తల్లి హత్యకేసులో భారతీయ అమెరికన్ అరెస్ట్

Tue,March 21, 2017 01:47 AM

Nalini వాషింగ్టన్, మార్చి 20: తన తల్లిని చంపిన కేసులో 17 ఏండ్ల భారతసంతతి యువకుడిని అమెరికాలోని నార్త్‌కరోలినా పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ కరోలినాలోని డ్యూక్ మెడికల్ సెంటర్‌లో పనిచేస్తున్న నళిని తెల్లప్రోలు 2015 డిసెంబర్ 17న వేక్ కౌంటీ జిల్లాలోని అప్‌చర్చ్ ఫామ్స్ సబ్‌డివిజన్‌లో ఉన్న తన ఇంటిలో హత్యకు గురయ్యారు. ఆమె కొడుకు అర్ణవ్ ఉప్పలపాటి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక గ్యారేజ్‌లో తల్లి చనిపోయి ఉండటం గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె ముఖంపై ప్లాస్టిక్ బ్యాగు ఉండటంతో ఊపిరాడకుండా చేసి చంపారని గుర్తించారు. పంచనామాలో ఆమె శరీరంపై గాయాలు, ముఖం, మెడపై గాట్లు ఉన్నాయని, హత్యకు ముందు ఆమెను తీవ్రంగా కొట్టారని తేలింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ఏడాది విచారణ జరిపిన అనంతరం నళిని కుమారుడు అర్ణవ్‌ను నిందితుడిగా తేల్చారు.

ఈ మేరకు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు రుజువైతే అర్ణవ్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నదని వేక్ కౌంటీ జిల్లా అటార్నీ లోరిన్ ఫ్రీమన్ తెలిపారు. హత్య జరిగిన రోజు వాళ్ల ఇంటికి అపరిచితులు వచ్చినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. అయితే హత్యకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ వార్త నార్త్ కరోలినాలో సంచలనం రేపింది. ఇండియన్ కమ్యూనిటీ అంతా షాక్‌లో ఉన్నది. కొడుకే సొంత తల్లిని చంపిఉంటాడని ఊహించలేదు అని మొర్రిస్ విల్లే పట్టణ కౌన్సిల్‌మెన్ ఆఫ్ ఇండియన్ డీసెంట్ సతీశ్ గరిమెల్ల పేర్కొన్నారు. అర్ణవ్ తన తల్లిని చంపాడన్న విషయం తెలిసినప్పటి నుంచి మేం ఇంకా షాక్‌లోనే ఉన్నాం. ఆమె తన పిల్లలను పెంచడానికి తన శక్తిని ధారపోసింది. ఇలాంటి వార్త వింటామనుకోలేదు అని నళిని తెల్లప్రోలు స్నేహితురాలు పద్మ తుమ్మల చెప్పారు.

2368

More News

మరిన్ని వార్తలు...