అమెరికా వల్లే పాక్‌లో ఉగ్రవాదం

Sat,September 14, 2019 03:08 AM

Mujahideens funded by US to fight Soviets are now attacking Pak Imran Khan

- ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారు
- అమెరికాపై పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మండిపాటు
- ముజాహిదీన్ల పోరాటం వల్ల 70వేల మంది పౌరులను, 10 వేల కోట్ల డాలర్లను కోల్పోయామని వెల్లడి


ఇస్లామాబాద్, సెప్టెంబర్ 13: అమెరికా కారణంగానే తమ దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకున్నదని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ఆరోపించారు. అమెరికా అందజేసిన నిధులతోనే జిహాదీ సంస్థలకు తమ దేశం శిక్షణనిచ్చిందని తెలిపారు. 80 దశకంలో సోవియట్ యూనియన్‌పై పోరాడటానికి తమను అమెరికా పావుగా వాడుకున్నదని, ఇప్పుడు తమ దేశంపై ఉగ్రవాద ముద్ర వేస్తూ నిందిస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ముజాహిదీన్ల పోరాటం కారణంగా తమ దేశం 70 వేల మంది పౌరులను కోల్పోయిందని, 10 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని చెప్పారు. రష్యాటుడేకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 80వ దశకంలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్థాన్‌ను ఆక్రమించింది.
Imran-Khan
ఈ నేపథ్యంలో సోవియట్ యూనియన్‌పై పోరాడేందుకు ముజాహిదీన్లకు పాక్ జిహాదీ శిక్షణనిచ్చింది. అమెరికాకు చెందిన సీఐఏ ఈ శిక్షణ కోసం నిధుల్ని సమకూర్చింది అని ఇమ్రాన్ తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ విషయంలో అమెరికా తమను నిందించడాన్ని ఇమ్రాన్ తప్పుబట్టారు. ఆఫ్ఘన్‌కు అమెరికా సైన్యం వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయని.. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లను అప్పట్లో జీహాదీలని పేర్కొన్న అమెరికా.. ఇప్పుడు ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నదని ఆరోపించారు. అప్పట్లో పాకిస్థాన్ తటస్థంగా ఉండి ఉంటే ఈ అపవాదు మూటగట్టుకునేది కాదన్నారు. అప్పటి గ్రూపులే ఇప్పుడు తమకు వ్యతిరేకంగా మారాయని అన్నారు. అమెరికాకు మద్దతుగా పాక్ చేసిన సాయమే ఇప్పుడు తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి కారణమైందని, పైగా అమెరికా తమ దేశాన్నే నిందిస్తున్నదని ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముజాహిదీన్ల పోరాటం కారణంగా మేము 70వేల మంది పౌరుల ప్రాణాలను కోల్పోయాం. 10వేల కోట్ల డాలర్లు నష్టపోయాం. ఆఫ్ఘన్‌లో విజయం సాధించలేకపోయిన అమెరికా ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నది. మా విషయంలో అమెరికా వైఖరి సరైంది కాదు అని అన్నారు. పాక్‌లో పాదుకొని ఉన్న ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ఆ దేశానికి అమెరికా పలుమార్లు విజ్ఞప్తి చేయడం, తాలిబన్లతో రహస్య శాంతి చర్చలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అర్ధాంతరంగా రద్దు చేసుకున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కశ్మీరీలను నిరాశపర్చను!

వచ్చేవారం జరుగనున్న ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో తాను కశ్మీరీలను నిరాశపర్చనని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. కశ్మీరీలు ఎదుర్కొంటున్న దురవస్థ గురించి అంతర్జాతీయ వేదికలపై గళమెత్తుతానని, వారికి బాసటగా నిలుస్తానని అన్నారు. కశ్మీరీలకు మద్దతుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని ముజఫరాబాద్‌లో శుక్రవారం జరిగిన సంఘీభావ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చేవారం జరిగే ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో కశ్మీర్ సమస్యను నేను ప్రస్తావిస్తాను. ఈ విషయంలో ఎవర్నీ నిరాశపర్చను. ఇంతవరకూ ఎవరూ కృషిచేయని విధంగా కశ్మీరీల హక్కుల కోసం నేను పోరాడుతా అని అన్నారు. ఐరోపా యూనియన్, బ్రిటన్ పార్లమెంట్ సైతం కశ్మీర్ అంశాన్ని చర్చించాయని ఆయన తెలిపారు. కశ్మీరీలు చావుకు భయపడరని, మీరు(మోదీ సర్కారు) వారిపై విజయం సాధించలేరని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత్‌లో బీజేపీ నేతృత్వంలో ఫాసిస్టు, ఆధిపత్యధోరణి ప్రభుత్వం నడుస్తున్నదని దుయ్యబట్టారు. భారత్ తమపై ఇటుకను విసిరితే, తాము ప్రతిగా రాయిని విసురుతామని ఇమ్రాన్ అన్నారు.

1905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles