జాదవ్ ఉరిపై స్టే


Fri,May 19, 2017 02:15 AM

- తుదితీర్పు వరకూ శిక్ష అమలుచేయొద్దన్న అంతర్జాతీయ కోర్టు
- జాదవ్‌ను కలుసుకునేందుకు భారత్‌ను అనుమతించాలి
- ఏకగ్రీవంగా ఆదేశాలు జారీ చేసిన ఐసీజే ధర్మాసనం
- హర్షం వ్యక్తం చేసిన మోదీ, సుష్మ; సాల్వేకు కృతజ్ఞతలు

హేగ్/న్యూఢిల్లీ, మే 18: చిరకాలపు ప్రత్యర్థి, దాయాది దేశం పాకిస్థాన్‌పై భారత్‌కు అంతర్జాతీయస్థాయిలో ఘనవిజయం లభించింది. భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు పాకిస్థాన్ విధించిన మరణశిక్షను నిలిపివేస్తూ నెదర్లాండ్స్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) గురువారం ఏకగ్రీవ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో పూర్తి విచారణ జరిపి తుది తీర్పును వెల్లడించేంతవరకూ కుల్‌భూషణ్‌జాదవ్‌పై మరణశిక్ష అమలు చేయటానికి వీల్లేదని పాకిస్థాన్‌కు తేల్చిచెప్పింది. తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యల గురించి తమకు సమాచారాన్ని అందజేయాలని తెలిపింది. జాదవ్ కేసులో తీర్పు వెలువడేలోపే ఆయనను పాక్ ఉరితీసే ప్రమాదం ఉందన్న భారత్ ఆందోళనతో 11 మంది సభ్యుల ఐసీజే ధర్మాసనం ఏకీభవించింది. ఈ ఏడాది ఆగస్టులోపు జాదవ్‌కు మరణశిక్ష విధించబోమన్న పాకిస్థాన్ వాదనను గుర్తుచేస్తూ, ఆ తర్వాత ఎప్పుడైనా ఆయనపై మరణశిక్షను అమలుచేసే అవకాశం ఉందని ఐసీజే పేర్కొంది. తీర్పు వెలువడేలోపు మరణశిక్షను అమలుచేయబోమని పాకిస్థాన్ తమకు హామీ ఇవ్వలేదని ధర్మాసనం వెల్లడించింది.
jadav

కలుసుకోవటానికి అనుమతించాలి


వియన్నా ఒప్పందం ప్రకారం.. తమ దేశస్థుడైన జాదవ్‌ను కలుసుకోవటానికి పాకిస్థాన్ తమను అనుమతించాలని, కానీ 16 సార్లు విజ్ఞప్తి చేసినా కూడా తిరస్కరించి ఆ దేశం వియన్నా ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడిందన్న భారత్ వాదనను కూడా ఐసీజే సమర్థించింది. జాదవ్‌ను కలిసి మాట్లాడే అవకాశం భారత్‌కు కల్పించాలని పాక్‌ను ఆదేశించింది. జాదవ్‌కు శిక్ష విధించే అంశం పూర్తిగా తమకు సంబంధించినదని, ఇది ఐసీజే పరిధిలోకి రాదన్న పాక్ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. వియన్నా ఒప్పందంపై సంతకం చేసిన దేశాలకు న్యాయపరమైన ఆదేశాలు చేసే అధికారం తమకు ఉందని స్పష్టం చేస్తూ.. సదరు ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ 1977లోనే సంతకాలు చేశాయని గుర్తుచేసింది. జాదవ్ అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై వివా దం నెలకొన్న సంగతిని ప్రస్తావించింది. ఐసీజే ధర్మాసనం ఏకగ్రీవంగా వెలువరించిన ఆదేశాలను ప్రధాన న్యాయమూర్తి రోనీ అబ్రహం చదివి వినిపించారు.

సాల్వేకు మోదీ, సుష్మ కృతజ్ఞతలు


న్యూఢిల్లీ: ఐసీజే ఆదేశాలపై ప్రధాని మోదీ హర్షం వెలిబుచ్చారు. విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారు. ఐసీజే ఆదేశాలతో ఎంతో ఊరట లభించిందని సుష్మ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఐసీజేలో భారత్ తరఫున సమర్థవంతమైన వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్‌సాల్వేకు మోదీ, సుష్మ కృతజ్ఞతలు తెలిపారు. ఐసీజేలో తొలిరౌండ్‌లో లభించిన విజయం భారత్‌కు గొప్ప ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందని సాల్వే వ్యాఖ్యానించారు. ఐసీజే ధర్మాసనం ముందు వాదనలు వినిపిస్తున్నందుకు సమయంలో న్యాయమూర్తులు తన పట్ల సానుకూలంగా స్పందించారని, అందుకు వారికి కృతజ్ఞతలని చెప్పారు. ఈ కేసులో సాల్వే కేవలం ఒక్క రూపాయి ఫీజు మాత్రమే తీసుకున్నారన్న సుష్మస్వరాజ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేసు మీద నమ్మకం ఉన్నప్పుడు ఉచితంగానైనా చేయటానికి ముందుకొస్తామని, అలాంటిదే ఈ కేసు కూడానని సాల్వే చెప్పారు. ఐసీజే ఆదేశాలు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని, జాదవ్‌ను కాపాడటానికి మోదీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుందని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. ఐసీజే ఆదేశాల నేపథ్యంలో జాదవ్ స్నేహితులు ముంబైలో పటాకులు కాల్చి సంతోషాన్ని పంచుకున్నారు.

Presiding-judge

ఆమోదించం: పాక్


ఇస్లామాబాద్: జాతీయ భద్రతకు సంబంధించిన అంశంలో ఐసీజే ఉత్తర్వులను తాము ఆమోదించబోమని పాకిస్థాన్ ప్రకటించింది. జాదవ్ కేసును ఐసీజేకు తీసుకువెళ్లటం ద్వారా భారత్ తన వాస్తవ రూపాన్ని దాచుకోవటానికి ప్రయత్నిస్తున్నదని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి నఫీజ్ ఆరోపించారు. అయితే, ఐసీజే ఆదేశాలను పాకిస్థాన్ ఆమోదించకపోతే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందుకు జాదవ్ కేసును భారత్ తీసుకెళ్లవచ్చని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఎనిమిది రోజులుగా సరిహద్దు వెంబడి నిరవధికంగా తూటాలు కురిపించిన పాక్ సైన్యం తీర్పు వెలువడి నప్పటి నుంచి కాల్పులను నిలిపివేయడం గమనార్హం.

Childhood-friends

ఇదీ నేపథ్యం


గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ సైనికకోర్టు గతనెల 10న మరణశిక్ష విధించింది. దీనిని నిలిపివేయాలని కోరుతూ భారత్ మే 8న ఐసీజేకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐసీజే తాత్కాలిక నిలుపుదల ఉత్తర్వులను మే 9న జారీ చేసింది. మే 15న ఐసీజే బహిరంగ విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత్ తరఫున హరీశ్‌సాల్వే వాదనలు వినిపించారు. దౌత్యపరమైన సంబంధాలపై వియన్నా ఒప్పందం నిర్దేశించిన నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించింది కాబట్టే.. ఈ కేసులో తీర్పు చెప్పే అధికారం ఐసీజేకు ఉందని సాల్వే వాదించారు. మరోవైపు, దౌత్యపరమైన సంబంధాల్లో వియన్నా ఒప్పందం కంటే ద్వైపాక్షిక ఒప్పందమే ముఖ్యమైనదని, కాబట్టి, ఈ కేసు ఐసీజే పరిధిలోకి రాదని పాకిస్థాన్ వాదించింది. భారత నౌకాదళంలో పని చేసి పదవీ విరమణ చేసిన అనంతరం జాదవ్ వ్యాపార కార్యకలాపాలరీత్యా ఇరాన్‌లో ఉన్నారని, అక్కడి నుంచి ఆయనను పాకిస్థాన్ అపహరించుకువెళ్లిందని ఐసీజే ముందు భారత్ వాదనలు వినిపించింది. దీనికి వ్యతిరేకంగా పాకిస్థాన్.. ఇరాన్ ద్వారా జాదవ్ తమదేశంలోని బలూచిస్థాన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించి గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయనను అరెస్టు చేసి సైనికకోర్టు ముందు ప్రవేశపెట్టామని తెలిపింది.

harish-salve

ఐసీజే-మూడు మరణశిక్ష కేసులు


జాదవ్ కేసులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. గతంలో ఐసీజే ముందుకు వచ్చిన మూడు మరణశిక్ష కేసులను ప్రస్తావించారు. అవి మెక్సికో-అమెరికా, జర్మనీ-అమెరికా, పరాగ్వే-అమెరికాలకు సంబంధించినవి. వీటి వివరాలు..
మెక్సికో-అమెరికా: అమెరికాలో 54 మంది మెక్సికో జాతీయులకు మరణశిక్ష విధించిన కేసులో ఆ శిక్షలను అమలుచేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ ఐసీజేకు మెక్సికో 2003లో విజ్ఞప్తి చేసింది. తీర్పు వచ్చేవరకైనా మరణశిక్షల అమలును నిలిపివేయాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన ఐసీజే.. వియన్నా ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందా? లేదా? అన్నంతవరకే తమ విచారణ పరిధి పరిమితమవుతుందని, అప్పీల్ క్రిమినల్ కోర్టుగా తాము వ్యవహరించలేమని చెప్పింది.
జర్మనీ-అమెరికా: జర్మనీకి చెందిన వాల్టర్ లాగ్రాండ్‌ను ఆయన సోదరుడు కార్ల్‌ను ఒక దోపిడీ, హత్య కేసులో అమెరికా 1982లో అరెస్టు చేసింది. వారికి అమెరికా న్యాయస్థానం మరణశిక్షను విధించింది. 1999లో శిక్ష అమలయ్యే సమయంలో.. జర్మనీ ఐసీజేను ఆశ్రయించింది. అయితే, కేసు విచారణ ప్రారంభం కాకముందే కార్ల్‌పై మరణశిక్ష అమలయ్యింది. మరో నిందితుడు వాల్టర్ మరణశిక్షను విచారణ పూర్తయ్యేంతవరకూ నిలిపివేయాలని జర్మనీ ఐసీజేను కోరింది. ఈ నేపథ్యంలో, ఐసీజే విచారణానంతరం వాల్టర్‌కు అమెరికా మరణశిక్షను అమలుపరిచింది.
పరాగ్వే-అమెరికా: పరాగ్వే జాతీయుడైన ఏంజెల్ ఫ్రాన్సిస్కో బ్రియర్డ్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే, తమ రాయబార కార్యాలయం నుంచి సాయం తీసుకోవటానికి ఏంజెల్‌ను అమెరికా అనుమతించటం లేదంటూ 1998లో పరాగ్వే ఐసీజేలో కేసు దాఖలు చేసింది. తుదితీర్పు వెలువడేంతవరకూ ఏంజెల్‌కు మరణశిక్ష విధించవద్దంటూ అమెరికాను ఐసీజే ఆదేశించింది. ఐసీజే తీర్పు వచ్చిన ఐదు రోజుల తర్వాత ఏంజెల్‌కు విధించిన మరణశిక్షను అమెరికా అమలు చేసింది.

718

More News

VIRAL NEWS