అసాల్ట్ రైఫిళ్లపై నిషేధం

Fri,March 22, 2019 03:16 AM

-సెమీ ఆటోమెటిక్ తుపాకులపై కూడా
-న్యూజిలాండ్ సర్కారు సంచలన నిర్ణయం
-దేశంలో తుపాకుల సంస్కృతికి చరమగీతం పాడేందుకు ప్రధాని జసిండా చర్యలు
-అమెరికాలోనూ ఊపందుకున్న డిమాండ్లు

వెల్లింగ్టన్, మార్చి 21: ఉగ్రవాద దాడులకు చరమగీతం పాడేందుకు న్యూజిలాండ్ సర్కారు ఉపక్రమించింది. క్రైస్ట్‌చర్చ్‌లోని అల్ నూర్ మసీదులో ఉన్మాది కాల్పుల్లో 50 మంది మృతిచెందిన ఘటన నేపథ్యంలో అసాల్ట్ రైఫిళ్లతో సహా అన్ని రకాల తుపాకులపై నిషేధం విధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది. న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అసాల్ట్ తుపాకులు, మిలటరీ తరహా, ఉగ్ర దాడుల్లో ఉపయోగించే సెమీ ఆటోమెటిక్ రైఫిళ్లపై నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది. గతం వారం మసీదులో చోటుచేసుకున్న దారుణమైన ఊచకోత లాంటి సంఘటనలు దేశంలో పునరావృతం కాకుండా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం. అత్యున్నత సామర్థ్యం ఉన్న మ్యాగజైన్స్, ఇతర మారణాయుధాలపైనా నిషేధం విధిస్తున్నాం అని పేర్కొన్నారు.

ఊచకోత సందర్భంగా ఉన్మాది బ్రెంటన్ టారెంట్ ఉపయోగించినటువంటి అన్ని రకాల తుపాకులపైనా నిషేధం విధిస్తున్నట్లు జసిండా చెప్పా రు. నిషేధించిన ఆయుధాలను ఇకపై ఎవరూ విక్రయించలేరని, పోలీసుల ప్రత్యేక అనుమతితోనే వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రధాని తెలిపారు. ఈ విషయంలో న్యూజిలాండ్ ప్రజలు తనకు మద్దతుగా నిలుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. అలాగే ఆంక్షలతో కూడిన తుపాకీ చట్టాన్ని ఏప్రిల్ 11 నాటికి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందే మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిషేధించిన జాబితాలోని ఆయుధాలు కలిగిన వారు వాటిని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఇందుకోసం బై బ్యాక్ స్కీంను కూడా ప్రవేశపెడుతున్నామని, ఇందుకు సుమారు రూ.954 కోట్ల వరకు ఖర్చు కానున్నట్లు ఆమె వివరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేషనల్ పార్టీ నేత సైమన్ బ్రిడ్జెస్ స్వాగతించారు. తుపాకీ సంస్కృతి నిర్మూలనకు సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు.

rifiles

స్వాగతించిన అమెరికా

న్యూజిలాండ్ నిర్ణయం అమెరికాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అమెరికాలోనూ తుపాకులపై నిషేధం విధించాలని అక్కడి చట్టసభ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తుపాకీ సంస్కృతికి అమెరికా కూడా చరమగీతం పాడాలని డెమొక్రటిక్ సెనెటర్, అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న అభ్యర్థి బెర్నీ సాండర్స్ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అమెరికాలో రైఫిళ్ల అమ్మకాలు, వినియోగంపై వెంటనే నిషేధం విధించాలి అని డిమాండ్ చేశారు. 2012 సంవత్సరంలో కనెక్టికట్‌లోని సాండీ హుక్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 20 మంది చిన్నారులు, ఐదుగురు సిబ్బంది చనిపోయారని, ఆరేండ్లు దాటినా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు చేపట్టలేదని డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకసియో కార్టెజ్ విమర్శించారు. వారం కింద న్యూజిలాండ్‌లో కాల్పుల ఘటన జరిగింది. వెంటనే అన్ని రకాల తుపాకులపై ఆ దేశం నిషేధం విధించింది. నాయకత్వం అంటే ఇలా ఉండాలి.. అని ఆమె చురకలంటించారు. మరోవైపు ఆయుధ వ్యాపారుల లాబీ మాత్రం నిషేధం సరికాదని, తుపాకుల వాడకంపై కఠిన ఆంక్షలు విధిస్తే సరిపోతుందని తెలిపింది.

ఆ వ్యక్తి చనిపోలేదు: పోలీసులు

న్యూజిలాండ్‌లోని అల్ నూర్ మసీదులో ఉన్మాది జరిపిన కాల్పుల్లో చనిపోయాడంటూ చార్జిషీట్‌లో పేర్కొన్న వ్యక్తి జీవించే ఉండడంతో పోలీసులు కంగుతిన్నారు. చార్జిషీటును న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఆ వ్యక్తి పేరును వెంటనే చార్జిషీట్ నుంచి తొలిగించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. చార్జిషీట్‌లో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తప్పుగా నమోదైంది. వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పాం. ఆ చార్జిషీట్‌ను తిరిగి రాస్తాం అని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.

963
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles