సాసేజ్ గెలాక్సీ ఢీకొనడంతో మారిన పాలపుంత రూపం

Thu,July 12, 2018 01:19 AM

How Renegade Sausage Galaxy Gave the Milky Way Its Bulge

లండన్: సాసేజ్ అనే నక్షత్రమండలం ఢీకొనడం వల్లనే మన పాలపుంత నిర్మాణ రూపం మారిపోయిందని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పాలపుంత చరిత్రలో ఈ ఘటన అత్యంత ప్రాముఖ్యమైనదని, దాని అంతర్గత, బాహ్య నిర్మాణాలకు అదే దోహదపడిందని పేర్కొన్నారు. ఈ అధ్యయన అంశాలను వారు రాయల్ అస్ట్రనామికల్ సొసైటీ వారి మాస పత్రికలో ప్రచురించారు. సుమారు 800 కోట్ల నుంచి వెయ్యి కోట్ల సంవత్సరాల క్రితం ఓ మరుగుజ్జు గెలాక్సీ మన పాలపుంతలోకి దూసుకొచ్చిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పాలపుంతను ఢీకొన్న అనంతరం ఆ గెలాక్సీ పూర్తిగా ధ్వంసమైందని, దాని శిథిలాలే ప్రస్తుతం మన చుట్టూ ఉన్నాయని వివరించారు. పాలపుంతను ఢీకొనడం వల్ల ఆ మరుగుజ్జు నక్షత్రమండలం, ముక్కలు ముక్కలుగా చెదిరిపోయిందని బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వాసిలి బెలోకురోవ్ పేర్కొన్నారు. సూదుల్లా తిన్నగా, పొడుగ్గా ఉండి రేడియల్ కక్ష్యల్లో కదులుతున్న నక్షత్రాలు దాని నుండి విడిపోయాయని తెలిపారు.

ఆ నక్షత్రాల మార్గాలు మన గెలాక్సీ మధ్యభాగానికి సమీపంగా ఉన్నాయని చెప్పారు. ఇది ఒక విపరీత సంకేతం. ఆ మరుగుజ్జు గెలాక్సీ వాస్తవ కక్ష్యలోకి ప్రవేశించింది, కానీ అది అక్కడే అంతమైపోయింది అని అన్నారు. ఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన గైయా ఉపగ్రహం అందించిన సమాచారం ఆధారంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. మన గెలాక్సీలోని నక్షత్రాల వివరాలను, పాలపుంతలో అవి ప్రయాణిస్తున్న మార్గాలను ఆ ఉపగ్రహం సేకరిస్తున్నది.

443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles