ధ్రువాల్లో మంచుపై లేజర్ పరిశీలన

Sun,September 9, 2018 01:31 AM

NASA to send advanced laser system into space

అత్యాధునిక లేజర్ వ్యవస్థను అంతరిక్షంలోకి పంపనున్న నాసా
వాషింగ్టన్: ధ్రువ ప్రాంతాల్లోని మంచు కరుగుదల తదితర మార్పులను అత్యంత సూక్ష్మస్థాయిలో పరిశీలించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నానా) అధునాతన లేజర్ పరికరాన్ని అంతరిక్షంలోకి పంపనున్నది. దీనిని ట్రోపోగ్రఫిక్ లేజర్ అల్టిమీటర్ సిస్టమ్ (అట్లాస్) అని పిలుస్తున్నారు. వచ్చే నెల 12వ తేదీన అంతరిక్షంలోకి పంపనున్న ద ఐస్, క్లౌడ్ అండ్ ల్యాండ్ ఎలివేషన్ శాటిలైట్-2 (ఐస్‌శాట్-2)లో దీనిని అమర్చారు. ఈ పరికరం సాయంతో గ్రీన్‌లాండ్, అంటార్కిటికా ప్రాంతాల్లో ఏటా ఎంత మంచు కరుగుతున్నది? ఎంత మేర కొత్తగా ఏర్పడుతున్నది? వంటి అంశాలను నాసా క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నది. అట్లాస్ నిత్యం భూమిపైకి కాంతి కిరణాలను పంపుతుంది. కాంతిలోని ఫోటాన్లు మంచు ఉపరితలాన్ని తాకి, తిరిగి శాటిలైట్‌కు చేరడానికి పట్టే సమయాన్ని బట్టి మంచు ఫలకాల ఎత్తును అంచనా వేస్తుంది. దాదాపు పెన్సిల్ వెడల్పును ఒక యూనిట్‌గా సెకనుకు 60 వేల యూనిట్లను అధ్యయనం చేస్తుంది.

అట్లాస్ సెకనుకు 10వేల సార్లు కాంతిని వెదజల్లుతుంది. వందల కోట్ల ఫోటాన్లు భూమివైపు దూసుకొస్తాయి. అవి ఉపరితలాన్ని తాకి పరావర్తనం చెంది శాటిలైట్‌ను చేరుతాయి. ఐస్‌శాట్-2 వాటి ప్రయాణ కాలాన్ని బట్టి మంచు ఫలకాల ఎత్తును అంచనా వేస్తుంది. సెకనులో వందకోట్ల వంతు తేడా వచ్చినా గుర్తించగలుగుతుంది. ఈ శాటిలైట్ ఒక ధ్రువం నుంచి మరో ధ్రువంవైపు తిరుగుతూ ఉంటుంది. ఇలా ఏడాదికి నాలుగు సార్లు రెండు ధ్రువాలను చుట్టి వస్తుంది. సీజన్ల వారీగా, ఏడాది మొత్తంలో మంచు ఫలకాల ఎత్తులో వచ్చిన మార్పులను విశ్లేషించి నివేదిక ఇస్తుంది. ఈ నివేదికల ఆధారంగా మంచు ఫలకాల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించవచ్చని, అవి కరుగుతున్న వేగం, సముద్రమట్టాల్లో పెరుగుదలను విశ్లేషిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

487
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles