ఇరాన్‌లో భూప్రళయం


Tue,November 14, 2017 03:09 AM

415 మందికిపైగా మృతి
ఇరాన్-ఇరాక్ సరిహద్దులో 7.3 తీవ్రతతో భూకంపం
7200 మందికిపైగా గాయాలు
మృతుల సంఖ్య ఇరాన్‌లోనే అత్యధికం
14 రాష్ర్టాల్లో నేలమట్టమైన నివాసాలు

iran
14 రాష్ర్టాల్లో నేలమట్టమైన భవనాలుభూవిలయానికి ఇరాన్ అతలాకుతలమైంది. ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లో 7.3 తీవ్రతతో ఆదివారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో 415మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 7200 మంది వరకు గాయపడ్డారు. భూకంప ప్రభావం ఎక్కువగా ఇరాన్‌లో నమోదైంది. 14 రాష్ర్టాల్లో భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. మొత్తం మృతుల్లో 407మంది ఇరాన్‌కు చెందినవారే. తూర్పు ఇరాక్‌లోని హలబ్జా నగరానికి 31కిలోమీటర్ల దూరంలో.. ఇరాన్‌లోని కెర్మన్‌షా రాష్ట్రంలోని జాగ్రోస్ పర్వతప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంపం తీవ్రతకు ఇరాన్-ఇరాక్ సరిహద్దుల్లోని గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నగరాల్లో భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి. భూకంపం వల్ల తమ దేశంలో ఏడుగురు చనిపోయారని, 535 మంది గాయపడ్డారని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది.

టెహ్రాన్, నవంబర్ 13:ప్రకృతి బీభత్సానికి ఇరాన్, ఇరాక్ అతలాకుతలమయ్యాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో 7.3 తీవ్రతతో ఆదివారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 407కు చేరిందని ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ప్రకటించింది. 6700 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. భూకంపం కారణంగా తమ దేశంలో ఏడుగురు చనిపోయారని, 535 మంది గాయపడ్డారని ఇరాక్ ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు ఇరాక్‌లోని హలబ్జా నగరానికి 31కిలోమీటర్ల దూరంలో.. ఇరాన్‌లోని కెర్మన్‌షా రాష్ట్రంలోని జాగ్రోస్ పర్వతప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలానికి 23.2 కిలోమీటర్ల లోతున భూకంపకేంద్రం ఉందని, దాని కారణంగా భూకంప పరిధి, తీవ్రత పెరిగిందని అమెరికా జియాలజికల్ సర్వే ప్రకటించింది. మధ్యధరా తీర ప్రాంతంలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా దీనిని భావిస్తున్నారు.
IRAN1
పెనుతీవ్రతతో భూమి కంపించడంతో ఇరాన్‌లోని 14 రాష్ర్టాలు అతలాకుతలమయ్యాయి. వందలాది సంఖ్యలో ఇండ్లు, భవంతులు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుని వందల సంఖ్యలో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారిని కాపాడేందుకు అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ప్రాణాలతో బయటపడిన వారు రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆప్తుల్ని కోల్పోయినవారి రోదనకు అంతే లేదు. శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారి కోసం గాలిస్తున్న హృదయ విదారక దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. భూకంపం తర్వాత మరో 500 సార్లు ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు క్షణక్షణం భయంగా గడుపుతున్నారు. కెర్మన్‌షా రాష్ట్రంలోని సర్పోలే జహాబ్ నగరం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఒక్క నగరంలోనే 142మంది వరకు చనిపోయినట్లు నిర్ధారించారు. మా అపార్ట్‌మెంట్ ఉన్నట్టుండి ఊగడం ప్రారంభించింది. మేమంతా భయపడిపోయాం, బయటకు పరిగెత్తాము. మేం రోడ్డుపైకి రాగానే బిల్డింగ్ కుప్పకూలింది అని 49 ఏండ్ల గృహిణి కోకబ్ ఫర్ద్ రోదిస్తూ తెలిపారు. నీరు దొరకక సర్పోలే జహాబ్ వాసులు అవస్థలు పడుతున్నారు.
IRAN2
ఇరాన్, ఇరాక్‌లలోని పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోపాటు, టెలిఫోన్, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నదని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం సాధ్యమైనంత తొందరగా పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నించాలని ఇరాన్ నేత అయాతుల్లా అలీ ఖొమేనీ కోరారు. సైన్యం కూడా సహాయచర్యల్లో పాల్గొనాల్సిందిగా ఇరాక్ ప్రధానమంత్రి హైదరల్ ఆబాదీ ఆదేశాలిచ్చారు. ఇర్బిల్ నుంచి బాగ్దాద్ వరకు ఇరాక్ అంతటా భూకంప ప్రభావం కనిపించిందని, వందల ఇండ్లు ధ్వంసమయ్యాయని ఇరాక్ అంతర్గత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సాద్‌మాన్ వెల్లడించారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న హలాబ్జా నగరం.. 1988లో సద్దాం హుస్సేన్ రసాయనాలు ప్రయోగించి 5000మందిని ఒకేసారి మట్టుబెట్టిన ప్రాంతంగా చరిత్రలో నిలిచిపోయింది. 2003లో ఇరాన్‌లోని బామ్ నగరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించడంతో 26వేలమంది చనిపోయారు. 2012లో అజర్‌బైజాన్‌లో వచ్చిన భూంకంపానికి 300మంది మృత్యువాతపడ్డారు.
IRAN3

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి


ఇరాక్-ఇరాన్ భూకంపంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఉత్తర ఇరాక్ ప్రాంతంలోని బాధితుల కోసం టర్కీ వైద్యసామగ్రి, ఆహారంతో కూడిన 33ట్రక్కులతోపాటు సహాయచర్యల కోసం ఆర్మీ విమానాన్ని పంపింది. వీటితోపాటు 3000 టెంట్లు, హీటర్లు, 10వేల బెడ్లు, బ్లాంకెట్లు పంపినట్లు రెడ్‌క్రాస్ టర్కీ ఉపాధ్యక్షుడు కెరెం కినిక్ తెలిపారు.

752

More News

VIRAL NEWS