డొమినికాను తాకిన మారియా


Wed,September 20, 2017 03:16 AM


-క్యాటగిరీ-5గా బలం పుంజుకున్న తుఫాన్
- నేడు పోర్టారికోను తాకే అవకాశం
-కనీవినీ ఎరుగని విధ్వంసం ఇది: డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్

సాన్‌జాన్, సెప్టెంబర్ 19: మారియా తుఫాన్ ప్రమాదకరంగా మారింది. క్యాటగిరీ-5గా బలపడిన మారియా చిన్న ద్వీపం డొమినికాపై విరుచుకుపడింది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:15 గంటల సమయంలో డొమినికా తీరాన్ని తాకినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి కానీ, బుధవారం తెల్లవారుజామున కానీ మారియా తుఫాన్ తూర్పు కరీబియన్ దీవులను, ప్రధానంగా పోర్టారికో, వర్జిన్ ఐలాండ్స్‌ను తాకవచ్చని భావిస్తున్నారు. దీని ప్రభావంతో గంటకు 260 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని అమెరికాలోని నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది. పోర్టారికో గవర్నర్ రికార్డో రోజెల్లో అత్యవసర స్థితిని ప్రకటించారు. 500 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా ముంపుప్రాంతాల్లోని ప్రజల్ని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 2015 ఏప్రిల్‌లో వచ్చిన ఎరికా తుఫాన్ తర్వాత మళ్లీ ఇప్పుడు మారియా తుఫాన్ డొమినికాను నేరుగా తాకింది. పర్వతాలతో నిండిన తమ చిన్న ద్వీపంపై మారియా విలయాన్ని సృష్టించిందని డొమినికా ప్రధాని రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ ప్రకటించారు. 73వేలమంది నివసించే డొమినికా ద్వీపంలో భారీ వర్షాలకు చాలాచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని సమాచారం.
floode

ఎగిరిపోయిన ప్రధాని ఇంటి పైకప్పు


మారియా తుఫాన్ ధాటికి తన ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని డొమినికా ప్రధానమంత్రి రూజ్‌వెల్ట్ స్కెర్రిట్ తెలిపారు. తుఫాన్ స్థితిగతులకు సంబంధించి ఆయన ఎప్పకప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్టుచేశారు. భయపడినంతా అయ్యింది. మా ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. మా ఇల్లు వరదల్లో చిక్కుకుంది. ఇప్పుడిక అంతా మారియా దయ అని రూజ్‌వెల్ట్ పోస్టు చేశారు. కొద్దిగంటల తర్వాత తనను సహాయ బృందాలు రక్షించాయని ఆయన మరో పోస్టులో తెలిపారు.

199

More News

VIRAL NEWS