గ్రీన్‌కార్డు కావాలా..151 ఏండ్లు ఆగాల్సిందే!

Sun,June 17, 2018 02:44 AM

Indians with advanced degrees may have to wait 151 years for green card says US think tank

-ఈబీ-2 దరఖాస్తుదారులకు పట్టే సమయం ఇది
-గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న 6.32 లక్షల మంది భారతీయులు
-అమెరికన్ మేథో సంస్థ నివేదికలో వెల్లడి

వాషింగ్టన్, జూన్ 16: స్థానికంగా అడ్వాన్స్‌డ్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోవాలని.. గ్రీన్‌కార్డు (శాశ్వత నివాస అనుమతి) పొంది అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని భావించే భారత యువతకు ఇది చేదువార్తే. అమెరికాలో పనిచేస్తూ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్‌కార్డు రావాలంటే 151 ఏండ్లు పడుతుందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే మేథో సంస్థ కాటో ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. గ్రీన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను అమెరికా పౌరసత్వం, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) ఇటీవల విడుదల చేసిన నేపథ్యంలో కాటో ఇన్‌స్టిట్యూట్ భారతీయులు గ్రీన్‌కార్డు పొందేందుకు పట్టే సమయాన్ని లెక్కగట్టింది. 2017లో జారీచేసిన గ్రీన్‌కార్డుల సంఖ్య ఆధారంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న భారతీయ ఈబీ-2 వీసాదారులకు 151 ఏండ్లు పడుతుందని ఆ సంస్థ విశ్లేషించింది.

ఎదురుచూస్తున్న 6.32 లక్షల మంది..

గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న ఎన్నారైలు, వారి భాగస్వాములు, పిల్లల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. 2018 ఏప్రిల్ 20 నాటికి ఈ సంఖ్య 6,32,219కి చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. అయితే ఈబీ-1 (ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్-1) వీసా కింద అమెరికాలో పనిచేసే అసాధారణ నైపుణ్యం ఉన్న భారతీయులకు మాత్రం గ్రీన్‌కార్డు చాలాతక్కువ సమయంలో లభిస్తున్నది. వీరు గ్రీన్‌కార్డు పొందాలంటే కేవలం ఆరేండ్లు సరిపోతుందని కాటో ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఈబీ-1 విభాగంలో 34,824 మంది అసాధారణ నైపుణ్యం ఉన్న భారతీయులు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి కుటుంబ సభ్యులు, పిల్లలు కలిపి మరో 48,754 మంది ఉన్నారు. ఈ విభాగంలో మొత్తం కలిపి 83,578 మంది గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీలు కలిగి ఉండి, ఈబీ-3 విభాగంలో దరఖాస్తు చేసుకున్న భారతీయులు గ్రీన్‌కార్డు కోసం 17 ఏండ్లు వేచిచూడాల్సి ఉంటుంది. ఈ విభాగంలో ఏప్రిల్ 20 నాటికి 54,892 మంది భారతీయ నిపుణుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి జీవిత భాగస్వాములు, పిల్లలను కలుపుకుని 1,15,273 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

దురదృష్టవంతులంటే ఈబీ-2 దరఖాస్తుదారులే..

అత్యధిక నైపుణ్యం, అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగిన ఈబీ-2 విభాగం దరఖాస్తుదారులను దురదృష్టం వెంటాడుతున్నది. వీరి సంఖ్య భారీగా ఉండటంతో ప్రస్తుత వీసా జారీ రేటు ప్రకారం వీరికి గ్రీన్‌కార్డు అందాలంటే 151 ఏండ్లు పడుతుందని కాటో ఇన్‌స్టిట్యూట్ వెల్లడించింది. చట్టంలో ఏవైనా మార్పులు జరిగితే తప్ప వీరు గ్రీన్‌కార్డు పొందే అవకాశం లేదనే చెప్పాలి. యూఎస్‌సీఐఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈబీ-2 విభాగంలో 2,16,684 మంది దరఖాస్తుదారులు, అదే సంఖ్యలో వారి జీవిత భాగస్వాములు కలిపి మొత్తం 4,33,368 మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అన్ని విభాగాలను కలుపుకుంటే 3,06,400 మంది దరఖాస్తుదారులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు 3,25,819 మంది.. మొత్తం 6,32,219 మంది గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నారు.

2017లో జారీఅయినవి 22 వేలు..

గత ఏడాది మొత్తంగా భారతీయులకు జారీ అయిన శాశ్వత నివాస కార్డులు (గ్రీన్‌కార్డులు) కేవలం 22,602 మాత్రమే. ఇందులో ఈబీ-1 క్యాటగిరీలో 13,082 గ్రీన్‌కార్డులు జారీ కాగా ఈబీ-2 విభాగంలో 2,879.. ఈబీ-3 క్యాటగిరీలో 6,641 గ్రీన్‌కార్డులు జారీఅయ్యాయి.

గుదిబండగా మారిన 7% పరిమితి

అమెరికాలో ప్రతీ విభాగానికి కనీసం 40,040 గ్రీన్‌కార్డులను కేటాయిస్తారు. ఒక విభాగంలో డిమాండ్ భారీగా ఉన్నంత మాత్రాన ఈ కార్డులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి సర్దుబాటు చేయడం అనేది ఉండదు. ప్రతి దేశానికి ఉండే ఏడు శాతం పరిమితి ప్రకారం ఈబీ-2 విభాగం వారికి గ్రీన్‌కార్డులు కేటాయిస్తారు. దీంతో భారతీయులు ఈ విభాగంలో ఏడు శాతానికి మించి గ్రీన్‌కార్డులు పొందలేకపోతున్నారు. ప్రతి దేశానికి ఏడు శాతం పరిమితి అనే నిబంధన.. ఆ క్యాటగిరీలో పూర్తిస్థాయి దరఖాస్తులు వచ్చినప్పుడు మాత్రమే వర్తిస్తుంది. అంటే కొన్ని గ్రీన్‌కార్డులు వృథా అయ్యే పరిస్థితి ఉన్నప్పుడు వాటిని భారతీయులకు కేటాయిస్తారు. దీనిప్రకారం భారతీయులు ఏడుశాతానికి మించి గ్రీన్‌కార్డులు పొందుతారు. 2017లో ఈబీ-3 విభాగంలో జారీచేసిన మొత్తం గ్రీన్‌కార్డుల్లో భారతీయులు దాదాపు 18 శాతం గ్రీన్‌కార్డులు పొందారు. దీని ప్రకారం భవిష్యత్తులో ఈబీ-2 విభాగంలో ప్రతి దేశానికి ఉండే కోటా ప్రకారం పూర్తిస్థాయిలో దరఖాస్తులు రాకపోతే.. భారతీయులు వేచి ఉండే సమయం తగ్గిపోతుందన్నమాట. ప్రతి దేశానికి ఉండే కోటా దరఖాస్తుల్లో అస్థిరతపై భారతీయుల అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఈబీ-3 దరఖాస్తుదారులు 2017లో ఎన్ని గ్రీన్‌కార్డులు పొందారో అన్ని గ్రీన్‌కార్డులను గనుక ఈబీ-2 దరఖాస్తుదారులు భవిష్యత్తులో పొందితే 151 ఏండ్ల సమయం 65 ఏండ్లకు తగ్గిపోతుంది. మరోవైపు ఈబీ-3 విభాగానికి సంబంధించి కోటా ప్రకారం పూర్తిగా దరఖాస్తులు వస్తే.. భారతీయులు గ్రీన్‌కార్డు పొందేందుకు 17 ఏండ్లు కాకుండా 40 ఏండ్లు పడుతుంది.

867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles