ఖషోగ్గి హత్య వెనుక సౌదీ యువరాజు

Thu,June 20, 2019 01:30 AM

Credible Evidence Saudi Crown Prince Liable For Khashoggi Murder

- సౌదీ, టర్కీ అధికారుల దర్యాప్తు తప్పుల తడక
- అమెరికా కేంద్రంగా దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి
- ఐరాస నిపుణురాలు ఆగ్నెస్ కాల్లామార్ట్ వెల్లడి


జెనీవా, జూన్ 19: వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు సంబంధం ఉన్నట్టు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) నిపుణురాలు ఆగ్నెస్ కాల్లామార్డ్ ఆరోపించారు. విదేశాల్లోని మహమ్మద్ బిన్ సల్మాన్ ఆస్తులను జప్తు చేయాలని పిలుపునిచ్చారు. చట్ట విరుద్ధ హత్యలు, శిక్షల అమలుపై ఐరాస నిపుణురాలు ఆగ్నెస్ కాల్లామార్ట్.. ఖషోగ్గి హత్య కేసులో మహ్మద్ బిన్ సల్మాన్‌కు నేరుగా సంబంధం ఉందన్నారు. గతేడాది అక్టోబర్ రెండో తేదీన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలో ఖషోగ్గి హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనిపై తమకు సమాచారం లేదని తొలుత బుకాయించిన సౌదీ రాజ కుటుంబం.. అంతర్జాతీయ విమర్శల నేపథ్యంలో దౌత్య కార్యాలయంలో జరిగిన ఘర్షణలో బలయ్యాడన్నది.

ఖషోగ్గి హత్యపై మరింత లోతుగా దర్యాప్తు జరుపాలని కాల్లామార్ట్ సూచించారు. దీనిపై సౌదీ, టర్కీ అధికారులు జరిపిన దర్యాప్తు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదన్నారు. సౌదీ దౌత్య కార్యాలయంలో ఖ షోగ్గి హత్యానేరం ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేశారని తెలిపారు. ఈ హత్యతో సంబంధం ఉన్న 15 మందిలో 11 మంది అనుమానితులు సౌదీలో అసలు విచారణను ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ అధికారులతోనూ చర్చించిన కాల్లామార్ట్.. ఈ కేసుపై అమెరికా కేంద్రంగా దర్యాప్తు చేపట్టడమే సరైందన్నారు.

374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles