స్టింగ్ ఆపరేషన్ వివరాలు వెల్లడించండి

Fri,February 8, 2019 02:01 AM

-నిర్బంధంలో ఉన్న భారతీయ విద్యార్థులకు న్యాయసహాయం అందించండి
-నిష్పాక్షిక విచారణ జరిగేలా చూడండి
-విద్యార్థుల పట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించండి

-భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సహా పలువురు చట్టసభ సభ్యుల డిమాండ్
వాషింగ్టన్, ఫిబ్రవరి 7: నకిలీ యూనివర్సిటీ కేసులో అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాలని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. అరస్టైన భారతీయ విద్యార్థులు తమ రాయబార కార్యాలయాల్ని సంప్రదించే అవకాశం కల్పించాలని, వారికి న్యాయ సహాయం అందించేందుకు అటార్నీలను నియమించాలని కోరారు. ఈ మేరకు భారతీయ అమెరికన్, కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, అమెరికా చట్టసభ సభ్యులు థామస్ సౌజి, రాబ్ ఉడాల్, బ్రెండా లారెన్స్.. హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్), యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)లకు గురువారం లేఖ రాశారు. నిర్బంధంలో ఉన్న భారత విద్యార్థుల పట్ల నిష్పక్షపాతంగా, మానవతాదృక్పథంతో వ్యవహరించాలని కోరారు.

భారత విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికార యంత్రాంగం వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వీసా గడువు ముగిసినా అమెరికాలోనే తిష్టవేసిన విదేశీ విద్యార్థులను పట్టుకునేందుకు ఫార్మింగ్‌టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ వర్సిటీని అమెరికా అధికారులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉచ్చులో మొత్తం 600 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. వీరిలో 130 మందిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 129 మంది భారతీయ విద్యార్థులు కాగా, ఒకరు పాలస్తీనాకు చెందినవారు. ప్రస్తుతం వీరంతా నిర్బంధంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిర్బంధంలో ఉన్న విద్యార్థుల హక్కులకు భంగం కలుగకుండా చూడాలని, అమెరికా చట్టాల ప్రకారం వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చట్టసభ సభ్యులు సదరు లేఖలో కోరారు. నిర్బంధంలో ఉన్న భారతీయ విద్యార్థులపై అమెరికా అధికార యంత్రాంగం అనుసరిస్తున్న తీరు పట్ల భారతీయ-అమెరికన్ సమాజం, భారత కాన్సులేట్ కార్యాలయం తీవ్ర ఆందోళనతో ఉంది.

విద్యార్థులకు న్యాయపరంగా దక్కాల్సిన అన్ని హక్కులు కల్పిస్తున్నారా? లేదా? వారి హక్కులకు ఎలాంటి పరిస్థితిలోనూ భంగం వాటిల్లరాదు. బాధిత విద్యార్థుల తరుఫున వాదించేందుకు అటార్నీని నియమించాలి. అలాగే బాండ్ ద్వారా విడుదలయ్యే అవకాశం ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల నిర్బంధం, కేసు విచారణకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత దౌత్య కార్యాలయం, భారత కాన్సులేట్‌లకు అందించాలి అని లేఖలో వారు డిమాండ్ చేశారు. హోంల్యాండ్ సెక్యూరిటీ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. స్టింగ్ ఆపరేషన్ వివరాల్ని బయటపెట్టాలని కోరారు. నకిలీ వర్సిటీ పేరుతో విదేశీ విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేసి అక్రమ వీసాలు ఇప్పించారనే ఆరోపణలతో ఇప్పటికే 8 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిర్బంధంలో ఉన్న భారతీయులను విడిపించేందుకు, న్యాయ సహాయం అందించేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

1706
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles