హింసకు నిలయంగా పాఠశాలలు!

Sat,September 8, 2018 02:24 AM

Half of world s children victims of violence at schools

-ప్రపంచంలో సగం మంది విద్యార్థులు హింస బాధితులే
-తోటి పిల్లలతో ఘర్షణలు .. క్రమశిక్షణ పేరిట టీచర్ల దండనలు
-డేంజర్‌జోన్‌గా స్కూళ్లు: వెల్లడించిన యూనిసెఫ్ నివేదిక

ఐరాస: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి.. వారి మానసిక, శారీరక వికాసానికి దోహదపడాల్సిన పాఠశాలలు హింసకు కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు సగంమంది పాఠశాల విద్యార్థులు ఏదో ఒక రూపంలో హింసకు బాధితులుగా మారుతున్నారు. వివిధ రకాల భయాలు, ఆందోళనల మధ్యే చిన్నారులు తమ చదువులను కొనసాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి అనుబంధసంస్థ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రెన్స్ ఫండ్ (యూనిసెఫ్) వెల్లడించింది. పిల్లలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించిన యూనిసెఫ్.. గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు..
-ప్రపంచంలోని 13-15 ఏండ్ల మధ్య వయసున్న 15 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు తోటి విద్యార్థులు జరిపే హింసలో బాధితులుగా మారుతున్నారు లేదా తోటి విద్యార్థులతో భౌతికంగా ఘర్షనకు దిగుతున్నారు.

-చాలామంది విద్యార్థులకు పాఠశాల అనేది డేంజర్ జోన్‌గా మారింది. అక్కడవారు భయపడుతూనే చదువుకుంటున్నారు.
-పిల్లలపై హింస పెరిగేందుకు వైకల్యం, పేదరికం, జాతి వంటివి కూడా కారణాలుగా మారుతున్నాయి. ఒంటరి వలస చిన్నారులు మరింత బాధితులుగా మారుతున్నారు.
-తోటివారితోనే కాకుండా తమ ఉపాధ్యాయుల నుంచి కూడా విద్యార్థులు ముప్పును ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో 72 కోట్ల మంది పాఠశాల విద్యార్థులు శారీరక దండనను నిషేధించని దేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ దేశాల్లో క్రమశిక్షణ పేరిట టీచర్లు హింసకు పాల్పడుతున్నారు.
-పిల్లలపై హింస జరుగకుండా కొత్త చట్టాలు తేవాలని, తరగతి వాతావరణాన్ని, సంస్కృతిని మార్చే చర్యలు చేపట్టాలని యూనిసెఫ్
పిలుపునిచ్చింది.

భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం

విద్యార్థులపై హింసాత్మక ఘటనలు వారు నేర్చుకునే విధానంపై, వారి శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. భౌతిక దాడులు, గ్రూపుల్లో చేరాలనే ఒత్తిళ్లు, వ్యక్తిగత లేదా ఆన్‌లైన్ బెదిరింపులు, హింసాత్మక క్రమశిక్షణ, లైంగిక వేధింపులు, సాయుధ హింస ఇలా ఏదో ఒకరూపంలో ప్రతిరోజు విద్యార్థులు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. దీర్ఘకాలంలో ఇది మానసిక వ్యాకులత (డిప్రెషన్)కు దారితీస్తుంది. కొన్నిసార్లు ఆత్మహత్య వరకు తీసుకెళ్తుంది. చాలామంది చిన్నారులకు హింస అనేది మర్చిపోలేని గుణపాఠంగా మారింది. ఇటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలని ఏ విద్యార్థీ కోరుకోడు.
- హెన్నియెట్ ఫోర్, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS