గ్రామీ అవార్డుల్లో మహిళలదే హవా

Tue,February 12, 2019 04:29 AM

- 28వసారి అవార్డు గెలిచి చరిత్ర సృష్టించిన క్విన్సీ జోన్స్
లాస్ ఏంజిల్స్, ఫిబ్రవరి 11: ఎప్పుడూ పురుషులే ఆధిక్యత కనబరిచే గ్రామీ అవార్డుల్లో ఈసారి మహిళలు తమ సత్తా చాటి చరిత్ర సృష్టించారు. ఏడాది క్రితం జరిగిన వేడుకలలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం, గుర్తింపు లభించలేదంటూ విమర్శలు రావడంతో ఈసారి గ్రామీ అవార్డుల సంరంభంలో నిర్వాహకులు మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తున్నది. విజేతలు, అతిథులు.. ప్రదర్శకుల్లో ఎక్కువ మంది మహిళలే కాగా, 14 ఏండ్ల తరువాత మొదటిసారిగా ఓ మహిళ (అలీసియా కీస్)కు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం కల్పించారు. మహిళా సంగీతకారులు కేసీ ముసగ్రేవ్స్, కార్డీ బీ, లేడీ గాగా ఈ ఏడాది గ్రామీ అవార్డుల విజేతలుగా నిలిచారు. కొత్త కళాకారుల అవార్డును కూడా ఓ మహిళ దువా లిపా గెలుచుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా మిషెల్ ఒబామా, లేడీ గాగా, జెన్నిఫర్ లోపెజ్, జాడా పింకెట్ స్మిత్ హాజరయ్యారు. ఆల్బమ్ ఆఫ్‌ది ఇయర్‌తోపాటు నాలుగు అవార్డులను కేసీ ముస్‌గ్రేవ్స్ గెలుచుకున్నారు. కార్డీ బీ రూపొందించిన ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీకి బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అవార్డు దక్కింది. ర్యాప్ ఆల్బమ్‌ను గెలిచిన తొలి సోలో మహిళగా కార్డీ చరిత్ర సృష్టించారు. లేడీ గాగా రెండు అవార్డులను గెలుచుకున్నారు.

అత్యధిక అవార్డుల విజేత

ప్రముఖ అమెరికన్ సంగీత దర్శకుడు క్విన్సీ జోన్స్ గ్రామీ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించారు. తన 70 ఏండ్ల కెరీర్‌లో 28వ అవార్డును గెలుచుకోవడం ద్వారా గ్రామీ చరిత్రలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. 85 ఏండ్ల క్విన్సీ జోన్స్ తన సుదీర్ఘ కెరీర్‌లో 10 విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నారు. ఈసారి క్విన్సీ పేరిట రూపొందించిన లఘు చిత్రానికి ఉత్తమ సంగీత చిత్రం అవార్డు లభించింది. దాదాపు 17 ఏండ్ల తరువాత ఆయన మళ్లీ అవార్డు గెలుచుకున్నారు. క్విన్సీ గతంలో మైఖేల్ జాక్సన్‌తో కూడా కలిసి పనిచేశారు. క్విన్సీ గ్రామీ అందుకున్న ఫొటోను ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

1178
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles