సిరియాపై క్షిపణుల వాన

Sun,April 15, 2018 04:03 AM

Donald Trump says mission accomplished on perfectly executed strikes

ముప్పేట దాడి చేసిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్
-రసాయన దాడులకు ప్రతీకారంగానే సైనిక చర్య: ట్రంప్
-ఇది దురాక్రమణ చర్య: రష్యా అధ్యక్షుడు పుతిన్
-క్షిపణుల దాడిని తిప్పి కొట్టామన్న సిరియా
-పశ్చిమ దేశాల దురాక్రమణను వ్యతిరేకించిన సిరియన్ ప్రజలు

attackTrump
డమాస్కస్, ఏప్రిల్ 14: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు శనివారం సిరియాపై క్షిపణుల వర్షం కురిపించాయి. దీంతో సిరియా రాజధాని డమాస్కస్ పేలుళ్ల మోతతో దద్దరిల్లింది. ప్రాణ నష్టం జరిగినట్టు ఎటువంటి సమాచారం లేనప్పటికీ భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తున్నది. సంకీర్ణ దళాలు ప్రయోగించిన అనేక క్షిపణులను సిరియా దళాలు నేల కూల్చాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడేండ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియాలో మరోమారు యుద్ధ వాతావరణం ఏర్పడింది. వారం రోజుల క్రితం సిరియా అధినేత బషర్ అల్ అసద్ సైన్యం ఉగ్రవాదుల స్థావరంగా ఉన్న డౌమా ప్రాంతంపై రసాయన దాడులకు పాల్పడిందని ఆరోపిస్తూ సంకీర్ణ దళాలు ప్రతీకార దాడులకు తెరతీశాయి. సముద్రం నుంచి, యుద్ధ విమానాల ద్వారా వందకుపైగా మిస్సైళ్లను సిరియా రాజధాని డమాస్కస్‌పై కురిపించామని సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి. దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని రష్యా హెచ్చరించినప్పటికీ అవి తమ దాడులను కొనసాగించాయి. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కచ్చితంగా నిర్దేశిత లక్ష్యాలపైనే దాడులు చేశామని తెలిపారు. రసాయన ఆయుధాల తయారీ లేదా వాటిని నిల్వ ఉంచే ప్రదేశాలపై నిర్దిష్టంగా దాడులు చేశామని ట్రంప్ పేర్కొన్నారు. సిరియా దళాలు జరిపిన రసాయన దాడుల్లో 40 మందికి పైగా మరణించారని, ఇందుకు ప్రతిగా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ సైన్యంపై దాడులకు తనతో కలిసి రావాలన్న ట్రంప్ పిలుపునకు బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి.
Trump

అమెరికా అహంకారాన్ని నేలకూల్చాం

దాడులపై నిరసన వ్యక్తం చేస్తూ సిరియన్ ప్రజలు తమ జాతీయ జెండాలను కప్పుకొని శనివారం ఉదయం ప్రదర్శన చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచి సంకీర్ణ దళాలు దాడులు ప్రారంభించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీ పేలుళ్ల శబ్దం వినిపించిందని, ఆ వెంటనే దట్టమైన పొగ, విమానాల చప్పుడు వినిపించిందని వారు పేర్కొన్నారు. అమెరికా దాడులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న పౌరుడు నెధర్ హమ్మద్ మాట్లాడుతూ, అమెరికా మిస్సైళ్లు ఈగల్లాగా దాడి చేశాయి. వారేం చేయాలనుకుంటున్నారో చేసుకోవచ్చు. కానీ, వారి క్షిపణలను సిరియా నేలకూల్చిందని చరిత్రలో నమోదవుతుంది. కేవలం అమెరికా క్షిపణులను కాదు.. వారి అహంకారాన్ని మేము నేలకూల్చాము అని వ్యాఖ్యానించారు. సంకీర్ణ దళాలు కిరాతక దాడికి పాల్పడుతున్నాయని సిరియా విదేశాంగ శాఖ పేర్కొంది.
VladimirPutin
అయితే ఒక్కసారే సిరియాపై దాడులు చేశామని, మరిన్ని దాడులపై ఇంకా ఎటువంటి ప్రణాళిక రూపొందించలేదని అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ వెల్లడించారు. ఇదిలా ఉండగా రష్యా, ఇరాన్ తమ మిత్ర దేశం సిరియాకు అండగా డమాస్కస్‌లో ఉండరాదని ట్రంప్ హెచ్చరించారు. రష్యా ఆ చీకటి మార్గంలోనే నడుస్తుందా లేక నాగరిక దేశాలతో జత కడుతుందా తేల్చుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. తమ వైమానిక దళం సంరక్షణలో ఉన్న మెయిమిమ్ ఎయిర్ బేస్, టార్టస్ నౌకా స్థావరాల పరిధిలో పశ్చిమ దేశాలు ఒక్క క్షిపణిని కూడా ప్రయోగించలేకపోయాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సంకీర్ణ దళాలు గగనతలం నుంచి భూమిపైకి క్షిపణులను ప్రయోగించగా, సిరియా దళాలు వాటిని అడ్డుకొనేందుకు ఉపరితలం నుంచి గగనతలంపైకి క్షిపణులను ప్రయోగించాయి. సంకీర్ణ దళాలకు జర్మనీ, కెనడా మద్దతు తెలిపాయి.
attackTrump1

అనుకున్న లక్ష్యాలను సాధించాం

-సొంత ప్రజలపై రసాయన దాడులు చేయడం మానవ చర్య కాదు.. అది రాక్షస చర్య. కొన్ని నిర్దిష్ట లక్ష్యాలపై దాడులు చేయాలని అమెరికా సాయుధ దళాలను ఆదేశించాను. అనుకున్న లక్ష్యాలను సాధించాము
వైట్‌హౌస్ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Trump-May-Macron
-రసాయన ఆయుధాలు ఉపయోగించి సాధారణ స్థితిని నెలకొల్పేలా చేయడం సహించరానిది. మధ్యదరా సముద్రం నుంచి మా దళాలు క్రూయిజ్ మిస్సైళ్లను ప్రయోగించాయి. ఫైటర్ జెట్ విమానాలను సిద్ధంగా ఉంచాయి.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

-సిరియాలోనైనా, బ్రిటన్ వీధుల్లోనైనా, ప్రపంచంలో మరెక్కడైనా సరే రసాయనిక ఆయుధాల ఉపయోగాన్ని అనుమతించలేము. హోమ్స్ సిటీకి పశ్చిమాన 15 మైళ్ల దూరంలో ఉన్న మా స్థావరం నుంచి బ్రిటన్‌కు చెందిన నాలుగు టోర్నడో జెట్ విమానాలు స్టార్మ్ షాడో మిస్సైళ్లతో దాడులు చేశాయి.
- బ్రిటన్ ప్రధాని థెరిసా మే

-అంతర్జాతీయ శాంతికి, భద్రతకు సిరియా ప్రభుత్వం నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉంది. అన్ని సభ్య దేశాలు సంయమనం పాటించాలి. సిరియా ప్రజల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యేలా, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకోవాలి.
-ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరెస్

సంక్షోభం మరింత పెరుగుతుంది

attackTrump3
-ఇది దురాక్రమణ చర్య. ఈ దాడుల వల్ల సిరియాలో మానవతా సంక్షోభం మరింత ఉధృతమవుతుంది. అంతర్జాతీయ సంబంధాలపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ఈ దాడులపై చర్చించేందుకు అత్యవసరంగా భద్రతా మండలిని సమావేశపరచాలి.
-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్

-మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. ఇటువంటి చర్యలకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాము. అందుకు బాధ్యతనంతా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లే భరించాలి. రష్యా అధ్యక్షుడిని అవమానించడం ఆమోదయోగ్యం కాదు.. మేము సహించబోము
-అమెరికాలో రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్

-సిరియాపై సంకీర్ణ దళాల దాడులు ఓ పెద్ద నేరం. అమెరికా, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు, బ్రిటన్ ప్రధాని నేరస్థులు. వారు ఎటువంటి లబ్ధిని పొందలేరు. ఇదివరకు ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌పై కూడా ఇదే విధంగా దాడులకు పాల్పడ్డారు కానీ ఏమీ సాధించలేకపోయారు. - ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా అలీ ఖమేనీ

-ఐరాస నిబంధనలను బేఖాతరు చేయడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే. అంతర్జాతీయ వ్యవహారాలలో బలప్రయోగాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది. ఇతర దేశాల సార్వభౌమతాన్ని, స్వాతంత్య్రాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని పిలుపునిస్తున్నది. - ఒక ప్రకటనలో చైనా విదేశాంగ శాఖ

2123
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles