భారత టెకీలకు శుభవార్త


Fri,January 12, 2018 03:08 AM

-గ్రీన్‌కార్డుల కేటాయింపును పెంచాలని ట్రంప్ సర్కార్ నిర్ణయం
-45 శాతం పెంపుతో ఏటా 55 వేలమందికి లబ్ధి
-ప్రతినిధుల సభలో బిల్లు

GREEN
వాషింగ్టన్, జనవరి 11:అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పరుచుకోవాలనుకునే భారత ఐటీ నిపుణులకు శుభవార్త. ప్రతిభ ఆధారిత వలసలను ప్రోత్సహిస్తూ గ్రీన్ కార్డుల కేటాయింపును ఏటా 45 శాతం మేర పెంచాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభలో బుధవారం ఓ బిల్లును ప్రవేశపెట్టింది. అమెరికా భవిష్యత్ భద్రత పేరుతో ఉన్న ఈ బిల్లు సభ ఆమోదం పొందితే భారతీయ సాంకేతిక నిపుణులు భారీగా లబ్ధి పొందుతారు. ఈ చట్టం వల్ల వలసల సంఖ్య తగ్గవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఏటా సగటున 10.05 లక్షల మంది అమెరికాకు వలస వస్తుండగా, వీరి సంఖ్య 2.60 లక్షలకు తగ్గిపోవచ్చని అంచనా. కాగా గ్రీన్ కార్డుల కేటాయింపును 45 శాతం పెంచడం వల్ల ఏటా వాటిని పొందే వారి సంఖ్య 1.20 లక్షల నుంచి 1.75 లక్షలకు పెరుగనుంది.

హెచ్1బీ వీసాలపై అమెరికాకు వచ్చి గ్రీన్‌కార్డును కోరే ఇండియన్-అమెరికన్ సాంకేతిక నిపుణులు లేదా శాశ్వత నివాస హోదా పొందాలనుకొనే వారు అమెరికా భవిష్యత్ భద్రత చట్టం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఓ అనధికార అంచనా ప్రకారం గ్రీన్‌కార్డుల కోసం సుమారు ఐదు లక్షల మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. వీరు ప్రతి ఏటా తమ హెచ్1బీ వీసాలను పొడిగించుకుంటున్నారు. మరికొంతమంది కొన్ని దశాబ్దాలుగా గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. హెచ్1బీ కార్యక్రమం కింద విదేశీ సాంకేతిక నిపుణులకు అమెరికా ప్రస్తుతం తాత్కాలిక వీసాలను జారీ చేస్తున్నది. గ్రీన్‌కార్డు పొందినవారు అమెరికాలో శాశ్వత నివాసం కలిగి, అక్కడే పనిచేసుకోవచ్చు. అయితే భద్రత చట్టంలోని గొలుసు వలసల నిర్మూలన నిబంధన భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. ఈ నిబంధన వల్ల తమ జీవిత భాగస్వాములను, మైనర్లయిన పిల్లలను తప్ప ఇతర కుటుంబ సభ్యులను అమెరికాకు తెచ్చుకొనే అవకాశం ఉండదు. ప్రతిభ ఆధారిత వలస విధానం వల్ల ప్రపంచంలోని అత్యుత్తమమైన నిపుణులు మాత్రమే తమ దేశంలోకి ప్రవేశించగలరని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం భారత్, చైనా వంటి దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులకు లబ్ధి చేకూర్చగలదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
GREEN1

ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధం: ట్రంప్

ఉత్తర కొరియాతో చర్చలకు తాను సిద్ధమని, అయితే సరైన సమయంలో, సానుకూల పరిస్థితుల్లోనే ఆ దేశంతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో వెల్లడించారు. ఫోన్ సంభాషణ వివరాలను వైట్‌హౌస్ మీడియాకు విడుదల చేసింది. మూన్ జే ఇన్‌తో ఫోన్‌లో మాట్లాడానని, ఉత్తర కొరియాతో జరుగుతున్న చర్చల వివరాలను ఆయన తనతో చెప్పారని. వారి చర్చలు ఎటువంటి ఫలితాలనిస్తాయో చూడాలని ఆ తరువాత ట్రంప్ మీడియాతో చెప్పారు.
Trump

భారత్ వంటి దేశాలతో కలిసి పనిచేయడం చాలా మంచిది

భారత్, రష్యా, చైనా వంటి దేశాలతో కలిసి పనిచేయడం మంచే కాని, చెడు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యాతో సంబంధాలను పెంచుకోవాలన్న తన ఆకాంక్షపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బర్గ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచం చుట్టూ ఉన్న దేశాలతో కలిసి పనిచేయడం మంచిదేనని అన్నారు. బలమైన సైన్యం, భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలు, సమృద్ధిగా ఇంధనం కలిగి ఉండటం తన లక్ష్యమని చెప్పారు. ఉత్తర కొరియా సమస్యను ఎప్పుడో పరిష్కరించి ఉండాల్సిందని అన్నారు. ఇందుకు మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కారణమని ఆరోపించారు. బలమైన సైన్యాన్ని ఆమె సమర్థించలేదని విమర్శించారు. ఉత్తర కొరియా విషయంలో చైనాతో కలిసి పనిచేస్తున్నామని, ఇతర దేశాలోతో కూడా సమన్వయం కలిగి ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు.

1676

More News

VIRAL NEWS