వేదాల నుంచి పర్యావరణ స్ఫూర్తి

Wed,December 5, 2018 02:43 AM

My strong commitment to climate action is rooted in the Vedas

-ఆ గ్రంథాల నుంచే తనకు ప్రేరణ కలిగిందన్న మోదీ
-వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించాలి: గుటేరస్
-సంపన్న దేశాలు వర్ధమాన దేశాలకు నిధులు సమకూర్చాలి: భారత్

ఐరాస, డిసెంబర్ 4: పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తనలోని బలమైన ప్రేరణ పురాతన హైందవ గ్రంథాలైన వేదాల నుంచి కలిగిందని ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌కు చెప్పారు. గతవారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా గుటేరస్‌తో మోదీ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వారిద్దరూ వాతావరణ మార్పులు, పారిస్ వాతావరణ ఒప్పందానికి భారత్ మద్దతుపై చర్చించారు. ఆ సందర్భంగానే తాను మోదీతో పర్యావరణ పరిరక్షణకు మీలో ప్రేరణ కలిగించిన అంశాలేమిటని ప్రశ్నించినప్పుడు, హిందూ మతానికి మూల గ్రంథాలైన వేదాలు అని మోదీ చెప్పారు. పర్యావరణ పరిరక్షణ అనే భావన దాదాపు అన్ని మతాల్లోనూ ఉంది అని గుటేరస్ సోమవారం పోలండ్‌లో విలేకరులతో చెప్పారు. వాతావరణ మార్పుల విషయంలో మతాల పాత్ర ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు గుటేరస్ పై విధంగా స్పందించారు.

పోలండ్‌లోని కాటోవైస్ నగరంలో జరుగుతున్న యూఎన్ కాప్24 వాతావరణ మార్పుల సమావేశంలో గుటేరస్ పాల్గొంటున్నారు. రెండువారాలపాటు జరుగనున్న ఈ సదస్సులో.. చారిత్రక 2015 పారిస్ ఒప్పందం అమలుకు మార్గదర్శకాలు రూపొందించనున్నారు. ఈ సదస్సునుద్దేశించి గుటేరస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అనేక దేశాలకు, ప్రజలకు వాతావరణ మార్పులు జీవన్మరణ సమస్యగా మారాయని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ప్రపంచదేశాలు తక్షణమే స్పందించాలని శాస్త్ర విజ్ఞానం చెప్తున్నదని గుర్తు చేశారు. తమ దేశం అతి తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నా.. వాతావరణ మార్పుల ప్రభావం తమపైనే ఎక్కువగా ఉంటున్నదని నేపాల్ దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ వాపోయారు.

టెక్నాలజీ బదిలీని సత్వరమే చేపట్టాలి : భారత్

వాతావరణ మార్పులపై పోరాడేందుకు వర్ధమాన దేశాలకు ధనిక దేశాలు నిధులు సమకూర్చాలని భారత్ సూచించింది. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక చర్చా పత్రాన్ని విడుదల చేసింది. ధనిక దేశాలు ఆర్థిక వనరులను సమకూర్చడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా బదిలీ చేయాలని ఐరాస వాతావరణ మార్పుల సదస్సు (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) తప్పనిసరి చేసిన విషయాన్ని భారత్ గుర్తు చేసింది. మరోవైపు, హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ అర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మాట్లాడుతూ.. తమ దేశాధ్యక్షుడు ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినప్పటికీ తమ దేశం హరిత భవిష్యత్తుకు కట్టుబడి ఉందని చెప్పారు.

585
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles