శిథిలాలకుప్పగా మెక్సికో సిటీ

Thu,September 21, 2017 03:33 AM

Mexico earthquake Children killed at collapsed primary school

-7.1 తీవ్రతతో భారీ భూకంపం.. 225 మంది మృతి
-మృతుల్లో 21 మంది బడిపిల్లలు
-నగరవ్యాప్తంగా నేలమట్టమైన ఇండ్లు, భవనాలు
-శిథిలాల కింద కొనసాగుతున్న గాలింపు
-భారీ భూకంపానికి మెక్సికో సిటీ అతలాకుతలం

mexico
మెక్సికోసిటీ, సెప్టెంబర్ 20: మెక్సికోను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. తీవ్రస్థాయి జననష్టం, ఆస్తినష్టంతో పెనువిషాదాన్ని మిగిల్చింది. మంగళవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) రిక్టర్ స్కేలుపై 7.1 స్థాయిలో భూమి కంపించడంతో రాజధాని మెక్సికోసిటీతోపాటుగా పలు రాష్ర్టాల్లో భారీసంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయి. 21 మంది బడిపిల్లలతో సహా కనీసం 225 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యమెక్సికోలోని జనావాసాలు భూకంప ప్రభావానికి గురయ్యాయి. మెక్సికోసిటీలోని ఓ ప్రాథమిక పాఠశాల కుప్పకూలడంతో అందులోని అనేకమంది పిల్లలు సజీవసమాధి అయ్యారు. 1985లో ఇదే రోజున (సెప్టెంబర్ 19) దారుణమైన భూకంపం సంభవించింది. మళ్లీ ఇదే రోజే మరో తీవ్రస్థాయి భూకంపం రావడంతో మెక్సికో ప్రజలు తల్లడిల్లిపోయారు. మరీముఖ్యంగా పాఠశాల దుర్ఘటన అందరినీ కలచివేసింది. మృతులు సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని భూకంప బాధిత ప్రాంతాలను సందర్శించిన మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియటో ప్రకటించారు. రాజధాని నగరం దక్షిణ ప్రాంతంలోని ఎన్రిక్ రెబ్సామెన్ ప్రైమరీ స్కూల్ మూడు అంతస్తులు భూకంపం ధాటికి పేకమేడలా కూలిపోయాయి. ఆ భవనం శిథిలాల కింద 21 మంది విద్యార్థులు, ఐదుగురు టీచర్లు నలిగిపోయారు. మరికొందరు శిథిలాల కింద సజీవంగా ఉన్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 21 మంది పిల్లలు, ఐదుగురు పెద్దలు పాఠశాల దుర్ఘటనలో మరణించారు అని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న నౌకాదళాధికారి మేజర్ జోస్ లూయిస్ వెర్గారా ధ్రువీకరిచారు. మరో 30-40 మంది శిథిలాల కింది చిక్కుబడిపోయారు.

mexico1
11 మంది పిల్లలను ఇప్పటివరకు కాపాడగలిగాం అని ఆయన చెప్పారు. వందలమంది సైనికులు, పోలీసులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద చిక్కుబడినవారిని పసిగట్టేందుకు పోలీసు జాగిలాలను వినియోగిస్తున్నారు. పాఠశాలలు, ఇతర భవనాలు, ఇండ్లు కూలిపోయి పెద్దసంఖ్యలో జనం మరణించడం దురదృష్టకరమని అధ్యక్షుడు నియటా అన్నారు. మెక్సికోసిటీతో పాటుగా పుయెబ్లా, మోరెలోస్, మెక్సికో, గురేరా రాష్ర్టాల్లో జననష్టం అదికంగా సంభవించిందని ఆంతరంగిక శాఖమంత్రి మిగ్యూయెల్ మోరెలోస్ చెప్పారు. రెండు కోట్లమంది జనాభా కలిగిన మెక్సికోసిటీలో కూలిన భవనాల శిథిలాల కింద చిక్కుబడ్డవారికోసం గాలింపు జరుగుతున్నది. శిథిలాల కింద ఇరుక్కుపోయినవారు తమను కాపాడమంటూ వాట్సప్ సందేశాలు పంపుతున్నారని స్థానిక మీడియా తెలిపింది. ఇండ్ల గోడలు, పైకప్పులు ఊగుతుండడంతో ప్రజలు భయభ్రాంతులై వీధుల్లోకి పరుగులు తీశారు. 32 ఏండ్ల క్రితం భూకంపం చూశాను. మళ్లీ అదేరోజు భూమి కంపించడంతో నేను వణికిపోయాను. మళ్లీ అదే పీడకల కండ్లముందు మెదులుతున్నది.. నాకు ఏడుపు ఆగడం లేదు అంటూ జార్జినా సాంచెజ్ (52) అనే మహిళ మీడియా ముందు కన్నీరుమున్నీరయ్యారు. మెక్సికోసిటీలో అధికారులు మాక్‌డ్రిల్ నిర్వహించిన కొన్నిగంటలకే భూమి ఊగిపోవడంతో జనం అప్రమత్తమయ్యారు.

mexico2
జననష్టం 1985 నాటి స్థాయిలో లేకున్న అనేక భవనాలు మాత్రం రాళ్లకుప్పలుగా మారాయి. కుప్పకూలిన భవనాలను చూడలేకపోతున్నాం.. ధ్వంసమైన బస్తీలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి అని లీజావిసాజ్ హెరేరా (27) అన్నారు. సకాలంలో స్పందించినవారు భవనాలకు దూరంగా పారిపోయి నేలమీద ఒరిగారు. భూకంపం తాకిడికి భవనాలు నేలమట్టమైన తర్వాత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జనం తమవారికోసం వెదుకుతూ రోడ్లమీద అటూఇటూ పరుగులు తీశారు. దాంతో ట్రాఫిక్ జామ్ అయింది. అంబులెన్స్‌ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాంక్రీటు శకలాల కింద వెదుకులాట సందర్భంగా హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. శకలాల కింద నుంచి సహాయం కోసం అర్థించేవారి ఆర్తనాదాలు వినిపించాలంటే ప్రజలు నిశ్శబ్దంగా ఉండాలని అత్యవసర విభాగం కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెక్సికో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడు గంటలపాటు మూసేశారు. ఇండ్లు కూలిపోయిన బాధితులు పార్కుల్లో, శిబిరాల్లో గడుపుతున్నారు. దొంగతనాలు, దారిదోపిడీలు జోరుగా సాగుతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. తీవ్ర భూకంపానికి గురైన మెక్సికోకు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. మెక్సికోను బద్ధశతృవుగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మెక్సికోకు సంతాపం తెలిపారు. అన్నిరకాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటామని ట్విట్టర్‌లో తెలిపారు.

mexico3

కోకోస్ ఫలక కదలికల వల్లే భూకంపం


మంగళవారంనాటి భారీ భూకంపానికి మెక్సికో చిగురుటాకులా వణికిపోయింది. రాజధాని మెక్సికో సిటీ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, భూకంప కేంద్రం మాత్రం ప్యూబ్లా ప్రాంతానికి సమీపంలో ఉండడం గమనార్హం. 30 మైళ్ల లోతున భూకంప కేంద్రం ఉన్నదని, అది 20 సెకన్లపాటు మాత్రమే కంపించిందని, కానీ దాని ప్రకంపనలు రెండు నిమిషాల వరకు ఉన్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు. సాధారణంగా 90శాతం భూకంపాలు భూమిలో ఉండే టెక్టానిక్ ఫలకల కదలికల కారణంగా సంభవిస్తాయి. మెక్సికో తీరం వెంబడి కోకోస్ ఫలకం, ఉత్తర అమెరికా భూఫలకం కిందకు క్రమంగా చొచ్చుకెళ్తున్నది. ఏడాదికి 75 మిల్లీమీటర్ల చొప్పున కోకోస్ ఫలకం ముందుకు కదులుతున్నదని పరిశోధనల్లో వెల్లడైంది. తాజా భూకంపానికి ఆ రెండు భూఫలకాలు ఢీకొనడం కారణం కాదని, ఉత్తర అమెరికా ఫలకం కిందకు చొచ్చుకెళ్లిన కోకోస్ ఫలకం మరింత కిందకు వంగడమే కారణమని సమాచారం. రెండు వారాల క్రితం కూడా మెక్సికోలో 8.1తీవ్రతతో భూకంపం సంభవించింది. దానికి కూడా కోకోస్ భూఫలకం నొక్కుకుపోవడమే కారణమని తేల్చారు. టెక్టానిక్ ఫలకాలు అలా కదులుతున్నప్పుడు భూమి పొరల్లో ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉండే శిలలు రాపిడికి గురై వాటి మధ్య లంకె ఏర్పడుతుంది. ఈ సంఘటన వల్ల ఊహించని పీడనం ఏర్పడి ఆ ఒత్తిడికి ఒకటిగా కలిసి ఉండే శిలలు తమ మధ్య బలాలను అధిగమించడంతో అవి కాస్త పగిలిపోతాయి. దాంతో భూమి పొరల్లో అకస్మాత్తుగా మార్పు వచ్చి భూమి కంపిస్తుంది.

mexico4

ఆ రెండు భూకంపాలకు సంబంధముందా?


ఒకదాని వెంట ఒకటిగా వచ్చిన రెండు భూకంపాలు మెక్సికోను అతలాకుతలం చేశాయి. ఈనెల 7న రిక్టర్ స్కేల్‌పై 8.1 తీవ్రతతో భూమి కంపించగా, తాజా భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. అయితే ఈ రెండు భూకంపాలకు సంబంధముందా? అన్న ప్రశ్నకు అలా ఏమీ కనిపించడం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి రెండింటికీ సంబంధముంటే భూకంప కేంద్రాల మధ్య దూరం వంద కిలోమీటర్ల లోపు ఉండాలి. కానీ, అలా లేదు. ఉత్తర అమెరికా భూఫలకం కిందకు చొచ్చుకెళ్తున్న కోకోస్ భూఫలకం కిందివైపు వంగడం వల్ల ఈనెల 7న భూకంపం సంభవించింది. దానికి కొనసాగింపుగా తాజా భూకంపం జరిగినట్లయితే, రెండువారాల సమయం తీసుకునేది కాదని భూకంప పరిశోధకులు చెప్తున్నారు. కోకోస్ ఫలకం మార్పుల కారణంగానే సంభవించినా, రెండు సెప్టెంబర్ భూకంపాలకు ఎలాంటి సంబంధమూ లేదని భావిస్తున్నారు.

819

More News

VIRAL NEWS

Featured Articles