టైమ్స్ అత్యంత ప్రభావశీలుర జాబితాలో మోదీ


Fri,April 21, 2017 01:37 AM

Narendra-Modi
న్యూయార్క్: టైమ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్థానం దక్కించుకున్నారు. గురువారం విడుదలైన ఈ ఏటి మేటి జాబితాలో భారత్ నుంచి మోదీతోపాటు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మకు మాత్రమే స్థానం దక్కింది. వివిధ రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు పొందిన వారితో రూపొందించిన ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇంగ్లాండ్ ప్రధాని థెరెసామే సైతం ఉన్నారు. ఈ జాబితాలోని వ్యక్తులు తమ ఆవిష్కరణలు, ఆలోచనలు, లక్ష్యాల ద్వారా పలు సమస్యలకు పరిష్కారం చూపడంతో ముందున్నారని ఈ సందర్భంగా టైమ్స్ కొనియాడింది. భారత ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ రాజకీయాలు, సాంస్కృతిక ఆధిపత్యంపై మోదీ విజన్ మూడేండ్ల కిందట ఊహించినదానికంటే చాలా మెరుగ్గా ఉన్నదని టైమ్స్ అభిప్రాయపడింది. అయితే విస్తరిస్తున్న హిందుత్వ భావనలతో లౌకికవాదులు, ఉదారవాదులు, పేద ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. అయినా ఇప్పటికీ రాజకీయంగా మోదీ ప్రభ తగ్గలేదని స్పష్టం చేసింది. యూపీలో ఏకపక్ష విజయం దీనిని రుజువు చేస్తున్నదని కొనియాడింది. భారత్‌లో పెద్దనోట్లు రద్దు చేసిన సమయంలో పేటీఎం అనుసరించిన వ్యూహం అద్భుతంగా పనిచేసిందని టైమ్స్ అభిప్రాయపడింది. 2016 చివరి నాటికి 17.7 కోట్ల మంది ఖాతాదారులను ఆకర్షించడంలో శేఖర్ శర్మ వ్యూహం ఫలించిందని కొనియాడింది.

333

More News

VIRAL NEWS