ఆకులు తింటూ.. ఆకలి తీర్చుకుంటూ

Mon,November 5, 2018 02:16 AM

Isolated and unseen Yemenis eat leaves to stave off famine

దుర్భర స్థితిలో బతుకీడుస్తున్న యెమెన్ ప్రజలు.. ఆహారం దొరకక మరణం అంచున 50లక్షల మంది
హొడైదా (యెమెన్), నవంబర్ 4: యెమెన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం కోట్లాదిమంది ప్రజల జీవితాల్ని సంక్షోభంలోకి నెట్టింది. తినడానికి తిండిలేని దుర్భర స్థితిలో.. ఆకులు అలములు తింటూ పొట్టపోసుకుంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మిత్రపక్షంగా ఉన్న దక్షిణ యెమెన్ వేర్పాటువాదులకు, సౌదీ అరేబియా మిత్రపక్షమైన ప్రభుత్వ అనుకూలవర్గాలకు మధ్య నిరంతర ఘర్షణలతో దేశం రావణకాష్టంలా మారింది. అసలే పేదదేశం.. ఆపై అంతర్యుద్ధం.. యెమెనీల జీవితాలను నరకప్రాయం చేసింది. దీని కారణంగా 2015 నుంచి ఇప్పటివరకు 10వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 50వేలమందికి పైగా యుద్ధబాధితులుగా మిగిలిపోయారు. 30లక్షలమంది తమ స్వస్థలాలను వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలోదిక్కుకు వెళ్లిపోయారు. ఒకప్పుడు అంతోఇంతో ధనికులుగా చెప్పబడిన వాళ్లు కూడా ఇప్పుడు వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు అని యెమెన్ నుంచి నార్వేకి వచ్చిన శరణార్థి బెకీ బకర్ అబ్దుల్లా తెలిపారు. గుప్పెడు మెతుకుల్లేని స్థితిలో ప్రాణాలు నిలుపుకోవడానికి స్థానికులు చేయని ప్రయత్నం లేదు. ఇది కనీవినీ ఎరుగని ఆహారసంక్షోభం. పెద్దలకే తిండిదొరుకని స్థితిలో.. ద్రాక్ష చెట్ల ఆకులు, ఇతర చెట్ల బెరుడు వారికి ఆహారమవుతున్నది.

అక్కడి తల్లులు చెట్ల ఆకుల్ని ఉడకబెట్టి తినిపిస్తూ తమ పిల్లల ప్రాణాల్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని అబ్దుల్లా చెప్పారు. యెమెన్‌లో నాలుగులక్షలమంది చిన్నారులు తీవ్రమైన ఆహారలోపంతో బాధపడుతున్నారని, వీరిలో 50వేలమంది ఏ క్షణాన్నైనా చనిపోయే స్థితిలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) గత ఏడాది నవంబర్‌లో ప్రకటించింది. ఆ తర్వాత ఈ ఏడాదికాలంలో ఈ సంఖ్య మరింత పెరిగింది. దేశంలోని కరువు పరిస్థితులు, సంక్షోభం కారణంగా 50లక్షలమంది (దేశజనాభాలో ఐదోవంతు) ఆకలిచావుల బారినపడే ప్రమాదముందని, వీరిలో 18లక్షలమంది చిన్నారులున్నారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ హెచ్చరిస్తున్నది. యెమెన్ చిన్నారుల్లో 50 శాతమో, 60శాతమో కాదు.. ప్రతీ పిల్లాడికీ దేశం ఓ ప్రత్యక్ష నరకంలా తయారైంది. ఆహారలేమితో బాధపడుతూ ఏటా 30వేలమంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక జ్వరాలు, చిన్న చిన్న వ్యాధుల కారణంగా ప్రతి 10నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు అని యునిసెఫ్ ప్రాంతీయ డైరెక్టర్ గీర్ట్ కాపెలియర్ ఆదివారంనాడు వెల్లడించారు. యుద్ధంలోని భాగస్వామ్య పక్షాలు తక్షణమే కాల్పులవిరమణను ప్రకటించాలని కోరిన ఆయన.. ఆ దిశగా ఐరాస ప్రతినిధి బృందం ఈ నెలాఖరులో యెమెన్ పరిస్థితులపై శాంతిచర్చలు చేపడుతుందని తెలిపారు.

యెమెన్‌లో హింస.. 150మందికి పైగా మృతి

యెమెన్‌లోని రేవుపట్టణం హొడైదాలో వారంరోజులుగా ప్రభుత్వపక్షాలు, తిరుగుబాటు దళాలకు మధ్య జరిగిన హింసలో 150మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. గురువారం తిరుగుబాటు దళాలతో కలిపి సౌదీ యుద్ధవిమానాలు దాడులు జరుపగా, ప్రతిగా హోడైదాలో తిరుగుబాటుదారులపై సైన్యం గగనతల దాడులు చేపట్టింది. తమ సైన్యం జరిపిన దాడుల్లో 53మంది హుతీ రెబల్స్ హతమయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే బేయ్డా, సాదా రాష్ర్టాల్లో చోటుచేసుకున్న హింసలోనూ పలువురు మరణించారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపింది.

505
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS