సూర్యుడిపైకి పార్కర్!

Fri,August 10, 2018 02:56 AM

NASAs Parker Solar Probe set to touch the Sun

-సూర్యుడి సమీపంలోకి అంతరిక్ష నౌకను పంపనున్న నాసా
-రేపే ఫ్లోరిడా నుంచి ప్రయోగం
-ఏడేండ్లపాటు పరిశోధనలు చేయనున్న ప్రోబ్
-సూర్యుడిపై స్థితిగతులు, సౌర తుఫాన్లపై ప్రధాన దృష్టి
-లాంచింగ్ సమయంలో ప్రోబ్ బరువు: 685 కిలోలు
-ప్రోబ్ అసలు బరువు:555 కిలోలు
-పేలోడ్: 50 కిలోలు
-పొడవు: ఒక మీటర్, వెడల్పు: 3 మీటర్లు, ఎత్తు 2.3 మీటర్లు

చంద్రుడి మీద కాలుమోపి.. అంగారకుడి ఉపరితలంపై రోవర్‌ను దింపి.. గురు గ్రహం చుట్టూ శాటిలైట్లను తిప్పుతూ.. మన సౌరవ్యవస్థలో చివర ఉన్న ఫ్లూటో దగ్గరికి అంతరిక్ష నౌకను పంపి.. అత్యాధునిక టెలిస్కోప్‌ల సాయంతో విశ్వాంతరాళంలోకి తొంగి చూస్తున్న ఆధునిక మానవుడికి సూర్యుడి దగ్గరికి వెళ్లాలనేది ఎప్పటి నుంచో తీరని కల. సూర్య తాపాన్ని తట్టుకుని దగ్గరకు వెళ్లే పరిజ్ఞానాన్ని సాధించేందుకు ప్రపంచ దేశాల్లోని శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ అన్వేషణలో అమెరికా పరిశోధనా సంస్థ (నాసా) ముందడుగు వేసింది. సూర్యుడిని అత్యంత సమీపం నుంచి అధ్యయనం చేయడానికి అంతరిక్ష నౌకను పంపుతున్నది. దీనికి పార్కర్ సోలార్ ప్రోబ్ అని నామకరణం చేశారు. ఇది సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేస్తుంది. ఈ ప్రోబ్ ఈ నెల 11న తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. 2025 ఆగస్టు వరకు ఈ మిషన్ కొనసాగనున్నది.

పార్కర్ పేరే ఎందుకంటే..

నాసా తన అంతరిక్ష నౌకకు మొదటిసారిగా బతికున్న వ్యక్తి పేరు పెట్టింది. సూర్యుడి స్థితిగతులపై పరిశోధనలు చేస్తున్న ఖగోళ భౌతికశాస్త్రవేత్త యూజీన్ పార్కర్ గౌరవార్థం ఈ పేరు పెట్టింది. మొదటి యూజీన్ పార్కర్ ఆరు దశాబ్దాలకుపైగా సూర్యుడిపై పరిశోధనలు చేస్తున్నారు. సూర్యుడి చుట్టూ అయస్కాంత క్షేత్రం సర్పిలాకారంలో ఉన్నదంటూ 1950లో పార్కర్ స్పైరల్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

రేపే ప్రయాణం మొదలు

పార్కర్ ప్రోబ్ కారు సైజులో ఉంటుంది. దీనిని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే డెల్టా-4 అనే రాకెట్‌లో అమర్చారు. ఫ్లోరిడాలోని కేప్‌కనావెరల్ ఎయిర్‌ఫోర్స్‌స్టేషన్ నుంచి శనివారం అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్నది. పార్కర్‌ను నాసాకు చెందిన ఐప్లెడ్ ఫిజిక్స్ లేబొరేటరీ రూపొందించింది.

కరోనాపై నజర్

పార్కర్ ప్రోబ్ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల సమీపంలోకి వెళ్లనున్నది. ఈ ప్రాంతాన్ని కరోనా లేదా కాంతి వలయం అని పిలుస్తారు. ఇక్కడ సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణం తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. పార్కర్ అక్కడి కక్ష్యలో తిరుగుతూ సూర్యుడి వాతావరణంపై పరిశోధించనున్నది. కరోనా నుంచి వెలువడే సౌరతుఫానులపైనా పరిశోధనలు చేస్తుంది. ఇవి భూమిని తాకితే కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సౌర తుఫాన్లు ఎలా పుడుతాయి? వేగం ఎలా పెరుగుతుంది? వంటి ప్రశ్నలకు పార్కర్ సమాధానాలు సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఈ సమాచారం ఆధారంగా సౌరతుఫాన్ల నుంచి తప్పించుకోవడానికి గల మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషించనున్నారు.

parker2

ఏడేండ్ల ప్రయాణం

పార్కర్ ఏడేండ్లపాటు అంతరిక్షంలో ప్రయాణిస్తుంది. భూమి-సూర్యుడి కక్ష్యలను తాకేలా దీర్ఘవృత్తాకారంలో తిరుగుతుంది. ప్రతి 88 రోజులకు ఒకసారి భ్రమణాన్ని పూర్తి చేస్తుంది. దాదాపు 24సార్లు సూర్యుడి కరోనాను తాకుతుంది. కరోనాలోకి ప్రవేశించే సమయంలో సూర్యుడి ఆకర్షణ శక్తిని తప్పించుకునేందుకు ప్రోబ్ సెకనుకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తద్వారా అత్యధిక వేగంతో ప్రయాణించిన మానవ నిర్మిత వాహనంగా రికార్డు సాధించనున్నది.

1,370 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకునేలా..

సూర్యుడి కరోనా ప్రాంతంలోని అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా పార్కర్‌ను రూపొందించారు. పార్కర్‌కు అమర్చిన ఉష్ణకవచాలు గరిష్ఠంగా 1,370 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. ప్రోబ్ చుట్టూ 11.43 సెంటీమీటర్ల మందంతో కార్బన్‌తో తయారైన హీట్‌షీల్డ్‌ను అమర్చారు. ఇవి భూమిని చేరే సూర్యుడి రేడియేషన్ కన్నా 500రెట్లు అధిక రేడియేషన్‌ను తట్టుకోగలవు. బయటఎంత ఉష్ణోగ్రత ఉన్నా ప్రోబ్ లోపల 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా రక్షణ ఇవ్వడం విశేషం.

గంటకు 4,30,000 కి.మీ.లు

పార్కర్ ప్రోబ్ సూర్యుడిని చేరేందుకు గంటకు 4.3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నది. తద్వారా అత్యధిక వేగంతో ప్రయాణించిన మానవ నిర్మిత వాహనంగా రికార్డు సాధించనున్నది.

అత్యాధునిక పరికరాలు

ప్రోబ్‌లో అమర్చిన పరికరాలు సూర్యుడి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని, విద్యుత్ క్షేత్రాన్ని, శక్తివంతమైన తరంగాలను, శక్తి ఉత్పాదకాలను అధ్యయనం చేస్తాయి. ఇందులోని ఇమేజర్ ఫొటోలను తీస్తుంది.

1736
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles