ఇథియోపియాలో విషాదం విమానం కూలి 157 మంది మృతి

Mon,March 11, 2019 05:16 AM

Ethiopian Airlines crash kills all 157 passengers including 18 Canadians

-మరణించినవారిలో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది
-కెన్యా రాజధాని నైరోబికి బయలుదేరిన కొద్దిసేపటికేర పమాదం
-మృతుల్లో నలుగురు భారతీయులు

అడ్డిస్ అబాబా (ఇథియోపియా)/నైరోబి, మార్చి 10: ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 149 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. దీంతో విమానంలో ఉన్న అందరూ (మొత్తం 157 మంది) మరణించారు. మృతుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నారు. ఇథియోపియాకు చెందిన ఎయిర్‌లైన్ విమానం బోయింగ్ 737-800 మాక్స్ ఆదివారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం 8.38 గంటలకు రాజధాని అడ్డిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన ఆరు నిమిషాలకే విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటన బిషఫ్‌తు ప్రాంతానికి సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రమాదానికి గురైన విమానం కొత్తది. ఈ విమానాన్ని తయారు చేసిన అమెరికాకు చెందిన ఓ కంపెనీ గతేడాది నవంబర్‌లో ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు అప్పగించింది. ఎయిర్‌లైన్స్ అధికార వర్గాలు మాట్లాడుతూ విమానం గాలిలోకి ఎగిరిన ఆరునిమిషాలకే కుప్పకూలిందని తెలిపాయి. ఉదయం 8.44 గంటలకు ప్రమాదం సంభవించిందని చెప్పాయి. సహాయక చర్యలను ముమ్మరం చేశామని వివరించాయి. మరోవైపు ఇథియోపియా అధికార వార్త సంస్థ ఈబీసీ స్పందిస్తూ విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని తెలిపింది. ప్రమాద ఘటనపై ఇథియోపియా ప్రధాని కార్యాలయం స్పందించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని పేర్కొంది. రవాణా శాఖ మంత్రి జేమ్స్ మచారియా మాట్లాడుతూ ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సేవలను ప్రారంభించామని చెప్పారు.
Ethiopia1
అడ్డిస్ అబాబాలోని బోలి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఈ విమానంలో 33 దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై పలు దేశాలు స్పందించాయి. ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని తెలిపాయి. మరోవైపు ప్రమాద స్థలంలో మృతదేహాలు, విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. కాగా గతంలోనూ ఇథియోపియాలో విమాన ప్రమాదాలు సంభవించాయి. గతేడాది అక్టోబర్‌లో ఇలాంటి బోయింగ్ విమానం జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 189 మంది మరణించారు. 2010లో జరిగిన ఇథియోపియా విమాన ప్రమాదంలో 90 మంది ప్రాణాలు కోల్పోయారు.
Ethiopian
మరణించిన వారిలో కెన్యాకు చెందిన 32 మంది, ఇథియోపియా 9 మంది, కెనడా 18 మంది, చైనా, అమెరికా, ఇటలీకి చెందిన 8 మంది చొప్పున, ఫ్రాన్స్‌కు చెందిన 7 మంది, బ్రిటన్ 7 మంది, ఈజిప్టు 6 మంది, నెదర్లాండ్‌కు చెందిన ఐదుగురు, భారత్, జకస్లోవేకియాకు చెందిన నలుగురు చొప్పున ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన 12మంది కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇంకా కొంత మంది వివరాలు తెలియాల్సి ఉంది.
Dead-Bodys

ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్

విమానం గాలిలోకి ఎగిరిన కాసేపటికే పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, విమానాన్ని వెనక్కి మళ్లిస్తానని బోయిం గ్ పైలట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు కూడా విమానాన్ని వెనక్కి తీసుకురావడానికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

1258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles