వచ్చేముందు జైట్లీని కలిశా!

Thu,September 13, 2018 01:34 AM

Met Finance Minister Before Leaving Country Says Vijay Mallya

-రుణాల సెటిల్‌మెంట్ గురించి చెప్పా
-ఆర్థిక నేరస్థుడు విజయ్‌మాల్యా వెల్లడి
-అతనికి ఎప్పుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు: అరుణ్‌జైట్లీ
-మాల్యా అప్పగింతపై డిసెంబర్10న తీర్పు

లండన్, సెప్టెంబర్ 12: భారత్ విడిచి వెళ్లేముందు తాను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని కలిశానని విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుడు విజయ్‌మాల్యా బుధవారం లండన్‌లో వెల్లడించాడు. తనను భారత్‌కు అప్పగించేందుకు సంబంధించిన కేసుపై విచారణ జరుపుతున్న వెస్ట్‌మినిస్టర్ కోర్టుకు హాజరైన విజయ్‌మాల్యా మీడియా అడిగిన ప్రశ్నలపై స్పందించాడు. జెనీవాలో ఓ సమావేశానికి హాజరయ్యేందుకు నేను భారత్ నుంచి వచ్చాను. అంతకుముందే నేను ఆర్థికశాఖ మంత్రి జైట్లీని కలిశాను. బ్యాంకు రుణాల సెటిల్‌మెంట్‌కు సంబంధించి నా ఉద్దేశాన్ని ఆయనకు వివరించాను అని తెలిపాడు. తాను బ్యాంకులకు రుణపడ్డ మొత్తాన్ని చెల్లించేందుకు కృషి చేస్తుంటే బ్యాంకులు తనకు ఎందుకు సహకరించడం లేదో మీడియా ప్రశ్నించాలని విజయ్‌మాల్యా మీడియాకు విజ్ఞప్తి చేశాడు. నన్ను రాజకీయంగా ఫుట్‌బాల్‌ను చేశారు. ఈ రాజకీయ క్రీడలో నేను చేసేదేమీ లేదు. నా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉన్నది.

దాదాపు 15 వేల కోట్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలతో సమగ్రమైన సెటిల్‌మెంట్ ఆఫర్‌ను కర్ణాటక హైకోర్టు ముందుంచాను. ఈ ఆఫర్ ద్వారా నా మొత్తం అప్పులను తీర్చవచ్చు. నన్ను బలిపశువును చేశారు. రెండు రాజకీయ పార్టీలకు నేనంటే ఇష్టంలేదు అని మాల్యా పేర్కొన్నాడు. తనను భారత్‌కు తరలించి ఉంచదలచిన ముంబై ఆర్థర్ రోడ్డు జైలులోని బ్యారెక్ 12 వీడియోపై స్పందిస్తూ చాలా బాగుంది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై తీర్పును డిసెంబర్ 10న వెల్లడించనున్నట్టు వెస్ట్‌మినిస్టర్ కోర్టు వెల్లడించింది. కాగా భారత్ విడిచి వెళ్లేముందు తనను కలిశానని ఆర్థిక నేరస్థుడు విజయ్‌మాల్యా చేసిన వ్యాఖ్యలను ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం తన ఫేస్‌బుక్ బ్లాగ్ ద్వారా ఖండించారు. మాల్యా ప్రకటన వాస్తవ విరుద్ధమైనది. అది నిజాన్ని ప్రతిబింబించడం లేదు. 2014 నుంచి అతనికి నేనెప్పుడూ కలిసేందుకు సమయం ఇవ్వలేదు.

కాబట్టి అతడు నన్ను కలిశాడన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. కానీ రాజ్యసభ సభ్యునిగా ఉండి అప్పుడప్పుడూ సభకు హాజరయ్యే మాల్యా.. నేను పార్లమెంట్ నుంచి నా కార్యాలయానికి వెళ్తుండగా పలుకరించాడు. నా వెంట వేగంగా నడిచి వస్తూ నేను రుణాల చెల్లింపునకు ఓ ఆఫర్‌ను ప్రకటించాను అని చెప్పాడు. మోసపూరిత సెటిల్‌మెంట్ గురించి అంతకుముందే తెలుసుకున్న నేను సంభాషణను కొనసాగించేందుకు అనుమతించలేదు. కనీసం అతడి చేతిలో ఉన్న కాగితాలను తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. బ్యాంకులకు రుణపడ్డ వ్యక్తిగా అతనికి నేను ఎప్పుడూ సమయం ఇచ్చింది లేదు అని జైట్లీ స్పష్టంచేశారు.

ఎందుకు అనుమతించారో చెప్పాలి: కాంగ్రెస్

విజయ్‌మాల్యా భారత్‌ను విడిచిపెట్టి వెళ్లేందుకు ఎందుకు అనుమతించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జైట్లీకి, మాల్యాకు మధ్య సమావేశం సందర్భంగా ఏం జరిగిందో చెప్పాలని కోరింది.

279
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS