ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతం

Tue,February 13, 2018 02:06 AM

Indian prime minister Modi wraps up Oman visit after visiting Sultan Qaboos Grand Mosque

-ఒమన్ రాజు ఖబూస్‌తో ప్రధాని మోదీ విస్తృత చర్చలు
-ఇరుదేశాల మధ్య 8 కీలక ఒప్పందాలపై సంతకాలు
-ముగిసిన ప్రధాని పశ్చిమాసియా పర్యటన

Modi-muscat
మస్కట్, ఫిబ్రవరి 12: భారత్-ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు తన పర్యటన దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. చమురు సంపన్న గల్ఫ్‌దేశం ఒమన్‌లో పర్యటించాలన్న తన చిరకాల కోరిక తీరిందని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా ఆదివారం ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ సోమవారం ఉదయం రాజు ఖబూస్ బిన్ సయీద్‌తో విస్తృత చర్చలు జరిపారు. అనంతరం పలు ఒప్పందాలకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు. ఒమన్, భారత్ మధ్య వందేండ్లకు పూర్వంనుంచే ఉన్న ద్వైపాక్షిక బంధం ఈ పర్యటనతో మరింత బలపడింది. వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల్లో మున్ముందు గణనీయమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను అని మోదీ తెలిపారు. భారత్‌పట్ల, భారతీయులపట్ల విశేష ఆదరాభిమానాలు చూపుతున్న ఒమన్ ప్రజలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఒమన్ అభివృద్ధికి శ్రమిస్తున్న నిజాయితీపరులైన భారతీయుల కృషిని సుల్తాన్ ఖబూస్ అభినందించారు. ఒమన్ పర్యటనతో నాలుగురోజుల పశ్చిమాసియా పర్యటనను ముగించుకున్న ప్రధాని సోమవారం సాయంత్రం భారత్‌కు తిరుగుప్రయాణమయ్యారు. పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా ఆయా దేశాలతో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
Modi

ఒమన్‌తో 8 ఒప్పందాలపై సంతకాలు

వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనవనరులు, రక్షణ, భద్రత, ఆహారభద్రతతోపాటు పలు స్థానిక అంశాలపై నేతలిరువురూ చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌కుమార్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రక్షణ, ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారంపై భారత్, ఒమన్ దేశాలు ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయని వెల్లడించారు. దౌత్యాధికారుల, ప్రత్యేక సేవల, అధికారిక పదవుల్లో ఉన్నవారి వీసాల పొడిగింపునకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఒమన్‌లోని దుఖ్మ్ ఓడరేవును భారత్ తన రక్షణ అవసరాలకు వాడుకునేందుకు వీలుగా ఒమన్ అంగీకరించింది. ఇరుదేశాల మధ్య వాణిజ్యం రూ.35,370కోట్లకు చేరింది.

పారిశ్రామిక వేత్తలతో మోదీ భేటీ

పశ్చిమాసియాకు చెందిన పారిశ్రామిక వేత్తలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. మస్కట్‌లో జరిగిన ఇండియా-ఒమన్ వాణిజ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ పారిశ్రామికవేత్తలను కోరారు.

మస్కట్ శివాలయంలో మోదీ పూజలు

మస్కట్‌లోని పురాతన శివాలయాన్ని ప్రధాని మోదీ సోమవారం సందర్శించారు. మాత్రా ప్రాంతంలో ఉన్న ఈ మందిరాన్ని 125 ఏండ్ల క్రితం గుజరాత్‌కు చెందిన వ్యాపారులు నిర్మించారు. అనంతరం ఒమన్‌లోని అతిపెద్ద మసీదు సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును కూడా ప్రధాని సందర్శించారు.

286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles