విక్రమ్‌ జాడ దొరికింది

Wed,December 4, 2019 03:47 AM

- చంద్రుడిపై ల్యాండర్‌ కూలిన ప్రదేశాన్ని గుర్తించిన నాసా
- నాసాకు ఆధారాలు అందజేసిన భారతీయ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌
- లక్షిత ప్రదేశానికి 2,500 అడుగుల దూరంలో ల్యాండర్‌ కూలినట్టు నిర్ధారణ

వాషింగ్టన్‌, డిసెంబర్‌ 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై దిగిన ’విక్రమ్‌'ల్యాండర్‌ ఆచూకీ ఎట్టకేలకు దొరికింది. చంద్రుడి ఉపరితలంపై పడి జాడ దొరుకకుండా పోయిన ‘విక్రమ్‌'ను అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ కనుగొంది. భారత్‌కు చెందిన షణ్ముగ సుబ్రమణియన్‌ అనే ఇంజినీర్‌ ఇచ్చిన ఆధారాల సాయంతోనే చంద్రుడి ఉపరితలంపై పడిన విక్రమ్‌ శకలాలను గుర్తించగలిగామని నాసా మంగళవారం తెలిపింది. చంద్రయాన్‌-2 ప్రయోగంలో భాగంగా ఇస్రో గత సెప్టెంబర్‌ 7న చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సురక్షితంగా దించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అయితే చివరి క్షణంలో విక్రమ్‌తో కమ్యూనికేషన్‌ దెబ్బతినడంతో అది ఏమైందో తెలియకుండా పోయింది. చంద్రుడి చుట్టూ పరిభ్రమించే నాసాకు చెందిన లూనార్‌ రీకనైసెన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్వో) తీసిన చిత్రాల్లో.. విక్రమ్‌ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలు కనిపించాయి. విక్రమ్‌ శకలాలు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పలు ప్రదేశాల్లో పడినట్లు నాసా తెలిపింది.

తొలి శకలాన్ని గుర్తించిన భారత ఇంజినీర్‌

నిజానికి విక్రమ్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కోసం ముందుగా నిర్ధారించిన ప్రాంతాన్ని ఎల్‌ఆర్వో సెప్టెంబర్‌ 17నే ఫొటోలు తీసింది. అయితే ఆ సమయంలో చంద్రుడిపై అంతా చీకటిగా ఉండడంతో ల్యాండర్‌ను కచ్చితంగా గుర్తించలేకపోయారు. ఆ చిత్రాలను సెప్టెంబర్‌ 26న విడుదల చేసిన నాసా.. విక్రమ్‌ ల్యాండర్‌ పడడానికి ముందు జూలై 16న ఎల్‌ఆర్వో తీసిన చిత్రాలను, పడిన తరువాత తీసిన చిత్రాలను పోల్చి చూసి, ల్యాండర్‌ గుర్తులు ఎక్కడైనా ఉన్నాయేమో కనుగొనాలని ప్రజలను ఆహ్వానించింది. ఈ ఆహ్వానాన్ని సవాలుగా స్వీకరించిన షణ్ముగ సుబ్రమణియన్‌ (33) కొన్ని రోజులపాటు శ్రమించి ఆ రెండు చిత్రాల్లో ఉన్న తేడాను గమనించారు. విక్రమ్‌ కూలిన ప్రదేశానికి వాయవ్య దిశలో 750 మీటర్ల దూరంలో తొలి శకలాన్ని షణ్ముగ గుర్తించారని నాసా పేర్కొంది. దీని ఆధారంగా ఎల్‌ఆర్వో ప్రాజెక్టు బృందం మరింత పరిశోధన చేసి ఇతర శకలాలను కూడా గుర్తించారని తెలిపింది. విక్రమ్‌ ల్యాండర్‌ దిగడానికి నిర్దేశించిన ప్రదేశానికి ఆగ్నేయంగా 2,500 అడుగుల దూరంలో అది కూలిపోయినట్టు, దాని శకలాలు చాలా దూరం వరకు పడినట్టు తమ నిపుణులు గుర్తించారని నాసా పేర్కొంది.

నవంబర్‌లో ఎల్‌ఆర్వో తీసిన చిత్రాల్లో.. విక్రమ్‌ కూలడం వల్ల ఏర్పడిన బిలం, దాని చుట్టూ శిథిలాల క్షేత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. సుబ్రమణియన్‌ తాను కనుగొన్న ఫలితాలను అక్టోబర్‌ 3న నాసా, ఎల్‌ఆర్వో, ఇస్రో ట్విట్టర్‌ ఖాతాలకు ట్యాగ్‌ చేస్తూ, ‘విక్రమ్‌ ల్యాండర్‌ ఇదేనా? (ల్యాండింగ్‌ ప్రదేశానికి కిలోమీటర్‌ దూరంలో ఉన్నది), చంద్రుని ఉపరితంలపై ఉన్న ఇసుకలో ల్యాండర్‌ కప్పుకొని పోయి ఉండవచ్చా?’ అని ప్రశ్నిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ తరువాత తిరిగి నవంబర్‌ 17న నాసా చిత్రాల్లోని ఒక ప్రదేశాన్ని గుర్తించి ‘విక్రమ్‌ ల్యాండర్‌ కూలిన ప్రదేశం ఇదే కావచ్చు (లాటిట్యూడ్‌ 70.8552, లాంగిట్యూడ్‌ 21.71233). దాని నుంచి విరిగిపడిన శకలాలు ఇక్కడ పడి ఉండొచ్చంటూ ట్వీట్‌ చేశారు. తన ట్వీట్‌కు నాసా జూలై 16, తిరిగి సెప్టెంబర్‌ 17న తీసిన చిత్రాలను జత చేశారు. సుబ్రమణియన్‌ అధ్యయన ఫలితాలను సవాలుగా తీసుకున్న నాసా అక్టోబర్‌ 14, 15, నవంబర్‌ 11న ఎల్‌ఆర్వో ద్వారా మరికొన్ని చిత్రాలను సేకరించింది. ఈసారి వెలుతురు ఉండడంతో షణ్ముగ గుర్తించిన ప్రదేశంతోపాటు మరో 24 చోట్ల మార్పులు ఉన్నట్లు గుర్తించింది.
vikram-lander1

నాసా వైఫల్యాన్ని సవాలుగా స్వీకరించా షణ్ముగ సుబ్రమణియన్‌

విక్రమ్‌ జాడను కనుగొన్న చెన్నైకి చెందిన షణ్ముగ సుబ్రమణియన్‌ ఒక సాధారణ ఐటీ నిపుణుడు. టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న సుబ్రమణియన్‌కు అంతరిక్ష పరిశధనలపై కూడా ఆసక్తి ఉంది. అయితే ఆయనకు ఇటు ఇస్రోతోగానీ, అటు నాసాతోగానీ సంబంధాలు లేవు. విక్రమ్‌ జాడను కనుక్కోవడంలో నాసా కూడా వైఫల్యం చెందడాన్ని ఆయన సవాలుగా స్వీకరించారు. ఆ ఆసక్తితోనే అధ్యయనం చేయడం ప్రారంభించారు. తన పరిశోధన గురించి విక్రమ్‌ ఇలా వివరించారు.. ‘విక్రమ్‌ ల్యాండర్‌ పడక ముందు, పడిన తరువాత నాసాకు చెందిన ఎల్‌ఆర్వో తీసిన చిత్రాలను రెండు ల్యాప్‌టాప్‌లలో పక్క పక్కనే పెట్టి క్షుణ్ణంగా పరిశీలించాను. నాసా చిత్రాలను పిక్సెల్‌ టు పిక్సెల్‌ అధ్యయనం చేశాను. ఇస్రోతో ల్యాండర్‌ సంబంధాలు కోల్పోయినప్పుడు ఉన్న వేగం, ఎత్తు ఆధారంగా కొన్ని లెక్కలు వేసి, అది దిగాల్సిన ప్రాంతం, ఆ పరిసరాలను పరిశీలించాను. చెన్నైలోని నా అపార్ట్‌మెంట్‌లో రాత్రంతా కనీసం ఏడు గంటలు శ్రమించాను. నా పరిశోధన ఫలితాలను నాసా, ఇస్రోకు ట్వీట్‌ చేశాను. ఒకరిద్దరు నాసా శాస్త్రవేత్తలకు ఈమెయిల్‌ కూడా పంపాను. నా పరిశోధన పట్ల వారు సానుకూలంగా స్పందించారు. నా అధ్యయనాన్ని విక్రమ్‌ దిగాల్సిన లక్షిత ప్రదేశానికి 2 కిలోమీటర్ల పరిధికి పరిమితం చేశాను. చివరికి లక్షిత ప్రదేశానికి 750 మీటర్ల నుంచి కిలోమీటరు దూరం పరిధిలో కొన్ని మార్పులను గమనించాను. అదే విక్రమ్‌ జాడ అని భావించాను. ఈ ఆధారాలను నాసాకు పంపాను’ అని వివరించారు.
vikram-lander2

ఆయన పనితీరు అద్భుతం: నాసా

‘సుబ్రమణియన్‌ అధ్యయనం చేసిన విధానం అద్భుతం. అది మాకు ఎంతో సహాయపడింది’ అని నాసాకు చెందిన నోవా పెట్రో పేర్కొన్నారు. ‘ఆయన ఎల్‌ఆర్వోలో గానీ, అటు చంద్రయాన్‌-2 బృందంలో గానీ సభ్యుడు కాదు. స్వతంత్రంగా అధ్యయనం చేశారు. మేమందించిన డేటాను ఉపయోగించి విక్రమ్‌ పడిన ప్రదేశాన్ని గుర్తించాడు. ఆ జాడను ముందుగా మేము కనుగొనలేకపోయాం. విక్రమ్‌ను కనుగొన్న ఘనత సుబ్రమణియన్‌దే’ అని నోవా పెట్రో ప్రశంసించారు. మదురై నివాసి అయిన సుబ్రమణియన్‌ తిరునల్వేలిలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి పట్టభద్రులయ్యారు. తన పరిశోధన ఇతర ఔత్సాహికులకు ప్రేరణనిస్తుందని ఆయన పేర్కొన్నారు.

502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles