యుద్ధంతో కుదేలైన ఆఫ్ఘన్‌కు లైబ్రరీనా?

Fri,January 4, 2019 02:32 AM

-భారత్ సాయాన్ని ఎద్దేవా చేసిన ట్రంప్
-ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

వాషింగ్టన్: యుద్ధంతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్థాన్‌లో గ్రంథాలయ నిర్మాణానికి భారత్ నిధులు అందజేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఆఫ్ఘన్‌లో భద్రత కోసం దాని చుట్టూ ఉన్న దేశాలు చాలినంత సాయం చేయడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి భారత్ ఎంతో కృషి చేస్తున్నదని తెలిపింది. ఆఫ్ఘన్‌కు సైనిక దళాలను పంపాలని అమెరికా పలుమార్లు ఒత్తిడి చేసినా భారత్ నిరాకరించింది. దీంతో ట్రంప్ భారత్‌పై తొలిసారి బహిరంగ విమర్శలు చేశారు. బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ట్రంప్ మాట్లాడుతూ, ఆఫ్ఘన్‌లో భద్రతకు భారత్‌తోపాటు రష్యా, పాకిస్థాన్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఆఫ్ఘన్‌లో అమెరికా వందల కోట్ల డాలర్లు వెచ్చిస్తుండగా, ఈ విషయంలో తమ దరిదాపుల్లోకి రాని ప్రపంచ దేశాల నేతలు ఆఫ్ఘన్ అభివృద్ధికి సహాయపడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.

ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ పేరును ప్రస్తావిస్తూ, ఆఫ్ఘన్‌లో ఓ గ్రంథాలయం కట్టామని ఆయన (మోదీ) నాకు పదే పదే చెప్పారు. ఆఫ్ఘన్‌లో ఐదు గంటల్లో మనం ఖర్చు పెట్టే సొమ్ముతో సమానం అది. వారు గ్రంథాలయం కట్టినందుకు మనం.. ఓహ్ మీకు ధన్యవాదాలు అని చెప్పాలి. అది ఎవరికి ఉపయోగపడుతున్నదో తెలియదు అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్.. ఆఫ్ఘన్ పునర్నిర్మాణానికి తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపింది. దాదాపు 300 కోట్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నది. 218 కి.మీ. పొడవైన రహదారి, సల్మా డ్యామ్, కొత్త పార్లమెంట్ భవనం కోసం పెట్టుబడులు పెడుతున్నామని,ఆ దేశ సైన్యానికి కావాల్సిన ఆయుధ సంపత్తిని కూడా అందిస్తున్నామని తెలిపింది.

మాకు ఉపయోగపడే నిపుణులే అమెరికాకు రావాలి

అమెరికన్ కంపెనీల ఎదుగుదలకు దోహదపడే నిపుణులే తమ దేశానికి రావాలని ట్రంప్ అన్నారు. మెక్సికో సరిహద్దులో గోడ కడితేనే అక్రమ వలసలను అరికట్టగలమని పునరుద్ఘాటించారు. వలస విధానంలో లోపాలను సరి చేయాలన్నారు. ముఖ్యంగా లాటరీ పద్ధతిలో వీసాలు జారీకి స్వస్తి చెప్పాలన్నారు. ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా అమెరికాకు వచ్చే వారిని ఎంపిక చేయాలన్నారు. మరోవైపు సిరియా నుంచి అమెరికన్ దళాలను నెమ్మదిగా ఉపసంహరిస్తామన్నారు. తమ కుర్దిష్ మిత్రులకు మాత్రం రక్షణ కల్పిస్తామన్నారు.సిరియా నుంచి ఎంత సమయంలో సైన్యాన్ని ఉపసంహరించేది ఆయన వెల్లడించలేదు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నుంచి తనకు గొప్ప లేఖ అందిందని, ఆయనతో రెండోసారి భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తానని ట్రంప్ చెప్పారు. ఈ సమావేశం సమీప భవిష్యత్‌లో జరుగుతుందని అన్నారు.

928
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles