మత్తు గుట్టు వీడింది!

Fri,January 4, 2019 02:29 AM

-మత్తు ప్రభావానికి పీఎల్‌డీ2 అనే ఎంజైమే కారణమని గుర్తింపు
-స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి

వాషింగ్టన్: మద్యం మత్తు గుట్టు వీడింది. మద్యం సేవించిన వారికి మైకం ఎలా ఎక్కుతుందో శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆల్కహాల్ మన నాడీకణాలకు చేరినపుడు, అది మత్తును కలిగించేందుకు నాడీకణంలోని పొరల ఉపరితలం మీదకు ప్రత్యేక అణువులను పంపుతుందని అమెరికాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. పరిశోధన వివరాలను మాలిక్యులార్ బయాలజీ జర్నల్‌లో ప్రచురించారు. దాని ప్రకారం.. ఆల్కహాల్ మార్గాన్ని పరిశోధించేందుకు శాస్త్రవేత్తలు ఈగలపై అధ్యయనం చేశారు. వాటిని మద్యం తాగేలా చేశారు. మిగతావాటితో పోలిస్తే వాటి జన్యురాశి(జీనోమ్) చిన్నది కావడంతో జన్యు క్రియను అధ్యయనం చేసేందుకు ఈగలను ఎంపిక చేసుకున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఆల్కహాల్ కూడా దాదాపు అనెస్థిటిక్‌గా పనిచేస్తుందని, ఇది మొదట హైపర్‌బజ్ భావనను కలిగిస్తుందని, అనంతరం మత్తును కలిగిస్తుందని చెప్పారు. అయితే ఈ మత్తు ఎలా కలుగుతుందనే దానిపై ఇంతకు ముందు గుర్తించని ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. నాడీకణాల పొరల్లో ఉండే ఓ ఎంజైమ్(పీఎల్‌డీ2) ఆల్కహాల్ అణువులను, నాడీకణ పొరల్లోని లిపిడ్‌ను అనుసంధానిస్తుందని తెలిపారు. ఈ ఎంజైమ్ ఓ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఫాస్ఫాటిడైలిథనాల్ అనే మెటాబొలైట్ ఉత్పత్తి అయ్యి, నాడీకణాలను ఉత్తేజపరుస్తుందని వివరించారు. దీని కారణంగానే ఈగలు ఇంకా వేగంగా ఎగురుతాయని పేర్కొన్నారు.

ఇదే విధంగా మనుషులు మద్యం సేవించినపుడు కూడా మొదట హైపర్ యాక్టివ్‌గా వ్యవహరిస్తారని వివరించారు. అలాగే ఈ ఎంజైమ్‌కు సంబంధించిన జన్యు కణాలను తొలగించినపుడు ఈగలు అంత ఉత్తేజితంగా లేనట్లు గుర్తించారు. మత్తు, అనంతరం తలెత్తే హ్యాంగోవర్‌కు విరుగుడును కనుగొనేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. అలాగే బాధ నుంచి ఉపశమనం పొందేందుకు మద్యాన్ని ఎందుకు ఆశ్రయిస్తారో తెలుసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని వివరించారు.

874
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles