ఉత్తర కొరియా అధినేత, అమెరికా అధ్యక్షుడు చర్రితలోనే తొలిసారిగా ముఖాముఖి చర్చలు జరిపారు. పలు కీలక అంశాలు వారిమధ్య చర్చకు వచ్చాయి. అత్యంత అరుదైన ఈ భేటీకి సింగపూర్ సెంటోసా దీవిలోని కేపెల్లా హోటల్ వేదికగా మారింది. చర్చలు సూటిగా, నిజాయితీగా, ఫలితాలనిచ్చేవిగా జరిగాయని ట్రంప్ పేర్కొన్నా రు. ఊహించిన దానికన్నా అద్భుతంగా తమ భేటీ జరిగిందని, దీని ద్వారా చాలా పురోగతి చోటుచేసుకుంటుందని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా కోరినట్లుగానే ఇకపై దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను అమెరికా జరుపబోదని, దక్షిణ కొరియాలోని సైనికబలగాలను ఉపసంహరించుకుంటామని ట్రంప్ వెల్లడించారు.

అదే సమయంలో గతంలో అణుపరీక్షల సందర్భంగా ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలు ప్రస్తుతానికి అలాగే ఉంటాయని ఆయన తెలిపారు. శాంతిస్థాపనకు తమ భేటీ ఎంతగానో దోహదపడుతుందని నమ్ముతున్నట్లు కిమ్ పేర్కొన్నారు. అనువాదకుల సమక్షంలో డొనాల్డ్ ట్రంప్, కిమ్‌జోంగ్ ఉన్ దాదాపు 45 నిమిషాలపాటు ముఖాముఖి సమావేశమయ్యారు. అనంతరం తమ దౌత్యాధికారులతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ, శాంతిస్థాపనే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య నూతన స్నేహసంబంధాలను నెలకొల్పడంతోపాటు కొరియన్ ద్వీపకల్పంలో శాశ్వత శాంతిస్థాపనకు సంబంధించిన సమస్యలపై విస్తృత, లోతైన చర్చలు జరిగాయి. ఇరువురం నిజాయితీగా అభిప్రాయాలను పంచుకున్నాం అని భేటీ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ట్రంప్, కిమ్ తెలిపారు. ఉతర కొరియాకు తగిన భద్రతాపరమైన భరోసాను కల్పించేందుకు ట్రంప్ హామీ ఇవ్వగా, సంపూర్ణ అణునిరాయుధీకరణకు కట్టుబడి ఉంటామని కిమ్ ప్రకటించినట్లు సంయుక్త ప్రకటన వెల్లడించింది. యుద్ధఖైదీలను, గల్లంతైన వారిని పరస్పరం అప్పగించుకోవడంతోపాటు యుద్ధనేరస్థుల్ని వారి స్వదేశాలకు పంపేఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించాయి.

కొత్త చరిత్ర మొదలవుతుంది : ట్రంప్

అద్భుత దేశంగా మారేందుకు అర్హతలన్నీ ఉన్న ఉత్తర కొరియాతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు, నూతన చరిత్రకు నాంది పలికేందుకు అమెరికా సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ముఖాముఖి చర్చల తర్వాత సుమారు గంటపాటు ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. చాలా సానుకూలంగా మా భేటీ జరిగింది. అందరూ ఊహించిన దానికంటే అద్భుతంగా ఈ సమావేశం జరిగింది. ఈ చర్చల ద్వారా చాలా పురోగతిని ప్రపంచం త్వరలోనే చూస్తుంది అని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు. తమ ప్రజలకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు చొరవ తీసుకుని చర్చలకు ముందుకు వచ్చారంటూ ఆయన కిమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రధాన అణుకేంద్రాన్ని ఇప్పటికే ధ్వంసం చేసినట్లు కిమ్ నాతో చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ దిశగా చర్యలు తొందరలోనే ప్రారంభమవుతాయి. మా ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దక్షిణ కొరియా, జపాన్, చైనా వంటి మరిన్ని దేశాలతోనూ సంప్రదింపులు జరుపాల్సి ఉన్నది. వచ్చేవారం అమెరికా రాజనీతిజ్ఞుడు, రిపబ్లికన్ల సలహాదారు జాన్‌బోల్టన్‌తో చర్చిస్తాం అని ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియా ఆర్థిక భవిష్యత్ ఎలా ఉండబోతుందని ప్రశ్నించగా, దాన్ని ఆ దేశం, అక్కడి పౌరులే నిర్ణయిస్తారని ట్రంప్ సమాధానమిచ్చారు. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల వీడియో దృశ్యాల్లో తాను కొన్ని గొప్ప గొప్ప సముద్రతీరాలు చూశానని, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కావాల్సిన అర్హతలు ఆ బీచ్‌లకు ఉన్నాయని చెప్పారు. కిమ్ చాలా ప్రతిభావంతుడని, సరైన సమయంలో ఆయనను వైట్‌హౌస్‌కు ఆహ్వానిస్తానని ట్రంప్ చెప్పారు. ఏదో ఒక సమయంలో తాను కూడా ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు వెళ్తానన్నారు.

ఇక యుద్ధవిన్యాసాల నిలిపివేత

కొరియా ద్వీపకల్పంలో యుద్ధవిన్యాసాలను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఉత్తరకొరియాతో ఉన్న విభేదాలకారణంగా ఇప్పటివరకు పలుమార్లు దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలను చేపట్టింది. అయితే మంగళవారంనాటి చర్చల సందర్భంగా కిమ్ వీటిని ప్రస్తావించారు. అమెరికా యుద్ధవిన్యాసాలు శాంతిని భంగపరిచేలా, రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయంటూ కిమ్ అభ్యంతరం తెలిపారని, అందువల్లే వాటిని ఇకపై నిలిపివేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాలో మోహరించిన అమెరికన్ బలగాలను కూడా వెనక్కి రప్పిస్తామని ఆయన చెప్పారు.

పెను మార్పుల్ని చూస్తారు: కిమ్

ప్రపంచం పెను మార్పుల్ని చూడబోతున్నదని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. కొరియన్ భాషలో ఆయన క్లుప్తంగా మాట్లాడగా, దుబాసీ ఆంగ్లంలోకి అనువాదం చేశారు. గతాన్ని మరిచిపోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శాంతి స్థాపనకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో అవాంతరాల తర్వాత సింగపూర్ భేటీ సాకారమైందని.. ఎన్నో సంశయాలు, ఊహాజనితాలను చర్చలతో అధిగమించామని తెలిపారు. మున్ముందు అనేక సవాళ్లు ఎదురవుతాయని, అయినప్పటికీ ట్రంప్ సహకారంతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు.

ట్రంప్, కిమ్ స్నేహహస్తం

Trumpkim2
తొలిసారిగా కలుసుకున్న సందర్భంగా ట్రంప్, కిమ్ 12సెకన్ల పాటు కరచాలనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ చాలాసేపు చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. తర్వాత తమ జాతీయ జెండాల వద్ద నిల్చొని ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ముచ్చటించిన తర్వాత ట్రంప్.. హోటల్ లైబ్రరీ వైపు కిమ్‌కు దారి చూపించారు. ఇద్దరూ కలిసి కారిడార్‌లో నడచుకుంటూ లోపలికి వెళ్లారు. పెద్దవారిని కలిసేందుకు వెళ్తున్నప్పుడు ముందే చేరుకోవాలన్న కొరియన్ సంప్రదాయం ప్రకారం 34 ఏండ్ల వయసున్న కిమ్ ఏడు నిమిషాల ముందుగానే కెపెల్లా హోటల్‌కు చేరుకున్నారు. ఇక 71 ఏండ్ల ట్రంప్.. కొరియన్లకు ఎంతో ఇష్టమైన ఎరుపురంగు టైని ధరించి చర్చలకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లోనే ఇరువురునేతలు విందును కూడా పూర్తిచేశారు. సమావేశం అనంతరం ట్రంప్ సింగపూర్ నుంచి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో గ్వామ్‌లోని అమెరికన్ బలగాలను ఆయన కలుసుకుంటారని, అక్కడినుంచి వాషింగ్టన్ చేరుకుంటారని అధికారులు తెలిపారు. 1950-53 కొరియా యుద్ధం తర్వాత అమెరికా, ఉత్తర కొరియా శత్రుదేశాలుగా మారాయి. ఈ రెండు దేశాల అధ్యక్షుల మధ్య చర్చలు కాదుగదా కనీసం ఫోన్లో కూడా నేతలు మాట్లాడుకోలేదు. తొలిసారిగా ఇప్పుడు ఇరుదేశాధినేతలు భేటీ కావడం ప్రపంచ చరిత్రలో ఒక కీలక ఘట్టంగా మిగిలిపోనున్నది.

శాంతితో ఎన్నో ప్రయోజనాలు

శాంతితో ఎటువంటి పురోగతిని సాధించవచ్చో వివరిస్తూ ఒక హాలీవుడ్ తరహా వీడియోను అధ్యక్షుడు ట్రంప్ ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు చూపించారు. ఆ వీడియోలో ప్రధాన పాత్రలుగా ట్రంప్, కిమ్‌లను చూపించారు. ప్రచ్ఛన్నయుద్ధం నాటి ప్రత్యర్థుల మధ్య శాంతి నెలకొంటే ఆ ప్రయోజనాలు ఎలా ఉంటాయో నాటకీయ ఫక్కీలో ప్రదర్శించారు. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు నేతలు, ఒకే గమ్యం పేరిట సాగిన కథనంలో ఉత్తరకొరియా తన అణ్వాయుధాలను నిర్మూలించడం వల్ల కలిగే లాభాలెలా ఉంటాయో వివరించారు. ఈ వీడియోను ఉత్తర కొరియా అధినేతతోపాటు ఆయన ఎనిమిది మంది సహచరులు కూడా వీక్షించారు. మీడియా సమావేశంలో ఈ వీడియో గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా, మేమే ఆ వీడియోను రూపొందించాం..దానిని ఆయన(కిమ్)కు చూపించాము.. ఆయనకు బాగా నచ్చి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. తన ప్రజల దృష్టిలో వీరునిగా ఉన్న కిమ్ తాను తలచుకుంటే మునుపెన్నడూ లేనటువంటి పురోగతిని సాధించవచ్చునని ఆ వీడియోలో ఓ వ్యాఖ్యానం వినిపించింది.

ఇక ఇరాన్‌పై ట్రంప్ దృష్టి

Trumpkim3
అణు క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిన ఉత్తరకొరియా అధినేత కిమ్‌ను తన దారికి తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇక ఇరాన్‌పై దృష్టి సారించారు. ఇరాన్‌తో కూడా తమ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌లో కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తగు సమయంలో ఇరాన్‌తో కూడా సంబంధాలు మెరుగుపడుతాయి. అందుకు సరైన సమయం రావాలి. ఆంక్షలు అమలవుతున్నాయి. మేము ఇరాన్‌పై పెట్టిన ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. వారు తిరిగి వచ్చి ఒక వాస్తవ ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా జరుగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంకా ఆ సమయం రాలేదు అని అన్నారు.

సవాళ్లు.. ప్రతి సవాళ్లు..చివరికి స్నేహం, కరచాలనం

kim-trump
ట్రంప్-కిమ్ చారిత్రాత్మ భేటీ అంత సులభంగా ఏమీ జరుగలేదు. సింగపూర్ సమావేశానికి ముందు ఇరుదేశాల మధ్య ఎన్నో సవాళ్లు.. ప్రతి సవాళ్లు చోటుచేసుకున్నాయి. ఒకానొకదశలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. భేటీకి ముందు పరిణామాలు ఇలా..
మార్చి 7, 2017: ఉత్తరకొరియా అణ్వస్త్ర బెదిరింపులు కొత్త దశకు చేరుకున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. జపాన్ మీదుగా ఉత్తరకొరియా నాలుగు క్షిపణులను ప్రయోగించిన మరుసటి రోజు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 26, 2017: ట్రంప్ ప్రభుత్వం ఉత్తరకొరియా విధానాన్ని అమెరికా చట్టసభ ముందుంచింది. ఉత్తరకొరియాపై ఆంక్షాలు, ఒత్తిడి పెంచుతున్నట్టు ప్రకటించింది. భాగస్వామ్య పక్షాలు, ప్రాంతీయ మిత్రులతో కలిసి ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా పనిచేయనున్నట్టు తెలిపింది.

ఏప్రిల్ 27, 2017: ఉత్తరకొరియాతో అమెరికాకు అతిపెద్ద వివాదం నెలకొన్నదని.. దీనిని దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు.
మే 24, 2017: అణ్వస్ర్తాలు కలిగిన పిచ్చివాడని ఉత్తరకొరియా నేత కిమ్‌ను విమర్శించిన ట్రంప్.
జూన్ 1, 2017: ఉత్తరకొరియా అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమంతో సంబంధం ఉన్న అన్ని సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు.
జూలై 4, 2017: జపాన్ సముద్రం మీదుగా ఉత్తరకొరియా దీర్ఘశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. అమెరికా ఉత్తర రాష్ట్రమైన అలాస్కాకు చేరుకునే సామర్థ్యం సదరు క్షిపణికి ఉన్నదని పలువురు నిపుణులు పేర్కొన్నారు.
ఆగస్టు 9, 2017: పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా భూభాగమైన గ్వామ్ ద్వీపాన్ని ఖండాంతర క్షిపణితో ధ్వంసం చేస్తామని ఉత్తరకొరియా హెచ్చరిక.
సెప్టెంబర్ 19, 2017: ఉత్తరకొరియాను నామరూపాల్లేకుండా చేస్తానని ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో తన మొదటి ప్రసంగం సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.
సెప్టెంబర్ 21, 2017: ఉత్తరకొరియాతో ఆర్థిక లావాదేవీలు, వాణిజ్యం చేస్తున్న సంస్థలపై అదనపు ఆంక్షలు విధిస్తూ ట్రంప్ సంతకం.
సెప్టెంబర్ 21, 2017: ట్రంప్ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగంపై కిమ్ ప్రతిస్పందించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తన పేరుపై ప్రకటన విడుదల చేశారు. మానసిక వ్యాధి ఉన్నవాడిలా ట్రంప్ ప్రవర్తిస్తున్నారని.. భయపడిన కుక్క పెద్దగా మొరుగుతుందని ఎద్దేవా చేశారు.

జనవరి 1, 2018: అమెరికా నుంచి ఎదురయ్యే ఎటువంటి అణు హెచ్చరికలనైనా అడ్డుకునే సామర్థ్యం ఉత్తరకొరియా అణ్వాయుధాలకు ఉన్నదని కిమ్ ప్రకటన.
మార్చి 8, 2018: కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితం చేసేందుకు తమ నేతలు జూన్ కంటే ముందే చర్చలు జరుపుతారని ఉత్తరకొరియా, అమెరికా ప్రకటించాయి.
మార్చి 25, 2018: ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలుసుకునేందుకు కిమ్ తొలిసారి చైనా వెళ్లారు.
మే 8, 2018: కిమ్ రెండోసారి చైనా వెళ్లి జిన్‌పింగ్‌తో భేటీ.
మే 8, 2018: ట్రంప్-కిమ్ భేటీకి సన్నాహకంగా అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్ పాంపియో ఉత్తరకొరియా పర్యటన.
మే 9, 2018: ట్రంప్-కిమ్ భేటీ ముందు సౌహార్ద సూచికగా ఉత్తరకొరియా ముగ్గురు అమెరికన్ బందీలను విడిచిపెట్టింది.
మే 10, 2018: అణు నిరాయుధీకరణపై చర్చలు జరిపేందుకు జూన్ 12న సింగపూర్‌లో తాను కిమ్‌తో భేటీ కానున్నట్టు ట్రంప్ ప్రకటన.
మే 24, 2018: విదేశీ జర్నలిస్టుల ఎదుట పుంగ్య్-రి అణు పరీక్షా కేంద్రాన్ని ఉత్తరకొరియా ధ్వంసం చేసింది. అదేరోజు ఉత్తరకొరియా అమెరికా పట్ల ప్రదర్శించిన బహిరంగ శత్రుత్వ భావానికి వ్యతిరేకంగా జూన్ 12 సదస్సును రద్దు చేస్తున్నట్టు ట్రంప్ కిమ్‌కు లేఖ రాశారు.
మే 25, 2018: ట్రంప్ లేఖపై స్పందించిన ఉత్తరకొరియా తాము ఏ మార్గంలోనైనా, ఎప్పుడైనా అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది.
జూన్ 1, 2018: కిమ్‌తో భేటీపై యూటర్న్ తీసుకున్న ట్రంప్.. జూన్ 12న భేటీ ఉంటుందని ధ్రువీకరించారు.

కీలక మైలురాయి

కొరియా ద్వీపకల్ప అణు నిరాయుధీకరణ దిశగా ట్రంప్-కిమ్ భేటీ కీలక మైలురాయిగా నిలుస్తుంది. అన్ని పక్షాలు ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ లక్ష్య సాధనకు ఐక్యరాజ్య సమితి సహాయం చేస్తుంది. సింగపూర్ సమావేశం స్థిరమైన శాంతి ప్రక్రియలో కీలకమైనది.
-ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్

పొరుగు దేశం నుంచే అణు విస్తరణ

అణు నిరాయుధీకరణ దిశగా జరిగిన ట్రంప్, కిమ్ భేటీ ఒక సానుకూల ముందడుగు. అమెరికా-ఉత్తరకొరియా మధ్య చర్చలను భారత్ స్వాగతిస్తున్నది. శాంతి, స్థిరత్వం సాధన కోసం చర్చలు, దౌత్యం ద్వారా చేసే ప్రయత్నాలకు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. భారత్‌కు పొరుగున ఉన్న దేశం నుంచే ఉత్తరకొరియాకు అణు విస్తరణ జరిగింది.
-భారత విదేశాంగ మంత్రిత్వశాఖ

ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలిగించాలి

ద్వీపకల్పంలో శాంతి పునరుద్ధరణకు ఒక విధానాన్ని రూపొందించడంతోపాటు ఉత్తరకొరియా భద్రతా ఆందోళనలను కూడా పరిష్కరించాలి. ఈ మొత్తం ప్రక్రియలో చైనా పోషించిన కీలకమైన పాత్రపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను తొలిగించాలి.
-చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ


ఇది నాటకీయ ముందడుగు

ట్రంప్-కిమ్ మధ్య సింగపూర్‌లో జరిగిన భేటీ శాంతి ప్రకియ దిశగా వేసిన నాటకీయ ముందడుగు. ఈ చారిత్రాత్మక భేటీకి ఆతిథ్యం ఇవ్వడం మేం గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. చర్చల ప్రక్రియకు విజయవంతమైన ముగింపు పలికినందుకు ఇరు దేశాధినేతలకు శుభాకాంక్షలు.
-సింగపూర్ ప్రధాని లీ సైయన్ లూంగ్

ప్రచ్ఛన్నయుద్ధానికి ముగింపు

ట్రంప్-కిమ్ మధ్య జరిగిన చారిత్రాత్మక భేటీ చిట్టచివరి ప్రచ్ఛన్న యు ద్ధానికి ముగింపు పలికింది. ఇరు దేశాధినేతలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భేటీ విజయవంతమైన నేపథ్యంలో నేను నిశ్చింతగా నిద్రపోతాను.
-దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్

రాచరిక కమ్యూనిజం

-70 ఏండ్లుగా కిమ్ వంశీయుల పాలన
-ప్రస్తుతం నడుస్తున్నది మూడో తరం
-తొలినుంచీ సైన్యానికే అధిక ప్రాధాన్యం

Mansu
ఉత్తర కొరియా.. అధికారిక నామం డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. జనాభా దాదాపు 2.5 కోట్లు. ఇప్పటికీ రాచరిక వ్యవస్థ తరహాలో కిమ్ వంశీయుల నిర్బంధ పాలనలో నలుగుతున్న దేశం. 1948 వరకు కొరియా ద్వీకల్పం (ప్రస్తుత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా కలిపి ఉన్న భూభాగం) ఏకంగా ఉండేది. జపాన్ విస్తరణ కాంక్షలో భాగంగా 1910లో కొరియాద్వీపకల్పాన్ని ఆక్రమించింది.1919లో జపాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ లక్షలాది మంది కొరియన్లను బలవంతంగా సైన్యంలోకి తీసుకొని యుద్ధరంగంలో ముందు వరుసలో ఉంచింది. దీంతో లక్షలాది మంది మరణించారు. ఈ యుద్ధంలో జపాన్ ఓడిపోయింది. యుద్ధం చివరిదశకు చేరేనాటికి కొరియా రెండుగా విడిపోయింది.

రెండుగా విభజన

1945లో కొరియా ద్వీపకల్పంలోని ఉత్తర భాగాన్ని సోవియట్ యూనియన్, దక్షిణ భాగాన్ని అమెరికా ఆక్రమించాయి. 38 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఆధారంగా ద్వీకపల్పాన్ని విభజించాయి. నేరుగా అధికారం చలాయించకపోయినా తమకు అనుకూలంగా ఉండే నేతల ద్వారా పాలన సాగించాయి. 1946లో రెండు ప్రాంతాల్లోనూ తాత్కాలిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ఉత్తర కొరియాలో భూ సంస్కరణలను అమలు చేసి ప్రధాన పరిశ్రమలు, సంస్థలను జాతీయం చేశారు.

స్వాతంత్య్ర ప్రకటన

1948లో ముందుగా దక్షిణ కొరియా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నది. కమ్యూనిస్టు వ్యతిరేక నాయకుడు సైంగ్మన్ రీ దానికి పాలకుడయ్యాడు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాగా పేరు మార్చారు. సియోల్‌ను రాజధానిగా ప్రకటించారు. ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 9న ఉత్తర కొరియా ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా పేరుతో సొంత దేశంగా ప్రకటించుకున్నది. ప్యాంగ్యాంగ్‌ను రాజధానిగా మార్చారు. ఆ దేశ విముక్తి ఉద్యమ నేత కిమ్ ఇల్ సంగ్ దేశాధినేతగా పాలన చేపట్టారు. తర్వాత కొన్నాళ్లకు ఉత్తర కొరియా నుంచి సోవియట్ సైన్యం వెనుదిరిగింది. ఆ తర్వాత సంవత్సరానికి అమెరికా సైన్యం దక్షిణ కొరియా నుంచి వెనుదిరిగింది.

జూచే విధానం

1976లో మావో మరణం తర్వాత చైనా తీరు మారటంతో.. కిమ్ ఇల్ సంగ్.. ఉత్తరకొరియాలో జూచే విధానాన్ని అమలుచేశారు. దిగుమతులపై ఆధారపడకుండా ప్రజలకు అవసరమయ్యే ప్రతి వస్తువునూ దేశంలోనే ఉత్పత్తి చేయాలనేది జూచే విధానం. ఆర్థిక రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా తన చేతుల్లోకి తీసుకున్నది. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ జప్తు చేసింది. ప్రైవేట్ మీడియాను నిషేధించింది. ప్రజల విదేశీ పర్యటనలపై నియంత్రణ విధించింది. సోవియట్ యూనియన్ సహకారంతో కిమ్ ఇల్ సంగ్ సైన్యాన్ని విపరీతంగా పెంచారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకటిగా నిలిపారు. సోవియట్ మినహా ఇతర దేశాలను పట్టించుకోలేదు. ఈ నిర్ణయాలు ఆర్థిక రంగంపై విపరీత ప్రభావం చూపించారు. 1980లో ఆర్థిక సంక్షోభం ప్రారంభమైంది. 1987 నాటికి పూర్తిగా క్షీణించింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యా నుంచి వచ్చే సహాయం హఠాత్తుగా నిలిచిపోయింది. దీంతో ఉత్తరకొరియా వేరే దారిలేక చైనావైపు మొగ్గు చూపింది.

ముంచిన వరదలు

1994లో కిమ్ ఇల్ సంగ్ మరణించగా, ఆయన కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ దేశాధినేతగా బాధ్యతలు స్వీకరించారు. అణుబాంబులు తయారు చేస్తామని ప్రకటించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో వెనుకకుతగ్గారు. కిమ్ జోంగ్ ఇల్ పాలనలో సైన్యానికి ప్రాధాన్యం మరింత పెరిగింది. మరోవైపు 1990లో సంభవించిన వరదలు, ఆ తర్వాత ఏర్పడిన కరువు ఉత్తరకొరియా ఆర్థిక రంగంపై పెను ప్రభావం చూపింది. దేశం దివాళా స్థాయికి చేరింది.

రోగ్ స్టేట్ అనే ముద్ర

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఉత్తరకొరియా వివిధ దేశాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నించింది. 2000లో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఉత్తరకొరియాలో పర్యటించారు. అయితే కిమ్‌జోంగ్ ఇల్ ప్రభుత్వం అణ్వాయుధాల తయారీ వైపు విపరీతమైన ఆసక్తి చూపడం, పరిశోధనలు ప్రారంభించడంతో అమెరికాతోపాటు పలు దేశాలతో సంబంధాలు తెగిపోయాయి. అయినా ఆపకుండా పరిశోధనలు జరిగాయి. అణు పరిశోధనలకు కిమ్ జోంగ్ ఇల్ 1995లో అంగీకారం తెలుపగా, 2000 నాటికి భూగర్భంలో ప్రయోగశాలలు ఏర్పాటు చేసి పరిశోధనలు మొదలు పెట్టారు. యురేనియం ఉత్తత్తి మొదలు పెట్టారు. 2006లో మొదటిసారిగా తాము అణు పరీక్షలు జరిపినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ పరిణామాలు ఉత్తర కొరియాపై రోగ్ స్టేట్ (రౌడీ రాజ్యం) అన్న ముద్ర వేశాయి. 2010లో దక్షిణ కొరియా యుద్ధనౌక మునిగిపోయింది. దీనికి ఉత్తరకొరియానే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

కొరియన్ యుద్ధానికి పది లక్షల మంది బలి

1950 నాటికి ఉభయకొరియాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియాపైకి దండెత్తింది. అధిక భాగాన్ని ఆక్రమించుకున్నది. దీంతో అమెరికా దక్షిణ కొరియాకు అండగా నిలిచి, దాదాపు 3.4 లక్షల మంది సైన్యాన్ని దింపింది. చైనా ఉత్తర కొరియాకు అండగా నిలిచింది. దాదాపు మూడేండ్లపాటు యుద్ధం నిరంతరాయంగా కొనసాగింది. 1953 జూలై 27న రెండు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో కొరియన్ యుద్ధానికి ముగింపు పలికారు. సరిహద్దులను తిరిగి పునరుద్ధరించారు. అయితే ఈ యుద్ధంలో 10 లక్షల కంటే ఎక్కువ మంది మరణించారని అంచనా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా తన సైన్యాన్ని దక్షిణ కొరియాలో కొనసాగిస్తూనే ఉన్నది. 1958లో ఉత్తర కొరియా నుంచి చైనా సైన్యం వెనుదిరిగింది. తర్వాత కిమ్ ఇల్ సంగ్ పరిశ్రమలను పునరుద్ధరించారు. దక్షిణ కొరియాకన్నా వేగంగా ఉత్తర కొరియా అభివృద్ధి చెందింది. 1976లో చైనాలో మావో జెడాంగ్ మరణించిన తర్వాత చైనా-ఉత్తరకొరియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ సమయంలో చైనా అమెరికాకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నది. దీంతో ఉత్తరకొరియాను దూరంగా ఉంచింది.

మూడో తరం... కిమ్ జోంగ్ ఉన్ శకం..

2011 డిసెంబర్ 11న కిమ్ జోంగ్ ఇల్ మరణించాడు. దీంతో ఆయన రెండో కొడుకు కిమ్ జోంగ్ ఉన్ 27 ఏండ్ల వయసులో కొరియా అధినేతగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ తర్వాత అణు పరీక్షల్లో వేగం పెరిగింది. అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిడులు ఎదురైనా పట్టించుకోకుండా భారీగా అణ్వాయుధాలను తయారు చేసి, నిల్వ చేశారు. అమెరికాలోని ఏ నగరాన్నైనా ధ్వంసం చేయగల క్షిపణిని తయారుచేశామని ప్రకటించారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నే ఢీకొట్టారు. దీని వెనుక చైనా సహకారం ఉన్నదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పలు దేశాలు ఉత్తరకొరియాపై ఆంక్షలు విధించాయి.

1408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles