యువతపైనే భవిష్యత్

Mon,August 19, 2019 03:26 AM

india-bhutan-to-work-closely-on-security and national-interests

-వినూత్న పరిష్కారాలతో సవాళ్లను అధిగమించవచ్చు
-అంతరిక్ష పరిశోధనలో భూటాన్‌కు భారత్ సహకారం
-ఉమ్మడి సంస్కృతీ సంప్రదాయాలతో ఇరు దేశాల మధ్య ధృడ అనుబంధం
-రాయల్ యూనివర్సిటీ ఆఫ్ భూటాన్ విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోదీ

థింపూ, ఆగస్టు 18: భావి తరాన్ని ప్రభావితం చేయగల శక్తి సామర్థ్యాలు భూటాన్ విద్యార్థులకు ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రతిభావంతులైన భూటాన్ యువత కష్టపడి పనిచేసి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఉద్బోధించారు. జీవన గమనంలో ఎదురయ్యే సవాళ్లను వినూత్న పరిష్కార మార్గాలతో అధిగమించవచ్చునని, అందుకు పరిమితుల్లేవని పేర్కొన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం భూటాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ఆదివారం భూటాన్ రాయల్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడుతూ యువతరానికి ప్రస్తుతం ప్రపంచంలో పుష్కల అవకాశాలు ఉన్నాయి. అభిరుచి, ఆకాంక్షలకు అనుగుణంగా సరైన మార్గాన్ని ఎంచుకోవడమే ముఖ్యం. భూటాన్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే క్రమంలో మీతోపాటు 130 కోట్ల మంది భారతీయులు భాగస్వాములవుతారు. భారత్ ప్రస్తుతం వివిధ రంగాల్లో చరిత్రాత్మక పరివర్తన చెందుతున్నది.

పాఠశాలల నుంచి అంతరిక్షం వరకు, డిజిటల్ చెల్లింపుల నుంచి విపత్తు నివారణ వరకు నూతన రంగాల్లో సహకారాన్ని అందించేందుకు భారత్ ఆసక్తి చూపుతున్నది. ఈ రంగాల్లో మా సహకారం మీ మాదిరిగానే యువ స్నేహితులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది అని అన్నారు. భారత జాతీయ నాలెడ్జ్ నెట్‌వర్క్, భూటాన్ డ్రక్రెన్ మధ్య సహకారాన్ని అందుకు ఉదాహరణగా చూపారు. అంతరిక్ష పరిశోధనారంగంలో సహకారం ద్వారా టెలి మెడిసిన్, దూరవిద్య, మారుమూల ప్రాంతాల్లో విపత్తుల నివారణకు హెచ్చరికల వ్యవస్థ, వాతావరణ అంచనాలు చేపట్టవచ్చు అని అన్నారు. భారత్ మాదిరిగానే సొంత ఉపగ్రహం ప్రయోగించే దిశగా భూటాన్ ప్రయాణిస్తున్నదని చెప్పారు. సొంతంగా చిన్న ఉపగ్రహాల నిర్మాణం, ప్రయోగాల కోసం భవిష్యత్‌లో యువ భూటాన్ శాస్త్రవేత్తలు భారత్‌కు రానుండటం గొప్ప సంతోషాన్నిస్తుంది. మీలో చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పారు.

జల విద్యుత్, ఇంధన రంగాల్లో భారత్, భూటాన్ మధ్య సహకారం రెండు దేశాల మధ్య సంబంధాలకు కేంద్రంగా మారుతుందని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య దశాబ్దాల స్నేహం ఉన్నదని గుర్తుచేసిన మోదీ.. ఉమ్మడి ఆధ్యాత్మిక సంప్రదాయాలు, చరిత్ర, సంస్కృతి ఇరుదేశాలు, ప్రజల మధ్య ధృడ అనుబంధానికి కారణమని పేర్కొన్నారు. పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిళ్లను అధిగమించేందుకు తాను రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం పూర్తిగా బౌద్ధుడి బోధనల ప్రభావం ఉన్నదని చెప్పారు. నిన్న (శనివారం) నాకు స్వాగతం పలికేందుకు బారులు తీరిన బాలల మోముల్లో చిరునవ్వు ఏనాటికి మర్చిపోలేను అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని లోటేయ్ షెరింగ్ కూడా పాల్గొన్నారు.

భారత్‌కు చేరుకున్న మోదీ

భూటాన్‌లో రెండు రోజుల అధికారిక పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. భూటాన్ నుంచి బయలుదేరడానికి ముందు ఆయన స్పందిస్తూ భూటాన్‌కు ధన్యవాదాలు. చిరస్మరణీయ పర్యటన. భూటాన్ ప్రజల నుంచి అందుకున్న ఆప్యాయతానురాగాలను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని వ్యాఖ్యానించారు. గత మే నెలలో దేశ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన తర్వాత మోదీ పర్యటించిన రెండో దేశం భూటాన్. థింపూలో భూటాన్ ప్రధాని లోటేయ్ షెరింగ్‌తో రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మోదీ చర్చించారు. అంతరిక్ష పరిశోధన, విమానయానం, ఐటీ, విద్యుత్, విద్య సహా పది రంగాల్లో సహకారానికి ఇరు దేశాలు 10 అంశాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.

540
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles