విమాన బ్లాక్‌బాక్స్, కాక్‌పిట్ లభ్యం

Tue,March 12, 2019 03:47 AM

Ethiopian airlines crash planes black box of cockpit recorder found

-ప్రమాదంపై దర్యాప్తులో ఇథియోపియాకు అమెరికా, ఇజ్రాయెల్, కెన్యా తదితర దేశాల సహకారం
-తాత్కాలికంగా బోయింగ్ విమాన సర్వీసులను నిలిపేసిన నాలుగు దేశాలు

ఎజెరే, మార్చి 11: ఇథోయోపియా రాజధాని అడ్డీస్ అబాబాకు సమీపంలో కుప్పకూలిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం బ్లాక్‌బాక్స్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ దొరికాయని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి అశ్రత్ బెగషా తెలిపారు. అయితే బ్లాక్‌బాక్స్ పాక్షికంగా దెబ్బ తిన్నదన్నారు. ముందు జాగ్రత్త చర్యగా బోయింగ్‌కు చెందిన మిగతా నాలుగు 737 మాక్స్ 8 విమానాలను వినియోగించరాదని ఇథియోపియా ఎయిర్‌లైన్స్ నిర్ణయించింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చైనా, ఇండోనేషియాతోపాటు కరేబియన్ ఎయిర్‌లైన్స్ కామన్ ఎయిర్‌వేస్ కూడా తాత్కాలికంగా బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలను నడుపరాదని నిర్ణయించాయి. ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులతోపాటు 157 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరోవైపు రెడ్‌క్రాస్ కార్యకర్తలు.. కుప్పకూలిన విమాన శిథిలాల్లో ఎవరైనా బతికి ఉన్నారా? అని పరిశీలిస్తున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న బ్లాక్‌బాక్స్ నుంచి ఏ మేరకు సమాచారం వెలికితీయగలమన్న అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇథియోపియా ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి అశ్రత్ చెప్పారు. విమాన ప్రమాద కారణాలపై దర్యాప్తులో సహకరించేందుకు ఇజ్రాయెల్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే అడ్డిస్ అబాబాకు చేరుకున్నారు. విమాన ప్రమాదంపై దర్యాప్తులో అమెరికా, కెన్యా తదితర దేశాలు కూడా సహకరించనున్నాయి.

plane-cockpit2

బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహకారం: సుష్మ

ఇథియోపియా విమాన ప్రమాదంలో మరణించిన నలుగురు భారతీయులను గుర్తించారు. వారిలో శిఖా గార్గ్ (ఐరాస అభివృద్ధి ప్రాజెక్టు కన్సల్టెంట్), పన్నగేశ్ భాస్కర్ వైద్య, హన్సిని పన్నగేశ్ వైద్య, నూకవరపు మనీషా ఉన్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల సహకారం అందిస్తామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ మేరకు ఇథియోపియా, కెన్యాలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించారు. వైద్య కుమారుడితో మాట్లాడానని, ఈ ప్రమాదంలో వారి కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించడంపై విచారం వెలిబుచ్చానని తెలిపారు. మిగిలిన బాధితుల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.

3343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles