రాకాసి తిండి!

Fri,February 8, 2019 01:59 AM

-కనుమరుగయ్యే దశలో 150 జాతులు
-విచ్చలవిడిగా జంతువధ
-అధ్యయనంలో వెల్లడి
-మాంసం వినియోగం విపరీతంగా పెరుగడంతో ప్రమాదం అంచున జంతుజాతులు

వాషింగ్టన్, ఫిబ్రవరి 7: మనిషి మాంసాహార అలవాటు భారీ జంతువుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మాంసం వినియోగం విపరీతంగా పెరుగడంతో కనీసం 150 జంతుజాతులు భూమిపై నుంచి కనుమరుగయ్యే ప్రమా దం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 200 జీవజాతుల సంఖ్య ఆందోళకరస్థాయిలో తగ్గుతున్నదన్నది. అమెరికాలోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ విలియం రిపిల్ అధ్యయనం చేసిన పరిశోధన ఫలితాలు కన్జర్వేషన్ లెటర్స్ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 300 జంతు జాతుల్ని విలియం బృందం అధ్యయనం చేసింది. గత 100 ఏండ్ల కాలంలో మాంసం వినియోగం భారీగా పెరిగిందని విలియం చెప్పారు. దీని వల్ల మెగా పౌనా (భారీ జంతువుల)లో 70% క్షీణించే దశలో ఉన్నాయని, 59 శాతం అంతరించి పోయే దశలో ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా మాంసం వినియోగం గణనీయంగా పెరిగింది. పెద్దసంఖ్యలో వెన్నెముక గల జంతువుల్ని వధిస్తున్నారు. భవిష్యత్‌లో వీటి ఉనికి ప్రశ్నార్థకం కావచ్చు. ఈ జాతుల్ని కాపాడాల్సిన ఆవశ్యకత పౌరులపై ఉంది. లేదంటే పర్యావరణ సమతుల్యతపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనేక సమస్యలు తలెత్తవచ్చు అని విలియం పేర్కొన్నారు. గత 500 ఏండ్లుగా వన్యప్రాణుల్ని వధించే ప్రక్రియ ఎక్కువైందని విలియం చెప్పారు.

అత్యాధునిక పరికరాలు, వస్తువులతో వేట సులువుగా మారిందని, దీంతో జంతువుల వధ పెరిగిందని పేర్కొన్నారు. ఇటీవల మాంసం వినియోగం పెరుగడంతో భారీ జంతువుల్ని విచ్చలవిడిగా వధిస్తున్నారని తెలిపారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 2 శాతం జంతుజాలం ఉనికి కనుమరుగయ్యే అవకాశం ఉందని విలియం హెచ్చరించారు. వెన్నెముక గల జంతువుల మాంసాన్ని మనుషులు అధికంగా వినియోగిస్తున్నారు. ఆసియా దేశాల్లో సంప్రదాయ వైద్యవిధానంలో జంతువుల శరీరభాగాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా వాటి జనాభా గణనీయంగా తగ్గుతున్నది అని చెప్పారు. గత 250 ఏండ్లలో రెండు రకాల భారీ తాబేళ్లలో ఒకటి 2012లో అంతరించిందని విలియం గుర్తుచేశారు. అలాగే రెండు జింక జాతులు కూడా కనుమరుగయ్యాయని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వేటగాళ్లు విజృంభిస్తున్నారని, ఉచ్చులు పెట్టి భారీ సంఖ్యలో జీవాలను హతమారుస్తున్నారని చెప్పారు. వందల ఏండ్లుగా జీవించి ఉన్న ఉభయచరాల్లో చైనాకు చెందిన సాలమండర్ కూడా అంతరించిపోయే దశలో ఉందని విలియం హెచ్చరించారు. మరో తొమ్మిది జాతులు పూర్తిగా కనుమరుగయ్యే దశలో ఉన్నాయని పేర్కొన్నారు. జనాభా విస్ఫోటనం, అభివృద్ధి పేరుతో భారీగా పర్యావరణ విధ్వంసం, పారిశ్రామికీకరణ వల్ల పెరిగిన కాలుష్యంతో జీవజాతులకు ముప్పు పెరిగిందని చెప్పారు.

1260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles