హెచ్1బీ వీసాదారులకు సులభంగా పౌరసత్వం

Sat,January 12, 2019 02:07 AM

In surprise outreach Donald Trump pledges to reform H-1B visa programme

-త్వరలోనే నిబంధనల్లో మార్పులు
-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
-భారతీయ నిపుణులకు ప్రయోజనకరం

వాషింగ్టన్: హెచ్1-బీ వీసాదారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభవార్త అందించారు. అమెరికాలో ఉండేందుకు, సులభంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు మార్గం సుగమం చేసేలా హెచ్1బీ విధానాల్లో త్వరలోనే మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు, అత్యంత నిపుణులైన ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగావకాశాలు పొందేందుకు వీలుగా తమ ప్రభుత్వం హెచ్1బీ నిబంధనలను సరళీకృతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ట్రంప్ శుక్రవారం ట్వీట్ చేశారు. అమెరికాలో ఉద్యోగం చేసే భారతీయ ఐటీ నిపుణులు, ఇతర ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో చట్టబద్ధంగా శాశ్వతంగా నివసించేందుకు అవసరమైన గ్రీన్‌కార్డు పొందాలంటే ప్రస్తుతం సుమారు పదేండ్లు వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది.
trump1
ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన భారతీయ నిపుణులకు ఊరటనివ్వనుంది. హెచ్1బీ వీసాల జారీ, పొడిగింపు విషయంలో తొలి రెండేండ్ల పదవీకాలంలో ట్రంప్ కఠినంగా వ్యవహరించారు. అత్యంత నిపుణులైన ఉద్యోగులను ఆకట్టుకునేందుకు, వారు అమెరికాలోనే ఉండేలా చూసేందుకు హెచ్1బీ వీసాల విషయంలో ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు.

అమెరికాకు వలసలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రతిభ ఆధారిత వలస విధానం తీసుకురావాలని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానిస్తున్న విషయం తెలిసిందే. హెచ్1బీ దరఖాస్తుదారుల్లో అత్యంత నిపుణులైన వారినే ఎంపిక చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కిర్‌స్ట్‌జెన్ నీల్సన్ గత నెలలో అమెరికా చట్టసభ్యులను కోరారు.

1866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles